జంతర్‌మంతర్ జగన్మాయ!
ABN , Publish Date - Oct 28 , 2024 | 05:31 AM
మన దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. చాలామంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. పలువురిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి.
అధికారమే పెట్టుబడిగా అక్రమ కుబేరుడి అవతారం
సొంతంగా విజయవంతమైన వ్యాపారాలు లేవు. సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్‌లా అసాధారణ ప్రతిభావంతుడూ కాదు. ఆ మాటకొస్తే.. 2004 వరకు వ్యక్తిగతంగా చెప్పుకోవడానికి తనకంటూ ప్రత్యేకతలంటూ ఏవీ లేవు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకే ఆయన కుమారుడిగా బాగా ‘ఫేమస్’ అయ్యారు. 2004లో జగన్ సంపద రూ.1.74 కోట్లు (ఐటీ రిటర్నుల ప్రకారం) ఉండగా... నేడు ఆయన కుటుంబ ఆస్తి రూ.757 కోట్లు (ఎన్నికల అఫిడవిట్ ప్రకారం). మార్కెట్ విలువ ప్రకారం ఎన్ని వేల కోట్లు ఉంటుందో..! అంటే.. 20 ఏళ్లలోనే ఆయన సంపద వేల రెట్లు పెరిగింది. ఇది ఎలా సాధ్యమో..?
జగన్ సంపాదనకు నాడు తండ్రి అధికారమే పెట్టుబడి. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంపెనీలను కబ్జా చేశారు. నాడు ప్రభుత్వం నుంచి ‘మేళ్లు’ పొందిన బడా పారిశ్రామిక వేత్తల నుంచి రూ.10 విలువ చేసే షేర్‌ను వందలు పెట్టి కొనేలా వాటిలో పెట్టుబడులు పెట్టించుకున్నారు. అంటే.. క్విడ్ ప్రోకో అన్నమాట. తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జగన్ అక్రమార్జన కొండలా పెరగగా... ఆయనే ముఖ్యమంత్రి అయ్యాక ఏకంగా ఆకాశం వైపు దూసుకుపోయింది.
20 ఏళ్లలో వేల రెట్లు పెరిగిన సంపద.. 2004లో ఆయన ఆస్తి రూ.1.74 కోట్లే
2024 ఎన్నికల అఫిడవిట్‌లో 757 కోట్లు.. మార్కెట్‌లో వాటి విలువ వేల కోట్లు
తండ్రి సీఎంగా ఉండగా అక్రమార్జన.. సీబీఐ చార్జిషీట్లలో తీవ్ర అభియోగాలు
జగన్ సీఎం అయ్యాక మరింత సంపద.. రిలయన్స్, జియోలోనూ పెట్టుబడులు
భార్య భారతి, ఇద్దరు కుమార్తెల పేరిటా పెట్టుబడులు, బంగారు, వజ్రాభరణాలు
వైఎస్ సీఎం కాకముందు జగన్ ఆస్తులు ‘సున్నా’తో ప్రారంభమయ్యాయనుకుంటే తండ్రి సీఎం అయ్యాక పైపైకి దూసుకెళ్లాయి. ఇక జగన్ సీఎం అయ్యాక అవి రాకెట్ వేగం అందుకున్నాయి.
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
మన దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. చాలామంది వారసులు రాజకీయాల్లోకి వచ్చారు. పలువురిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కేసుల విచారణ కూడా ఎదుర్కొన్నారు. కానీ వైఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డిలా అక్రమార్జనలో ఎవరూ అంత ‘ఫేమస్’ కాలేదు. ఎలాంటి పదవీ లేకపోయినా ఓ సీఎం కుమారుడిగా వేల కోట్ల అవినీతికి పాల్పడటం జగన్ ఘనత. రాజకీయ నాయకులే ముక్కున వేలేసుకునేలా సొంత మీడియా, ఊరికో ప్యాలస్, వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకున్నారు. ఇంతలా అవినీతికి పాల్పడవచ్చని అప్పటి వరకూ మన దేశంలో రాజకీయ వారసులకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఆస్తుల కోసం అన్నాచెల్లెళ్లు జగన్, షర్మిల గొడవపడి రోడ్డుకెక్కడం... జగన్ ఏకంగా తల్లి విజయలక్ష్మిపైనే నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ)లో పిటిషన్ వేయడంతో జగన్ అక్రమాస్తుల విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. నాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారన్నది జనం మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. 30 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న రాజశేఖర రెడ్డి కుటుంబ ఆస్తులు ఆనాడు రూ.2 కోట్లు దాటలేదు. 2004 నాటికి జగన్ సంపద అంతంతే. కానీ, రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక అనూహ్యంగా జగన్ సంపద పెరిగింది. ఏ వ్యాపారం చేసి ఇంత సంపాదించారో ఎవరికీ అంతుపట్టదు. తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకుని ఐదేళ్లలోనే ఊహించని స్థాయిలో అక్రమార్జనకు పాల్పడ్డారు. నాడు జగన్ క్విడ్ ప్రోకో, అక్రమాలకు పాల్పడిన తీరును సీబీఐ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లలో క్షుణ్నంగా ప్రస్తావించింది.
అఫిడవిట్లలోని ఆస్తుల వివరాలు
2009 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తులు రూ.77.4 కోట్లు. 2011 ఉప ఎన్నికల్లో తన పేరు మీద రూ.365 కోట్లు, భార్య భారతి పేరు మీద రూ.47.25 కోట్లు ఉన్నట్టు పేర్కొన్నారు. 2014లో జగన్ మొత్తం చరాస్తులు రూ.313 కోట్లు, భారతి ఆస్తుల విలువ రూ.57 కోట్లు. జగన్ స్థిరాస్తులు రూ.30 కోట్లు కాగా భారతి ఆస్తుల విలువ రూ.14 కోట్లు. 2011 అఫిడవిట్‌లో జగన్ పేరిట కేజీకి పైన బంగారం, భారతి పేరిట 9 కేజీలకు పైగా బంగారం, వజ్రాభరణాలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2014లో జగన్ ఆస్తులు రూ.344 కోట్లుగా, భార్య ఆస్తులు రూ.72 కోట్లుగా చూపారు. భారతి పేరిట రూ.5.86 కిలోల బంగారం (అప్పుడు మార్కెట్ విలువ రూ.3.57 కోట్లు), ఇద్దరు కుమార్తెలు హర్షిణికి 4.19 కిలోల బంగారం, వర్షాకు 3.46 కిలోల బంగారం ఉన్నట్టు వెల్లడించారు. ఇక 2019లో జగన్ పేరిట రూ.375 కోట్లు, భారతి పేరిట రూ.124 కోట్ల ఆస్తులు ఉన్నట్టు పేర్కొన్నారు. ఇద్దరు కుమార్తెల ఆస్తుల విలువ రూ.6.5 కోట్లు, రూ.4.6 కోట్లుగా ఉన్నట్టు వెల్లడించారు.
20 ఏళ్లలో ఎన్ని రెట్లో...
గత 20 ఏళ్లలో జగన్ ఆస్తులు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. 2004లో సమర్పించిన ఐటీ రిటర్నులో ఆయన నికర ఆస్తుల విలువ రూ.1.74 కోట్లుగా చూపించారు. 2004లో రాజశేఖర రెడ్డి సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తి రూ.9.18 లక్షలు మాత్రమే. అయితే 2009 ఎన్నికల అఫిడవిట్‌లో జగన్ తన ఆస్తిని రూ.77.39 కోట్లుగా చూపించారు. దీన్నిబట్టి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు జగన్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు తెలుస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని బడా వ్యక్తులకు రాష్ట్రవనరులను దోచిపెట్టి, వారి నుంచి ప్రతిఫలంగా తన కంపెనీల్లోకి పెట్టుబడులు పెట్టించారు. అక్రమ ప్రతిఫలాలతో చేసిన వ్యాపారాలతో ఆస్తుల విలువ 2011 నాటికి రూ.445 కోట్లకు చేరింది. 2014 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల విలువ (416 కోట్లు) స్వల్పంగా తగ్గినట్టుగా చూపించారు. అయితే 2019 అఫిడవిట్‌లో ఆస్తులు రూ.510 కోట్లకు పెరిగినట్టు చూపించారు. ఆ ఏడాది సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత ఆస్తుల విలువ రూ.757 కోట్లకు పెరిగింది. జగన్ కుటుంబం మరిన్ని కొత్త కంపెనీల్లో పెట్టుబడులు పెట్టింది. 2008-09లో జగన్ రూ.2.92 కోట్ల ఆదాయ పన్ను చెల్లించారు. 2010-11 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో కనీసం రూ.22 కోట్ల పన్ను చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసి రూ.6.6 కోట్ల అడ్వాన్స్ చెల్లించారు.
జగన్ సీఎం అయ్యాక...
2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జగన్ పేరిటే రూ.529.87 కోట్ల విలువైన స్థిర,చరాస్తులున్నాయి. జగన్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.757.65 కోట్లు. వీటిలో అత్యధికం వివిధ కంపెనీల్లో వాటాలు, పెట్టుబడుల రూపంలో ఉన్నాయి. 2019లో జగన్ ఆస్తులు రూ.375.20 కోట్లు కాగా, గత ఐదేళ్లలో ఆయన ఆస్తుల విలువ రూ.154.67 కోట్లు అంటే.. 41.22 శాతం పెరిగింది. 2019లో జగన్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.510.38 కోట్లు ఉండగా, ఐదేళ్లలో రూ.247.27 కోట్లు అంటే 48.45 శాతం పెరిగింది. 2024 అఫిడవిట్‌లో జగన్, ఆయన కుటుంబీకులకు వివిధ కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నట్టు పేర్కొన్నారు. జగన్‌కు 7 కంపెనీల్లో, భారతికి 22 కంపెనీల్లో, వాళ్ల కుమార్తెలు హర్షిణి రెడ్డికి 7 కంపెనీల్లో, వర్షారెడ్డికి 9 కంపెనీల్లో పెట్టుబడులున్నట్టు చూపారు. వీరందరికీ కలిపి కంపెనీల్లో రూ.344.37 కోట్ల విలువైన పెట్టుబడులున్నాయి. జగన్ పేరిట 7 కంపెనీల్లో 263.64 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. రిలయన్స్, జియోఫైనాన్స్‌లో భారతికి పెట్టుబడులున్నట్టు చూపారు. ఆమె పేరిట రూ.69.42 కోట్ల పెట్టుబడులు, 11 కంపెనీల్లో రూ.53.84 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. సండూర్ పవర్, సరస్వతీ పవర్, కీలాన్ టెక్నాలజీస్, క్లాసిక్ రియాలిటీ, సిలికాన్ ఇన్‌ఫ్రా, సిలికాన్ బిల్డర్స్, హరీష్ ఇన్‌ఫ్రా, ఆకాశ్ ఎస్టేట్స్, భారతీ సిమెంట్స్, రేవన్ ఇన్‌ఫ్రా, యుటోపియా ఇన్‌ఫ్రా కంపెనీల్లో షేర్లు ఉన్నాయి. మకరియోస్ ఎల్‌ఎల్‌పీ, భగవతి సన్నిధి ఎస్టేట్స్ ఎల్‌ఎల్‌పీల్లో రూ.13.94 కోట్ల విలువైన పెట్టుబడులతో పరిమిత భాగస్వామ్యం ఉంది. రిలయన్స్ ఇండస్ర్టీస్, జియో ఫైనాన్షియల్స్, ఎన్‌ఎండీసీ, ఏషియన్ పెయింట్స్, కోల్గేట్ పామోలివ్, ఓఎన్‌జీసీ, సెయిల్, అల్ర్టాటెక్ సిమెంట్ లిమిటెడ్‌లో రూ.1.52 కోట్ల పెట్టుబడులున్నాయి. రూ.75.01 లక్షల విలువైన సావరిన్ గోల్డ్ బాండ్లు ఉన్నట్టు అఫిడవిట్‌లో చూపారు.
బంగారం, వజ్రాభరణాలు
2019లో భారతి పేరిట రూ.3.57 కోట్ల విలువైన 5,862.818 గ్రాముల బంగారం, వజ్రాభరణాలు ఉండే వి. 2019 నుంచి 2024 మధ్యకాలంలో అరకిలో పైనే బంగారు, వజ్రాభరణాలు పెరిగాయి. భారతి పేరిట రూ.5.29 కోట్ల విలువ చేసే 6,427.79 గ్రాముల బంగా రం, వజ్రాభరణాలు, హర్షిణి పేరిట రూ.4.43 కోట్ల విలువైన 4,187.19 గ్రాములు, వర్షా పేరిట రూ.4.46 కోట్ల విలువైన 3,457.33 గ్రాముల బంగారం, వజ్రాభరణాలున్నాయి. జగన్‌కు ఆభరణాలేమీ లేవు.
కుమార్తెల పేరిట పెట్టుబడులు
జగన్ కుమార్తెలు వైఎస్ హర్షిణి రెడ్డి, వైఎస్ వర్షా రెడ్డి పేరిట రెండు కంపెనీల్లో పెట్టుబడులున్నాయి. హర్షిణిరెడ్డికి రూ.10.16 కోట్లు, వర్షారెడ్డికి రూ.9.95 కోట్ల పెట్టుబడులున్నాయి. మకరియోస్ ఎల్‌ఎల్‌పీ, భగవత్ సన్నిధి ఎస్టేట్స్ ఎల్‌ఎల్‌పీల్లో హర్షిణి, వర్షాలకు చెరో రూ.7.48 కోట్ల విలువైన పరిమిత భాగస్వామ్య పెట్టుబడులున్నాయి. హర్షిణికి కీలాన్ టెక్నాలజీ్‌సలో రూ.2.38 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. ఎస్‌బీఐ, సనోఫి ఇండియా, ఏషియన్ పెయింట్స్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ ఫార్మాలో రూ.26.17 లక్షల విలువైన ఈక్విటీ షేర్లున్నాయి. వర్షాకు కీలాన్ టెక్నాలజీ్‌సలో రూ.2.38 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు, జెన్సర్ టెక్, సనోఫీ ఇండియా, ఏషియన్ పెయింట్స్, గ్లాక్సోస్మిత్‌క్లైన్ ఫార్మా, రిలయన్స్ ఇండస్ర్టీస్, జియో ఫైనాన్షియల్స్‌లో రూ.19.61 లక్షల విలువైన ఈక్విటీ షేర్లు ఉన్నాయి. హర్షిణికి రూ.1.31 కోట్లు, వర్షాకు రూ.1.54 కోట్ల విలువైన విదేశీ ఆస్తులున్నాయి.