మంత్రాలయంలో యథేచ్ఛగా కబ్జా
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:26 AM
మంత్రాలయం రామచంద్రనగర్‌లో లక్ష్మీనారాయణశెట్టి అనే వ్యక్తి తన ఇంటి కోసం అనుమతి తీసుకుని ఏకంగా ఇంటినే లాడ్జీగా మార్చేశాడు.

సీసీ రోడ్డుపైనే బోరు
పంచాయతీ స్థలంలోనే లాడ్జీకి మెట్లు
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
మంత్రాలయం, మార్చి 27(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం రామచంద్రనగర్‌లో లక్ష్మీనారాయణశెట్టి అనే వ్యక్తి తన ఇంటి కోసం అనుమతి తీసుకుని ఏకంగా ఇంటినే లాడ్జీగా మార్చేశాడు. ఇందుకు అవసరమైన అనుమతులు తీసుకున్నప్పటికీ నీటి అవసరాల కోసం గతంలో పంచాయతీ డబ్బులతో వేసిన బోరునే శుభ్రపరిచి తన లాడ్జీకి మోటారు బిగించి నీటిని సరఫరా చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. లాడ్జీకి పంచాయతీ స్థలంలోనే మెట్లను నిర్మించారు. మురుగు కాలువలపై మెట్లు కట్టుకుని యథేచ్ఛగా లాడ్జీ నిర్మాణం కొనసాగుతుండటం, సీసీ రోడ్డు మధ్యలోనే బోరు ద్వారా లాడ్జీకి నీటి సరఫరా చేసుకోవడంపై గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు స్పందించి అక్రమంగా బోరు కనెక్షన పంచాయతీ స్థలంలో వేసుకున్న మెట్లను తొలగించాలని కోరుతున్నారు.
మెట్లను, బోరును తొలగిస్తాం
రామచంద్రనగర్‌లో కందుకూరు లక్ష్మీనారాయణ శెట్టి అనే వ్యక్తి ఇంటి స్థలానికి ఆమోదం పొంది.. దానిపైన మూడంతస్తుల లాడ్జీ నిర్మించారు. లాడ్జీ నిర్మాణానికి అనుమతులు తీసుకున్నా.. తాగునీటికి, నీటి సరఫరాకు అనుమతులు లేవు. గతంలో పంచాయతీ నిర్మించిన బోరుకే తన సొంత మోటారు తెచ్చుకుని బిగించుకోవడం, మురుగు కాలువలపై లాడ్జీకి పైఅంతస్తుకు మెట్లు వేసుకోవడాన్ని వెంటనే తొలగిస్తాం.
- జీవీ నాగరాజు, మేజర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి, మంత్రాలయం