రామవరప్పాడు ఉప సర్పంచ్‌గా అద్దేపల్లి సాంబశివనాగరాజు
ABN , Publish Date - Mar 28 , 2025 | 12:26 AM
రామవరప్పాడు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు 6వ వార్డు సభ్యుడు అద్దేపల్లి సాంబశివనాగరాజు(సాంబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఈవోఆర్డీ ఎండీ ప్రసాద్ ప్రకటించారు.

రామవరప్పాడు ఉప సర్పంచ్‌గా అద్దేపల్లి సాంబశివనాగరాజు
గుణదల, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): రామవరప్పాడు ఉప సర్పంచ్‌గా టీడీపీ మద్దతుదారు 6వ వార్డు సభ్యుడు అద్దేపల్లి సాంబశివనాగరాజు(సాంబు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఈవోఆర్డీ ఎండీ ప్రసాద్ ప్రకటించారు. ఉప సర్పంచ్ పదవి టీడీపీ ఖాతాలో పడిపోవడం పంచాయతీలో మెజారిటీ సభ్యులంతా టీడీపీకి అనుకూలంగా వ్యవహరించడంతో చేసేది లేక వైసీపీ మద్దతుదారు సర్పంచ్ వరి శ్రీదేవి కూడా టీడీపీ అభ్యర్థికే మద్దతిచ్చారు. రామవరప్పాడు పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ పదవులు వైసీపీ ఖాతాలో ఉండేవి. నెల క్రితం ఉప సర్పంచ్ వంగూరి పుణ్యవతి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామాకు కారణాలు ఏమీ లేవని కొద్దికాలం రాజకీయాలకు దూరంగా ఉండాలన్న ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. దీంతో ఉప సర్పంచ్ పదవికి ఎన్నిక నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఉప సర్పంచ్‌ను చేజార్చుకోకూడదని వారం కితం వైసీపీ సభ్యులు ఎన్నికపై నిర్ణయం తీసుకునేందుకు సమావేశానికి హాజరు కావాలని సూచిస్తే 17 మంది సభ్యులకు 9మందే హాజరయ్యారు. ఉప ఎన్నికకు 24 గంటల ముందు వరకు వైసీపీ సభ్యులు ఓ సభ్యుడిని నిలబెట్టాలని ప్రయత్నించినా అతను ముందుగానే జారుకున్నారు. ఎన్నికకు హాజరుకావాలని వార్డు సభ్యులు 20మందికి అధికారులు ఆహ్వానాలు పంపితే 17మందే హాజరయ్యారు. అందులో ఇద్దరే వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారు. 18వ వార్డు సభ్యులు చిన్నా సుధను ఉపసర్పంచ్‌గా పోటీకి నిలబెడుతున్నట్లు 7వ వార్డు సభ్యురాలు లోకసాని లక్ష్మి ప్రతిపాదించినా సభ్యులు సానుకూలత వ్యక్తం చేయలేదు. ఉప సర్పంచ్‌గా రాజీనామా చేసిన వంగూరు పుణ్యవతి అద్దేపల్లి సాంబశివనాగరాజును ప్రతిపాదించారు. సభ్యులంతా మద్దతు ప్రకటించారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రసాదంపాడు మాజీ సర్పంచ్ బొప్పన హరికృష్ణ, టీడీపీ సీనియర్ నాయకుడు గుజ్జర్లపూడి బాబూరావు తదితరులు అభినందనలు తెలిపారు. పంచాయతీ కార్యాలయానికి భారీ సంఖ్యలో చేరుకున్న టీడీపీ అభిమానులు అద్దేపల్లికి అభినందనలు తెలిపారు.