Ram Gopal Varma: అరెస్ట్ చేయొద్దని వర్మ పిటిషన్..
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:37 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మకు చుక్కెదురైంది. ఓ కేసు విషయంలో వర్మ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మకు చుక్కెదురైంది. కేసు విషయంలో వర్మ తరఫు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి కాపాడాలని హైకోర్టు ధర్మసనాన్ని కోరారు. సదరు కేసులో వర్మ అరెస్ట్ అవుతారనే భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది.
ఇదీ విషయం
అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాం గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమా కాంట్రవర్సీకి దారితీసింది. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లక్ష్యంగా సోషల్ మీడియాలో వర్మ పోస్టులు చేశారు. ఆ అంశంపై అప్పట్లో పెను దుమారం చెలరేగింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై పోస్టులకు సంబంధించి ప్రకాశం జిల్లాలో కేసు నమోదైంది. మద్దిపాడు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఆ కేసులో తనను అరెస్ట్ చేస్తారని వర్మ భావించారు. ఆ కేసును కొట్టివేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ చేయొద్దని ధర్మసనాన్ని కోరగా తిరస్కరించింది. అరెస్ట్ చేస్తారని భయం ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది.
మేమేం చేయలేం..
వర్మ కేసుకు సంబంధించి రేపు (మంగళవారం) విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ విషయాన్ని హైకోర్టు ధర్మాసనం ముందు వర్మ తరఫు న్యాయవాదులు ప్రస్తావించారు. మరింత సమయం ఇచ్చేలా పోలీసులను ఆదేశించాలని అభ్యర్థించారు. సమయానికి సంబంధించిన అంశాన్ని పోలీసుల ముందు తేల్చుకోవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అలాంటి అభ్యర్థనలు తమ ముందుద చేయొద్దని తేల్చి చెప్పింది. కేసుకు సంబంధించి వర్మకు హైకోర్టులో ఊరట దక్కకపోవడంతో ఆయన రేపు విచారణకు హాజరవుతారా..? లేదా అనే ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ వర్మ విచారణకు హాజరుకాకుంటే నేరుగా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
విశాఖ రైల్వే డీఆర్ఎం అరెస్టును ధ్రువీకరించిన సీబీఐ
బాబు అరెస్టుకు.. నా స్టేట్‌మెంట్లతో లింకా..
Read Latest AP News and Telugu News