బ్రాండెడ్ బీర్లు దాచేస్తున్నారు
ABN , Publish Date - Apr 06 , 2024 | 01:34 AM
వేసవి వచ్చిందంటే బీర్లకు సహజంగానే డిమాండ్ పెరుగుతుంది.
తిరుపతి(నేరవిభాగం), ఏప్రిల్ 5 : వేసవి వచ్చిందంటే బీర్లకు సహజంగానే డిమాండ్ పెరుగుతుంది. ఎండలకు తట్టుకోలేక మద్యం ప్రియులు బీర్లు ఎక్కువగా తాగుతుంటారు. తిరుపతి జిల్లావ్యాప్తంగా ఉన్న 40 బార్లలో రోజుకు రూ.3 కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే తాజాగా ఖర్జూరా, నాక్ అవుట్, బడ్‌వైజర్, హేవార్డ్సు 5000, కింగ్‌ఫిషర్, కార్ల్స బర్గ్ వంటి బ్రాండెడ్ బీర్లు ఎక్కడా కనిపించడం లేదు. తిరుపతిలోని 16 బార్లు, ప్రభుత్వ మద్యం షాపుల్లో బ్రాండెడ్ బీర్లు దొరకడమే గగనంగా మారింది. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బ్రాండెడ్ బీర్ల స్థానంలో జే బ్రాండ్‌గా పేరుపడ్డ ఫోస్టర్, బీరా, బూమ్, బ్లాక్ బస్టర్, ఎస్‌ఎన్‌జె, కింగ్‌ఫిషర్ స్టాండర్డ్, బ్రిటిష్ ఎంఫైర్, కింగ్‌ఫిషర్ అల్ర్టా, బడ్ వంటివి కనిపిస్తున్నాయి. వాటి ధరలు బ్రాండెడ్ బీర్లకు ఏ మాత్రమూ తగ్గడం లేదు. ఉదాహరణకు కింగ్ ఫిషర్ బీరు రూ.400 అనుకుంటే అదే జే బ్రాండ్ బీరు ఫోస్టర్, బూమ్ రూ.380కి విక్రయిస్తున్నారు.సరఫరా లేదనే పేరుతో నాసిరకం మద్యాన్నే అంటగడుతున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ అధికారిని వివరణ కోరగా బ్రాండెడ్ బీర్ల ఉత్పత్తి తగ్గిపోయిన కారణంగానే సరఫరా తగ్గించామని చెప్పారు.
గోడౌన్లకు తరలించేస్తున్నారు
ఎన్నికల సీజన్ కావడంతో వైసీపీ నాయకులు బ్రాండెడ్ బీర్లను దాచేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.తిరుపతి, శ్రీకాళహస్తి,చంద్రగిరి వంటి ప్రాంతాల్లో కొందరు వైసీపీ నాయకులు పోటీపడి బ్రాండెడ్‌తో పాటు జే బ్రాండు బీర్లను కూడా లాట్‌గా కొనుగోలు చేసి, గోడౌన్లకు తరలిస్తున్నట్లు సమాచారం. తిరుపతి శివారు ప్రాంతాల్లో ఇలాంటి గోడౌన్లు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.