జగన్ అరెస్టు ఖాయం
ABN , Publish Date - Apr 25 , 2024 | 04:39 AM
జగన్ ఎన్నికల తర్వాత అరెస్టు కావడం ఖాయమని, ఇది ప్రధాని మోదీ గ్యారంటీ అని పవన్ అన్నారు.
ఇది మోదీ గ్యారంటీ..
వంచక ప్రభుత్వాన్ని గద్దె దించుదాం
రాష్ట్ర భవిష్యత్ కోసమే
మా పోరాటం: పవన్
జగన్ ఎన్నికల తర్వాత అరెస్టు కావడం ఖాయమని, ఇది ప్రధాని మోదీ గ్యారంటీ అని పవన్ అన్నారు. తప్పు చేసిన వారంతా శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని ఎన్నికల ప్రచారంలో ప్రధాని చెప్పారని.. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి 30కి పైగా కేసుల్లో బెయిల్ మీద తిరుగుతున్నాడని.. ఎన్నికల తర్వాత కచ్చితంగా జైలుకు వెళ్తాడని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని ముందు నుంచీ చెబుతున్నానన్నారు. అన్ని వర్గాలను వంచించిన జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని పిలుపిచ్చారు. సింగవరం, విజయనగరం సభలతో పాటు బుధవారం ఉదయం ఆయన కాకినాడలో జనసేన ఎంపీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రం గంజాయి కేపిటల్ అయిపోయిందని, 14-15 ఏళ్ల పిల్లలకు కూడా విచ్చలవిడిగా దొరుకుతోందని ఆయా సందర్భాల్లో వాపోయారు. ‘శాంతిభద్రతలు క్షీణించాయి. 30 వేల మంది ఆడపిల్లలు అదృశ్యమైపోయారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాల్లేవు. కాపు రిజర్వేషన్లను జగన్ ఛీకొట్టారు. అలాంటి వైసీపీ తరఫున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా చలమశెట్టి సునీల్ నిలబడడం దారుణం. ఉత్తరాంధ్రలో వలసలు ఆగాలి.. వలసలు ఆగాలంటే.. పరిశ్రమలు రావాలి.. బలమైన ఆలోచన తీసుకుని ముందుకు వెళ్లాలి. నెల్లిమర్లకు సంబంధించి 10వేల మంది పనిచేసే జూట్ కర్మాగారం మూతపడింది. కూటమి గెలవగానే.. చంద్రబాబుతో ఆలోచన చేసి, ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి ఈ జూట్ పరిశ్రమను తెరిపించేందుకు కృషి చేస్తా. ఎన్డీయే ఉమ్మడి లక్ష్యం ప్రతి చేనుకు నీరు.. ప్రతి వ్యక్తికీ పని కల్పించడం. ఎంతో ప్రాముఖ్యం ఉన్న రామతీర్థం రాముడి విగ్రహం తల నరకడం, దానిని పట్టుకుని పూజారి విలపించడం నన్ను ఎంతో కలిచివేసింది. జగన్ పాలన నవనందుల మాదిరిగా ఉంది. చాణక్య, చంద్రగుప్తుల కాలంలో నవనందులు తలతిక్క పనులు చేసేవారు. అందుచేత మనం చాణుక్యులం కావాలి’ అని పిలుపిచ్చారు.
నేడు అన్నమయ్య జిల్లాకు బాబు, పవన్
రాయచోటి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ గురువారం అన్నమయ్య జిల్లాకు రానున్నారు. సాయంత్రం రాజంపేట, రైల్వేకోడూరుల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొంటారు.