మోహన్‌బాబు యూనివర్సిటీలో జర్నలిస్టులపై బౌన్సర్ల దాడి
ABN , Publish Date - Dec 10 , 2024 | 06:33 AM
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం వద్ద వీడియో కవరేజ్‌కు వెళ్లిన ఇద్దరు మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు.
చంద్రగిరి, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం ఎ.రంగంపేట సమీపంలోని మోహన్‌బాబు విశ్వవిద్యాలయం వద్ద వీడియో కవరేజ్‌కు వెళ్లిన ఇద్దరు మీడియా ప్రతినిధులపై బౌన్సర్లు, సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. దీనిపై బాధితులతో కలిసి జర్నలిస్టు నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. సుమన్ టీవీ తిరుపతి ప్రతినిధి ఉమాశంకర్, కెమెరామెన్ నరసింహులు శ్రీవిద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద వీడియో కవరేజ్ చేస్తున్నారు. వీడియో తీయొద్దంటూ అక్కడి సిబ్బంది అడ్డుకున్నారు. ఎంబీయూ పీఆర్వో సతీశ్.. మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చి మాట్లాడుతుండగా, ఇద్దరు బౌన్సర్లు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు వచ్చి దాడి చేశారు. ఫైబర్ లాఠీతో కొట్టారు. మీడియా ప్రతినిధులు పరుగు తీస్తుండగా, వారితో పాటు మరికొంత మంది స్థానికులు వచ్చి బలవంతంగా విద్యానికేతన్‌లోకి లాక్కెళ్లారు. వారి సెల్‌ఫోన్, కెమెరాలను ధ్వంసం చేశారు. బాధితులు చంద్రగిరి సీహెచ్‌సీకి వెళ్లి చికిత్స తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న తిరుపతి ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు మురళీ, కార్యదర్శి బాలచంద్ర, ఇతర జర్నలిస్టులు చంద్రగిరి వచ్చారు. బాధితులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.