Andhra Pradesh: విశాఖ నుంచి పోటీ చేస్తా.. జేడీ లక్ష్మీనారాయణ సంచలన ప్రకటన..
ABN , Publish Date - Feb 28 , 2024 | 02:54 PM
కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ అన్నారు.
కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు పెట్టిందని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వీవీ లక్ష్మీ నారాయణ అన్నారు. 25 ఎంపీలను గెలిపించినా రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలను సాధించుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ మేరకు శ్రీకాకుళంలో జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. అవినీతి, డ్రగ్స్, రౌడీయిజం, ప్రకృతి విద్వంసం లేని ఆంధ్రప్రదేశ్ సాధనే తమ లక్ష్యమని వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు, హోదా ఇస్తామని చెప్పి మోసం చేశారని తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఓ ఫ్రంట్ గా ఏర్పడి అన్ని స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. తాను విశాఖపట్నం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.
"సీఏఏ బిల్లు, రాష్ట్ర పతి, ఉప రాష్ట్రపతి ఎన్నిక, దిల్లీ బిల్లు సమయంలో ప్రతిఘటించి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేది. అప్పుడు చేయకుండా ఇప్పుడు ఎన్నికల సమయంలో మళ్లీ హోదా అంటూ కొత్త డ్రామా మొదలెడుతున్నారు. హోదా పై బ్యాన్ లేదని 15 వ ఆర్దిక సంఘం ఛైర్మన్ ఎన్‌కే.సింగ్ చెప్పారు. ప్రత్యేక హోదా సాధనే మా ప్రదాన ఎజెండా. విద్యార్దులు తలపెట్టిన మార్చి 1 చలో తాడేపల్లి ప్యాలెస్ కు మద్దతు తెలుపుతున్నాం. ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా కేంద్ర స్థాయిలో చేపట్టాలి. రైతు ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజు తాడేపల్లిలో జరిగే సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ప్రత్యేక హొదా పై ప్రకటన చేయాలి" అని వీవీ లక్ష్మీనారాయణ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.