Tirumala: ఎనిమిదవ రోజుకు చేరుకున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..
ABN , Publish Date - Oct 11 , 2024 | 07:13 AM
తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం 7గంటలకు రధోత్సవం జరగనుంది. రాత్రి 7 గంటలకు కల్కి అవతారం అలంకరణలో మలయప్ప స్వామి అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
తిరుమల: అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి (Sri Venkateswara Swamy) వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsawalu) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాలు శుక్రవారం నాటికి ఎనిమిదవ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం 7 గంటలకు రధోత్సవం (Radhotsavam) జరగనుంది. రాత్రి 7 గంటలకు కల్కి అవతారం (Kalki Avataram) అలంకరణలో మలయప్ప స్వామి అశ్వ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అశ్వవాహనంతో శ్రీవారి వాహన సేవలు ముగియనున్నాయి. శనివారం ఉదయం శ్రీవారి వరాహ పుష్కరిణిలో జరిగే చక్రస్నానంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
కాగా తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఏడో రోజైన గురువారం ఉదయం 8 గంటలకు బద్రి నారాయణుడి అలంకారంలో సూర్యప్రభ వాహనంపై మలయప్పస్వామి దర్శనిమిచ్చారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా.. మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యుడు సకలరోగ నివారకుడు, ఆరోగ్యకారకుడు, ప్రకృతికి చైతన్యప్రదాత. ఔషధీపతి అయిన చంద్రుడు కూడా సూర్యతేజం వల్లనే ప్రకాశిస్తూ వృద్ధి పొందుతున్నారు. ఈ ఉత్సవంలో శ్రీవారి చుట్టూ ఉన్న సూర్యప్రభ సకల జీవుల చైతన్యప్రభ, సూర్యమండల మధ్యవర్తి శ్రీమన్నారాయణుడే. అందుకే సూర్యున్ని సూర్యనారాయణుడు అని కొలుస్తున్నాం. సూర్యప్రభ వాహనంలో స్వామివారిని దర్శిస్తే ఇతోధిక భోగభాగ్యాలు, సత్సంతాన సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొన్నారు. రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. కాగా బ్రహ్మోత్సవాల కోసం విజిలెన్స్ సిబ్బంది వెయ్యి మంది, నాలుగు వేల పోలీసు సిబ్బంది విధుల్లో ఉన్నారు. స్థానిక పోలీసులు, అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్తున్నామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక నిర్ణయం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News