Swiggy: స్విగ్గీ అమ్మకాల నిలిపివేతపై వెనక్కి తగ్గిన హోటళ్లు..
ABN , Publish Date - Oct 10 , 2024 | 08:30 PM
ఏపీలో స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించిన హోటళ్ల యాజమాన్యాలు కాస్త వెనక్కి తగ్గాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్న స్విగ్గీపై హోటల్, రెస్టారంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
విజయవాడ: ఏపీలో స్విగ్గీని బహిష్కరించాలని నిర్ణయించిన హోటళ్ల యాజమాన్యాలు కాస్త వెనక్కి తగ్గాయి. నగదు చెల్లింపులు చేయకుండా ఇబ్బంది పెడుతున్న స్విగ్గీపై హోటల్, రెస్టారంట్ యాజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 14 నుంచి అమ్మకాలు నిలిపివేయాలని ఇటీవల నిర్ణయించారు. అయితే గురువారం విజయవాడలో స్విగ్గీ యాజమాన్య బృందం, హోటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాయి.
హోటల్స్ అసోయేషన్ అధ్యక్షుడు ఆర్‌వీ స్వామి, కన్వీనర్ రమణరావు తదితరులు కలిసి 12 అంశాలపై స్విగ్గీ బృందంతో చర్చించారు. స్విగ్గీ ముందుంచిన అన్ని డిమాండ్లకు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ-మెయిల్ ద్వారా తమ నిర్ణయాలను వెల్లడిస్తామని స్విగ్గీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ మేరకు స్విగ్గీతో చర్చల సందర్భంగా చేసుకున్న ఒప్పందాలు నవంబరు 1 నుంచి అమల్లోకి వస్తాయని అసోయేషన్ ప్రకటించింది.