YS Jagan: నీచం జగన్.. ‘మంచాల నాటకం’ మొదలు!
ABN , Publish Date - Apr 04 , 2024 | 05:15 AM
వైసీపీ నీచ రాజకీయం మరోసారి బట్టబయలైంది. పింఛను సొమ్ము సకాలంలో విడుదల చేయకుండా... అవ్వాతాతలకు అందించే వీల్లేకుండా చేసి..
అవ్వా తాతలతో క్రూర పరిహాసం
ఇంత నీచమా!?
అయినా సరే.. బుధవారం తెల్లవారగానే
వైసీపీ నీచ రాజకీయానికి తెరలేపింది.
అవ్వా తాతలను పాత్రధారులను చేస్తూ
‘మంచాల నాటకం’ మొదలుపెట్టింది.
నడవలేని వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఇంటికే వెళ్లి పెన్షన్ ఇవ్వాలని స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నా... కావాలనే వృద్ధులను రోడ్ల పాల్జేసి, మండుటెండలో ఊరేగింపు తీసి,
మానవత్వాన్ని మంటగలిపింది.
ఓట్ల కోసం ఇంత నీచమా? ఇదేనా అవ్వా తాతలపైన ప్రేమ?
అస్మదీయ కాంట్రాక్టర్లకు వేల కోట్లు
వృద్ధాప్య పింఛనుకు మాత్రం ‘కోతలు’
నిధులు విడుదల చేయకుండా కుట్రలు
బ్యాంకులకు జమకాని పింఛన్ నిధులు
ఏ జిల్లాలోనూ పూర్తిగా అందని సొమ్ము
సచివాలయాలకు వృద్ధులు బారులు
డబ్బుల్లేవని చేతులెత్తేసిన సిబ్బంది
ఎండ వేడిమికి వృద్ధులు విలవిల
ఈసారి 3వ తేదీ దాకా పెన్షన్లు ఇవ్వలేమని గతనెల 28వ తేదీనే జగన్ సర్కారు చేతులెత్తేసింది.
బుధవారం మధ్యాహ్నం తర్వాతే పెన్షన్ల పంపిణీ జరుగుతుందని యంత్రాంగం అధికారికంగానే ప్రకటించింది.
అస్మదీయ కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు ఇచ్చేసిన జగన్ సర్కారు.. అవ్వా తాతలకు అవసరమైన పెన్షన్ నిధులు 1,900 కోట్లను మాత్రం తొక్కిపెట్టింది.
బుధవారం సాయంత్రందాకా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా పూర్తిస్థాయిలో పెన్షన్లకు అవసరమైన సొమ్ము జమ చేయలేదు.
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
వైసీపీ (YSR Congress) నీచ రాజకీయం మరోసారి బట్టబయలైంది. పింఛను (AP Pensions) సొమ్ము సకాలంలో విడుదల చేయకుండా... అవ్వాతాతలకు అందించే వీల్లేకుండా చేసి... ‘ఇదంతా విపక్షాల వల్లే. వలంటీర్లు లేనందువల్లే’ అంటూ దుష్ప్రచారానికి తెగబడింది. పింఛన్ల సొమ్మును అరకొరగా పంపించి గంటల కొద్దీ సమయాన్ని హరించింది. ఫలితంగా పింఛను కోసం వచ్చిన లబ్ధిదారులు లబోదిబోమన్నారు. తీవ్రమైన ఎండవేడికి తాళలేక.. నానా యాతనపడ్డారు. కనీసం పింఛన్ల పంపిణీ కేంద్రాల వద్ద సరైన వసతులు కూడా కల్పించకపోవడం ప్రభుత్వ కుట్రలో భాగమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతా అరకొరగా...
నెల్లూరు జిల్లాలోని కొన్ని మండలాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి పింఛన్ల పంపిణీ ప్రారంభం కాగా, ఆత్మకూరు వంటి మండలాల్లో సాయంత్రం 5 గంటల నుంచి గానీ పంపిణీ మొదలవలేదు. నగదు ఆలస్యంగా రావడం, వచ్చింది కూడా తక్కువేనని తెలియడంతో చాలా మంది లబ్ధిదారులు తమకు ఎక్కడ పింఛను అందదోనని ఆందోళన చెందారు. నంద్యాల జిల్లాలో దాదాపు రూ.62 కోట్లు అవసరంకాగా... రూ.50 కోట్లు మాత్రమే జమ అయినట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటల వరకు జిల్లా వాప్తంగా 26ు మాత్రమే పంపిణీ జరిగింది. ఏలూరు, నూజివీడు, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో లబ్ధిదారులు ఉదయం 8 గంటలకే సచివాలయాలకు చేరుకున్నారు. తీరా బ్యాంకుల్లో సొమ్ములు సకాలంలో జమ కాకపోవడంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత ప్రారంభమైంది. వైసీపీ నేతలు కొందరు సచివాలయానికి చేరుకుని విపక్షాలను తిట్టిపోయాలంటూ కొందరు పింఛన్‌దారులను ప్రేరేపించారు. గణపవరం మండలం కొండేపాడులో పింఛన్‌దారులకు రూ.6 లక్షలు సొమ్ములు ఇవ్వాల్సి ఉండగా, కేవలం బ్యాంకు నుంచి రూ.12వేలు మాత్రమే అందాయి.
గోదావరి జిల్లాల్లో...
కాకినాడ జిల్లాలో నిధులు ఇంకా బ్యాంకు ఖాతాలకు రాలేదని సచివాలయ ఉద్యోగులు చెప్పడంతో పలువురు ఊసూరుమంటూ వెనుదిరిగారు. మరికొందరు అరుగులు, చెట్లు నీడన ఎదురుచూస్తూ ఉండిపోయారు. జిల్లాలో సాయంత్రానికి పంపిణీ ప్రారంభించారు. అది కూడా మండలాలు, పట్టణాలు, నగరాలు వారీగా విడుదల చేయాల్సిన నిధుల్లో 50 శాతంలోపుగానే జమ చేసినట్టు సమాచారం. కోనసీమ జిల్లాలో మధ్యాహ్నం 2 గంటల వరకు బ్యాంకుల నుంచి నిధులు సచివాలయాలకు చేరలేదు. 3 గంటల తర్వాత రూ.71,43,58,500 అందాయి. అనంతరం పెన్షన్ల పంపిణీ ప్రారంభించినా 60,137 మందికి రూ.18,13,11,000 పంపిణీ చేశారు.
శ్రీకాకుళం జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కేవలం 30.29 శాతం మాత్రమే జరిగింది. బుధవారం సాయంత్రం నుంచే పింఛన్ల పంపిణీ మొదలుపెట్టారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పలుచోట్ల సామాజిక పింఛన్ల సొమ్ము విత్ డ్రా కోసం కొన్నిచోట్ల బ్యాంకుల వద్ద బుధవారం రాత్రి వరకు పంచాయతీ కార్యదర్శులు పడిగాపులు కాశారు. విజయనగరంజిల్లాలో పింఛన్ అందించేందుకు రూ.84.84 కోట్లు అవసరం. బుధవారం సాయంత్రం వరకు పింఛన్ల పంపిణీకి అవసరమైన నగదును బ్యాంకులకు జమ చేయలేదు. శృంగవరపుకోట మండలంలో 20 గ్రామ సచివాలయాల వరకు ఉన్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటల వరకు నగదు పంపిణీ చేసేందుకు రూ.10.78 లక్షలు మాత్రమే జమయ్యాయి. ఈ సొమ్మును తీసుకువెళ్లి ఎవరికి పంపిణీ చేయాలో అర్ధంకాక సచివాలయ ఉద్యోగులు తలలు పట్టుకున్నారు.
రెచ్చగొట్టు-రచ్చచెయ్యి!
పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కర్త, కర్మ, క్రియ జగన్ ప్రభుత్వమే. అయితే.. ఎన్నికల నేపథ్యంలో విపక్షాలపై దీనిని నెట్టేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొన్ని అనుకూల మీడియా చానెళ్ల ద్వారా లబ్ధిదారులను రెచ్చగొట్టి, రచ్చచేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
జూ ఏలూరు నగరంలో నూకాలమ్మ ఆలయం సమీపాన ఉన్న సచివాలయంలో వైసీపీ అనుకూల చానెల్ పింఛన్ల పంపిణీ జాప్యానికి టీడీపీనే కారణం అన్నట్టుగా లబ్ధిదారుల అభిప్రాయాలు సేకరించింది. వైసీపీ నేతలు కొందరు సచివాలయ ప్రాంగణానికి చేరకుని పింఛన్‌దారులను రెచ్చగొట్టారు. స్థానిక వైసీపీ నేత నేతర సురేశ్ ఈ తతంగాన్ని నడిపించారు. దీంతో అక్కడకు చేరుకున్న టీడీపీ నేత అజయ్ లబ్ధిదారులను రెచ్చగొడుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఇరుపక్షాలను పంపించివేశారు.
జూ జంగారెడ్డిగూడెం మండలం ఏ.పోలవరం సచివాలయంలో నాగార్జున అనే వ్యక్తి పింఛన్‌దారులను రెచ్చగొట్టారు. టీడీపీపై నిందలు ఎలా వేయాలో వివరించారు. అతనికి మరికొందరు వైసీపీ నేతలు వత్తాసు పలికారు. దీన్ని గమనించి స్థానిక పాత్రికేయులు సచివాలయం సెక్రటరీ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో నాగార్జునను పోలీసులకు అప్పగించారు.
6వ తేదీ దాకా పింఛన్లు.. ఉదయం 7 నుంచే
రాష్టవ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో భాగంగా తొలిరోజు బుధవారం 25.66 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు అందించినట్టు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్థి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తెలిపారు. పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రూ.1951.69 కోట్లు విడుదల చేసిందన్నారు. మొత్తం 14,994 గ్రామ, వార్డు సచివాలయాలకు గాను 13,669 సచివాలయాల్లో పంపిణీని ప్రారంభించినట్టు తెలిపారు. గురువారం నుంచి ఉదయం 7 గంటలకే పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు వివరించారు. ఈ నెల 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ కొనసాగుతుందని శశిభూషణ్ కుమార్ వెల్లడించారు.
అడుగడుగునా అబద్ధాలే!
సామాజిక పింఛన్లను బుధవారం మధ్యాహ్నం నుంచి పంపిణీ చేస్తామని సెర్ప్ సీఈవో ముందుగానే పేర్కొన్నారు. అయితే, వైసీపీ రెచ్చగొట్టే రాజకీయం చేయడంతో పలు జిల్లాల్లో లబ్ధిదారులు ఉదయం నుంచే ఆయా సచివాలయాలకు చేరుకుని వేచి చూశారు. అయితే, ప్రభుత్వం ఉద్దేశ పూర్వక నిర్లక్ష్యం ఇక్కడ కూడా కనిపించింది. సచివాలయాల్లో టెంట్లు వేయాలని, తాగు నీరు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించినా క్షేత్రస్థాయిలో ప్రభుత్వ సిబ్బంది దీనిని అసలు పట్టించుకోలేదు. దీంతో కనీసం తాగునీరు కూడా లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఇక ఇదే అదునుగా అధికార పార్టీ నేతలు పింఛన్ల పంపిణీ ఆలస్యానికి విపక్ష టీడీపీనే కారణమంటూ అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేశారు.
విపక్షాలపై ‘ఐవీఆర్‌ఎస్’ విషం!
పెన్షన్ల జాప్యానికి ప్రతిపక్ష పార్టీల అధినేతలే కారణమంటూ పెన్షనర్లకు, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఐవీఆర్‌ఎస్ వాయిస్ కాల్స్ వచ్చాయి. విపక్ష పార్టీలపై బురదజల్లుతూ.. రాజకీయ ఘర్షణలకు తావిచ్చేలా కుట్రపూరితంగా ఈ ఐవీఆర్‌ఎస్ కాల్స్ రావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు ఈ ఐవీఆర్‌ఎస్ కాల్స్ వచ్చాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ల కారణంగానే.. పెన్షనర్లకు ఈ పరిస్థితి వచ్చిందంటూ.. వేర్వేరుగా వారి మీద బురదజల్లుతూ కాల్స్ వచ్చాయి.
సర్కారు నిర్లక్ష్యాలు ఇవీ
నెల్లూరు జిల్లాలో తొలిరోజు 26ు మాత్రమే పింఛన్లు పంపిణీ.
ఏలూరు జిల్లా గణపవరంలో రూ.6 లక్షలకు గాను రూ.12 వేలే నిధులు.
కాకినాడ జిల్లాలో 50 శాతం నిధులే రాక.
కోనసీమ జిల్లాలో 25.38 శాతం మాత్రమే పంపిణీ
అమలాపురం రూరల్ పేరూరు-4 సచివాలయానికి వచ్చిన వృద్దుడు కురసాల నరసింహమూర్తి ఎండ వేడిమికి తాళలేక స్పృహ కోల్పోయారు.
శ్రీకాకుళంలోని మెజారిటీ సచివాలయాల్లో రాత్రి 8 గంటల తర్వాత నిధులు జమ.
టెక్కలి మండలం నర్శింగపల్లి సచివాలయానికి రూ.15.23 లక్షలు ఇవ్వాల్సి ఉండగా 6.15 లక్షలే అందింది.
టెక్కలి మండలంలో కొన్ని సచివాలయాలకు రూ.లక్ష లోపే నగదు జమైంది. దీంతో పింఛన్‌దారులు ఇబ్బందులు పడ్డారు.
శృంగవరపుకోట పంచాయతీలోని ఓ సచివాలయానికి చెందిన పింఛన్‌దారులకు రూ.19.51 లక్షలు అవసరం. కానీ, బ్యాంకులో రూ.80.662 మాత్రమే జమకావడంతో పంపిణీ చేపట్టలేదు.
విజయనగరంలో అరకొర నిధులతో ప్రారంభం కాని పింఛన్ల పంపిణీ.
రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా టెంట్లు కానీ, తాగునీటి వసతి కానీ కల్పించలేదు.