Minister Dola:రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నీచ రాజకీయం
ABN , Publish Date - Aug 09 , 2024 | 05:44 PM
రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నీచ రాజకీయానికి పాల్పడుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి (Bala Veeranjaneya Swamy) ఆరోపించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అమరావతి: రాజకీయ లబ్ధి కోసమే వైసీపీ నీచ రాజకీయానికి పాల్పడుతోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా. డోలా బాల వీరాంజనేయస్వామి (Bala Veeranjaneya Swamy) ఆరోపించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న జగన్ పేరును ఎవరో ఆగంతకులు తొలగిస్తే వైసీపీ నేతలు నానా యాగీ చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం నాడు మంత్రి తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వీరాంజనేయస్వామి మాట్లాడుతూ... విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు మార్చి మాజీ సీఎం జగన్ తన పేరు పెట్టుకుని అంబేద్కర్‌ని అవమానించారని మండిపడ్డారు.
అంబేద్కర్ పేరు తొలగించారు..
అంబేద్కర్ పేరు తొలగించినప్పుడు వైసీపీ దళిత నేతలు ఎందుకు నోరు మెదపలేదు? అని ప్రశ్నించారు. అంబేద్కర్ గురించి మాట్లాడే అర్హత వైసీపీ నేతలకు లేదని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఎన్టీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి బాల వీరాంజనేయస్వామి ఉద్ఘాటించారు.
విజయవాడలో అంబేద్కర్ పేరు కంటే జగన్ పేరు పెద్దదిగా ఉందని ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అర్థరాత్రి అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించారని చెప్పారు. అంబేద్కర్ విగ్రహానికి ఏమీ కాలేదని అన్నారు. జగన్ పేరుతో ఉన్న బ్యాగులు కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు పంపిణీ చేశామని గుర్తుచేశారు.
ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం..
జగన్ ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్‌ని నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. దళితులు, గిరిజనులను గత ప్రభుత్వంలో మోసం చేశారని ఫైర్ అయ్యారు. 2019 ఎన్నికల్లో ఈవీఎంలు నెంబర్ వన్ అని జగన్ చెప్పారని గుర్తుచేశారు. 2024 ఎన్నికల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారని అనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. జగన్ వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవరూ ఆపలేరని తేల్చిచెప్పారు. ఈవీఎంలు రీ కౌంటింగ్ పెట్టినా తమకు భయం లేదని మంత్రి బాల వీరాంజనేయస్వామి స్పష్టం చేశారు.
వలంటీర్లను రెన్యువల్ చేస్తాం..
జగన్ ప్రభుత్వంలో అంగళ్లు, రామతీర్థం, కుప్పం వెళ్తుంటే చంద్రబాబుపై కేసులు పెట్టారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. చట్ట ప్రకారం జగన్‌కి ఇవ్వాల్సిన భద్రత ఇస్తున్నామని అన్నారు. 2023 ఆగస్టు నుంచి వలంటీర్ల ఉద్యోగాలను జగన్ ఎందుకు రెన్యువల్ చేయలేదని ప్రశ్నించారు. వలంటీర్లను విధుల నుంచి తాము తొలగించలేదని అన్నారు. జగన్ చేసిన పాపం వల్లే వలంటీర్లకి జీతాలు రావడం లేదని అన్నారు. వలంటీర్ల ఉద్యోగాలను తాము రెన్యువల్ చేస్తామని మంత్రి బాల వీరాంజనేయస్వామి వెల్లడించారు.