‘ఎమ్మెల్యేనే అడ్డుకునేంత మగాడివా.. నువ్వెలా బతికుంటావో చూస్తా!’
ABN , Publish Date - May 23 , 2024 | 03:42 AM
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు, టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికీ నన్ను ఫోన్‌లో బెదిరిస్తున్నారు
ఎమ్మెల్యేనే రెండుసార్లు ఈవీఎంను ఎత్తిపడేశారు
ఏంటని ప్రశ్నించిన నాపై ఆగ్రహించారు
పిన్నెల్లి సోదరుల నుంచి నాకు ప్రాణహాని
బాధితుడు నంబూరు శేషగిరిరావు వేదన
అండగా ఉంటాం : చంద్రబాబు భరోసా
గుంటూరు, అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు, టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యం నిమిత్తం గుంటూరు వచ్చిన శేషగిరిరావు బుధవారం ఉదయం మాచర్ల టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పాల్వాయి గేట్ వద్ద ఉన్న పోలింగ్ కేంద్రంలో టీడీపీ ఏజెంటుగా కూర్చున్న శేషగిరిరావుపై ఎమ్మెల్యే పిన్నెల్లి సమక్షంలో అమానుష దాడి జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన మీడియా వద్ద స్పందించారు. ‘‘పోలింగ్ కేంద్రంలోకి స్వయంగా ఎమ్మెల్యేనే వచ్చి ఈవీఎంలు రెండుసార్లు ఎత్తి పడేశారు. ‘ఏంటి సార్! అలా పడేస్తున్నార’ని అడిగితే జాగ్రత్త అంటూ నాకు వేలు చూపించారు. పీవోలు గది తలుపులు వేశారు. నన్ను బయటికి పంపించారు. నేను ఇంటికి వెళుతుంటే కారులో వచ్చి కర్రలతో నాపై దాడి చేశారు. తల, చెయ్యి, కాళ్లమీద, తొడల మీద కొట్టారు. నేను చచ్చిపోతానేమోనని భయపడిన మా పిల్లలు....వారిని అడ్డుకుని నన్ను కాపాడి తీసుకెళ్లారు. నేను ఫిర్యాదు చేయడానికి భయపడ్డాను. మమ్మల్ని చంపేస్తారని భయపడి మేం మా పొలాల్లోనే దాక్కున్నాం. పోలింగ్ జరిగిన మరునాడు కారంపూడి మీద దాడి చేసిన రోజు మామీద కూడా దాడి చేస్తారని భయపడ్డాం. నాకు తగిలిన దెబ్బలకు ప్రైవేటు ఆర్‌ఎంపీతో కుట్లు వేయించుకున్నా. ఇప్పటికీ నాకు బెదిరింపులు వస్తున్నాయి. ‘ఎమ్మెల్యేనే అడ్డుకునేంత మగాడివా.. నువ్వెలా బతికుంటావో చూస్తా’నని ఫోన్ చేసి బెదిరిస్తున్నారు. నన్ను, నా కుటుంబాన్ని పోలీసులే కాపాడాలి. మాకు రక్షణ కల్పించాలి. నాకు ఏమైనా జరిగితే పిన్నెల్లి సోదరులదే బాధ్యత’’ అని శేషగిరిరావు వాపోయారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి, కనపర్తి శ్రీనివాసరావు సహకారంతో డీజీపీని కలిసి వాస్తవాలు వివరించి ప్రాణ రక్షణ కల్పించాలని కోరతానని తెలిపారు.
చంద్రబాబు భరోసా..
పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం ఘటనలో బాధితుడు నంబూరి శేషగిరిరావును టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. బుధవారం శేషగిరిరావును చంద్రబాబు ఫోన్ చేసి, ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈవీఎంను ధ్వంసం చేసిన పిన్నెల్లిని ధైర్యంగా అడ్డుకున్నావంటూ ఆయనను అభినందించారు.
Read Latest AP News and Telugu News