YS Sharmila: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్.. ఏమన్నారంటే?
ABN , Publish Date - Sep 15 , 2024 | 02:51 PM
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే అందని ద్రాక్షలా వైద్య విద్య మారిందని, పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అని ఆమె అడిగారు.
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేసి వైద్య విద్యను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చూస్తున్నారా అని ఆమె ప్రశ్నించారు. ఇప్పటికే అందని ద్రాక్షలా వైద్య విద్య మారిందని, పేద విద్యార్థులకు మరింత దూరం చేసే ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? అని ఆమె అడిగారు.
‘‘ గుజరాత్ పీపీపీ విధానంపై ఎందుకు అధ్యాయనం చేయాలని అనుకున్నారు?. జరుగుతున్న ప్రచారంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే నోరు విప్పాలి. ప్రైవేటీకరణపై సమాధానం చెప్పాలి. కూటమి సర్కార్‌లో భాగస్వామ్య పక్షంగా ఉండి ఈ ఏడాది పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పాడేరులలో 5 కొత్త కాలేజీలలో వసతులను కల్పించలేమని, నిర్వహించడం సాధ్యపడదని, అదనపు సీట్లు కూడా అవసరం లేదని మెడికల్ బోర్డుకి లేఖ రాయడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది’’ అని షర్మిల అన్నారు.
ప్రభుత్వ రంగంలో అదనపు సీట్లు వస్తుంటే ఏ రాష్ట్రమైనా వద్దనుకుకుంటుందా?, ఇది కూటమి సర్కారుకు సిగ్గుచేటు అని షర్మిల విమర్శించారు. ‘‘కొత్తగా 750 సీట్లు సమకూరకపోవడం మీ నిర్లక్ష్యం ఫలితమే. లక్షలు పోసి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్న పిల్లల భవిష్యత్‌ను అగమ్య గోచరంగా మార్చారు. విద్యార్థుల ఆశలను నీరు గార్చారు. మెడికల్ సీట్ల కోసం పక్క రాష్ట్రాల బాట పట్టేలా చేస్తున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ విధానం పెట్టి వైసీపీ సర్కార్ మెడికల్ సీట్లను అమ్ముకుంటే ఆ విధానాన్ని రద్దు చేస్తామని మాట ఇచ్చిన కూటమి సర్కార్.. ఇప్పుడు అదే విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త మెడికల్ కాలేజీల్లో వసతులను కల్పించి ఈ ఏడాది నుంచే వాటిని ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది’’ అని షర్మిల విమర్శించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు.