Reactor Explosion: ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం..
ABN , Publish Date - Aug 21 , 2024 | 05:13 PM
ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. 18 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన నలుగురు కార్మికులు చనిపోయారు.
అనకాపల్లి: రాంబిల్లి మండలం అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రియాక్టర్ పేలిన ఘటనలో నలుగురు కార్మికులు మృతిచెందగా.. 14మందికి తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులందరినీ హుటాహుటిన అనకాపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి యాజమాన్యం తరలించింది. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రమాదం ఎలా జరిగిందంటే?
ఎసెన్సియా కంపెనీలో ఉద్యోగులు, కార్మికులంతా రోజువారిగానే పని చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. దీంతో దాదాపు 18 మంది వరకు గాయపడ్డారు. వీరిని హుటాహుటిన చికిత్స నిమిత్తం అనకాపల్లికి తరలించారు. వీరిలో నలుగురు కార్మికులు మృతిచెందారు. మిగిలిన వారికి అనకాపల్లిలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. రియాక్టర్ పేలి భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. యాజమాన్యం ఇచ్చిన సమాచారం మేరకు ఎనిమిది అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది చేరుకున్నారు. మంటలు ఆర్పుతున్నారు.
మరికొందరు కార్మికులు..
పరిశ్రమలో పలువురు కార్మికులు చిక్కుకుని ఉన్నారు. వారి పరిస్థితిపై ఆందోళన నెలకొంది. భోజనం సమయంలో కావడంతో కార్మికులు పరిశ్రమ నుంచి బయటకు వచ్చారు. పెద్ద శబ్దాలతో పేలుడు జరగడంతో కొంతమంది బయటకు వచ్చారని, లేకుంటే మరింత ఘోరం జరిగేదని కార్మికులు చెప్తున్నారు. ప్రమాదంతో ఫార్మా కంపెనీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
హోంమంత్రి అనిత ఆరా..
ఫార్మా కంపెనీలో ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. మరోవైపు ప్రమాదంపై అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై వెంటనే విచారణ చేపట్టాలని ఎంపీ ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆస్పత్రి, ఘటనాస్థలి వద్ద స్థానిక నాయకులు అందుబాటులో ఉండి బాధితులకు సహాయ సహకారాలు అందించాలని పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
ఘటనా స్థలానికి కలెక్టర్, ఎస్పీ..
హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు రాంబిల్లి ఎస్సెనియా ఫార్మా కంపెనీ ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, ఎస్పీ దీపిక హుటాహుటిన సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు, సిబ్బందిని అడిగి ఆరా తీశారు. పేలిన రియాక్టర్ శకలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండవచ్చని కలెక్టర్ అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ప్రమాదంలో ఫార్మా కంపెనీ వద్దకు పెద్దఎత్తున కార్మికులు, స్థానికులు చేరుకున్నారు.
ఘటనపై సీఎం చంద్రబాబు స్పందన..
అచ్యుతాపురం సెజ్‌లోని ఎసెన్షియా కంపెనీ ప్రమాదంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఘటనపై అధికారులను అడిగి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.