ఆశీర్వదించండి.. ప్లీజ్!
ABN , Publish Date - Feb 08 , 2024 | 12:41 AM
సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న రోజా, వ్యూహాత్మక ఓట్ల వేటాట మొదలు పెట్టారు.
పుత్తూరు అర్బన్, ఫిబ్రవరి 7: సొంత నియోజకవర్గంలో సొంత పార్టీలోనే తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొంటున్న రోజా, వ్యూహాత్మక ఓట్ల వేటాట మొదలు పెట్టారు. కులసంఘాలను కూడగట్టుకునే పనిలో మునిగితేలుతున్నారు. వాళ్లను ఇంటికి పిలిచి విందు పెట్టి, అక్షింతలు చేతికిచ్చి ఆశీర్వదించమని సినిమా స్టయిల్లో కోరుతున్నారని ప్రచారం జరుగుతోంది. పుత్తూరు శివాలయం వీధిలో చందాలు వేసుకుని నిర్మించుకున్న బలిజ సంఘం భవనాన్ని ఏడు నెలల క్రితం దేవదాయశాఖ అధికారులు రాత్రికి రాత్రి కూలగొట్టేయడంతో ఆ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. వీరిని బుజ్జగించేందుకు ఆ వర్గంతో సమావేశం ఏర్పాటు చేసి, పుత్తూరు గోవిందమ్మ గుంటలో భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి, భూమిపూజను కూడా చేసేశారు.తన సొంత ఖర్చులతో పుత్తూరు నడిబొడ్డున శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని కూడా వాగ్దానం చేశారు. రెండు రోజుల క్రితం విజయపురం మండలం నుంచి క్షత్రియ సామాజిక వర్గ నాయకులను సైతం ఆహ్వానించి వారికి చేసిన మేళ్లను వివరించారని తెలిసింది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయపురం ఎంపీపీగా లక్ష్మీపతిరాజుకు అవకాశం దక్కకుండా చేశారనే కోపం ఈ ర్గంలో ఇప్పటికీ ఉంది. అలాగే నగరి, పుత్తూరు మున్సిపాలిటీల్లో బలమైన సామాజికవర్గం అయిన మొదలియార్లను ప్రసన్నం చేసుకునేందుకు సైతం పడరానిపాట్లు పడుతున్నారు.ఆ సామాజికవర్గంలో ఆర్థికంగా బలమైన వ్యక్తులను పరామర్శల పేరుతో నగరిలోని వారి ఇళ్లకు వెళ్లి మద్దతు కోరిన రోజా... ఇటీవల ఇంటికి ఆహ్వానించి వారి చేతిలో అక్షింతలు పెట్టి మరీ తనను మళ్లీ ఆశీర్వదించాలని సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించినట్లు చెబుతున్నారు. అయితే, ఆ సామాజికవర్గానికి ప్రధాన జీవనాధారమైన పవర్లూమ్స్ పరిశ్రమకు ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదనే అసంతృప్తి వారిలో గూడుకట్టుకొని ఉంది. బ్రాహ్మణ సంఘం నాయకులను కూడా ఇలాగే ఆహ్వానించి మద్దతు కోరారని చెబుతున్నారు. రోజా ఇంటికి వెళ్లి అక్షింతలు వేసివచ్చిన ఒక నాయకుడిని పలకరిస్తే, ‘నీ పిచ్చిగాని భయ్యా ఈ రోజుల్లో కుల సంఘం నాయకులు చెపితే ఆ సామాజికవర్గం మొత్తం ఓట్లు వేసేస్తారని ఎలా అనుకుంటావు’ అని తేల్చేశాడు.