Ganta Srinivasa Rao: గుడివాడ అమర్‌నాథ్‌కు గంటా స్ట్రాంగ్ కౌంటర్..
ABN , Publish Date - Jul 18 , 2024 | 11:05 AM
నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన ట్విట్టర్ కామెంట్స్‌కు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. కబ్జా కాండతో విశాఖను చిగురుటాకులా వణికించిన చరిత్ర మీదని విమర్శించారు.
విశాఖ: నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చేసిన ట్విట్టర్ కామెంట్స్‌కు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. కబ్జా కాండతో విశాఖను చిగురుటాకులా వణికించిన చరిత్ర మీదని విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టినా ఇంకా మీకు సిగ్గు రాలేదని విమర్శించారు. మేము అధికారం చేపట్టి 35 రోజులే అయ్యిందని.. కానీ ఎర్ర మట్టి దిబ్బల్లో 6 నెలల నుంచి పనులు జరుగుతున్నాయన్నారు. ఎర్రమట్టి దిబ్బల దగ్గర జరుగుతున్న తవ్వకాలు ఎప్పటి నుంచి చేస్తున్నారో భీమిలి కో ఆపరేటివ్ ఎయిడెడ్ సొసైటి కార్యదర్శి సూరిబాబు గారి మాటల్లోనే విని సిగ్గుపడండని గంటా విమర్శించారు.
మా మీద బురద జల్లడం మీ కుసంస్కారానికి నిదర్శనమని గంటా శ్రీనివాసరావు గుడివాడ అమర్‌నాథ్‌ను విమర్శించారు. అధికారం అండతో భూకబ్జా కాండకు తెర తీసి ప్రశాంతమైన విశాఖను చిగురుటాకులా వణికించిన చరిత్ర మీదని ఏకిపారేశారు. మా దృష్టికి వచ్చిన వెంటనే పనులు ఆపించామని.. బాధ్యులైన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకున్నామని వివరించారు. నిజాల నిగ్గు తేల్చడానికి విచారణ కమిటీ నియమించామని.. కానీ మీరేం చేశారని గుడివాడ అమర్‌నాథ్‌ని నిలదీశారు. అధికారంలో ఉన్న ఇన్ని నెలలు మొద్దు నిద్ర నటించారన్నారు. పనులు ఆపిన మాపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఇదెక్కడి సంస్కారమని నిలదీశారు. ఈ నిర్వాకాలు భరించలేకే ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టారని పేర్కొన్నారు. మొన్నటి ఘోర ఓటమితోనైనా మీకు ఇంకా సిగ్గు రాలేదని గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుడివాడ అమర్‌నాథ్ ఏమన్నారంటే..
ఈ క్రమంలో మాజీ మంత్రి అమర్‌నాథ్ ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి 43 రోజులు. చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చిన 35 రోజుల్లోనే భౌగోళిక వారసత్వ సంపద ఎర్రమట్టి దిబ్బల వద్ద పరిస్థితి ఇది. ప్రభుత్వ పెద్దల సహకారం స్థానిక నాయకుల మద్దతుతో ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నాయి. కూటమి పాలనలో విశాఖ భవిష్యత్ ఏలా ఉండబోతుందో ఇలా చెప్పకనే చెబుతున్నారు’ అంటూ గుడివాడ అమర్‌నాథ్ విమర్శలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి...
AP News: వినుకొండలో నడిరోడ్డుపై హత్య ఉదంతంపై స్పందించిన టీడీపీ
Read Latest AP News And Telugu News