Minister Nimmala: కోనసీమలో వెంటనే మొదలు పెట్టండి.. రంగంలోకి దిగిన మంత్రి నిమ్మల
ABN , Publish Date - Sep 10 , 2024 | 03:41 PM
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు, డ్రెయిన్లు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటి గట్ల పరిస్థితిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో కాలువలు, డ్రెయిన్లు, చెరువులు, రిజర్వాయర్లు, ఏటి గట్ల పరిస్థితిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న చెరువులు, రిజర్వాయర్లు, ఏటి గట్లు, కాలువలను వెంటనే గుర్తించాలని మంత్రి నిమ్మల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యుద్ధప్రాతిపదికన గండ్ల మరమ్మతు పనులు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ప్రణాళిక సిద్ధం చేసి పనులు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
అప్రమత్తంగా ఉండండి..
కాకినాడ జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్‌కు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 45,000క్యూసెక్కుల వరదనీరు వచ్చిందని మంత్రి నిమ్మల తెలిపారు. ఫ్లడ్ మెనేజ్మెంట్ సరిగ్గా చేయడం వల్ల నష్ట తీవ్రతను తగ్గించగలిగామని పేర్కొన్నారు. ధవళేశ్వరం ప్రాజెక్టుకు ప్రస్తుతం 7లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోందని, ఇవాళ(మంగళవారం) సాయంత్రానికి 10లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని మంత్రి వెల్లడించారు. సాయంత్రానికి మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉండడంతో గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి హెచ్చరించారు. కొల్లేరు అవుట్ ఫ్లో పెంచడానికి అడ్డంకిగా ఉన్న కిక్కీసను తొలగించాలని అధికారులను ఆదేశించారు. వరదనీటితో రాయలసీమకు సంబంధించిన రిజర్వాయర్లు, చెరువులు అన్నీ నింపి ప్రతిరోజూ నివేదిక అందించాలని సూచించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జి.సాయిప్రసాద్, ఈఏన్సీ ఎం.వెంకటేశ్వరరావు, సహా పలువురు నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.
కోమసీమకు వరద ముప్పు..
మరోవైపు అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు భారీ వరద ముప్పు పొంచి ఉందని కలెక్టర్ మహేశ్ కుమార్ వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా ప్రజలు మరో 72గంటలపాటు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు. ఇవాళ సాయంత్రానికి 10లక్షల క్యూసెక్కులు వరదనీరు ధవలేశ్వరం నుంచి దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అలాగే రేపటికల్లా 13లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీ నుంచి దిగువకు వదిలి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని మహేశ్ కుమార్ వెల్లడించారు. భారీగా వరదనీరు దిగువకు వచ్చే అవకాశం ఉండడంతో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. లంక ప్రాంతాల్లో 17చోట్ల గోదావరి పాయలు దాటేందుకు ఇంజిన్ బోట్లు ఏర్పాటు చేశామని, ప్రజలను కాపాడేందుకు జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ చెప్పారు. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పడవలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CM Chadrababu: ఇవాళ చంద్రబాబు పెళ్లిరోజు.. అయినా సరే..
Janasena: జనసేన జెండాకు ఘోర అవమానం.. భగ్గుమన్న జనసైనికులు
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Andhra Pradesh News and Latest Telugu News