Andhra Pradesh: ఇసుక దొంగలు.. అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలింపు..
ABN , Publish Date - Oct 22 , 2024 | 09:34 AM
వారం రోజులుగా జి.కొండూరు మండలం చిననందిగామ సమీపంలో ఉన్న బుడమేరు వాగునుంచి కోడూరు మీదుగా ఇసుకను పట్టపగలే గణపవరం గ్రామ సమీపంలోని గణపతి గట్టు వద్ద గుట్టలుగా నిల్వచేస్తున్నారు. అనంతరం రాత్రి వేళల్లో అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ రూ. 30వేలవరకు..
గణపతిగట్టు వద్ద గుట్టలు పోసి అక్రమ రవాణా
లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలింపు
లారీ ఇసుకను రూ.30వేలకు విక్రయం
ఉచిత పథకానికి తూట్లు పొడుస్తున్న మాఫియా
గ్రామ అధ్యక్షుడు దురుసు ప్రవర్తనపై వీఆర్వో ఫిర్యాదు
కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ప్రకటిస్తే.. కొంతమంది అక్రమార్కులు దానికి తూట్లు పొడుస్తున్నారు. గణపవరంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. పదుల సంఖ్యలలో ట్రాక్టర్‌లతో యథేచ్ఛగా ఇసుకను నిల్వచేస్తు పక్క రాష్ర్టానికి అక్రమంగా తరలించి సొమ్ముచేసుకుంటోంది. వారం రోజులుగా జి.కొండూరు మండలం చిననందిగామ సమీపంలో ఉన్న బుడమేరు వాగునుంచి కోడూరు మీదుగా ఇసుకను పట్టపగలే గణపవరం గ్రామ సమీపంలోని గణపతి గట్టు వద్ద గుట్టలుగా నిల్వచేస్తున్నారు. అనంతరం రాత్రి వేళల్లో అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ రూ. 30వేలవరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికైనా రెవెన్యూ, పోలీస్ అధికారులు ఇసుక అక్రమ నిల్వలను గుర్తించి మాఫియాపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
CM Chandrababu: గిరిజన ప్రాంతాల అభివృద్ది, పథకాల ప్రగతిపై సమీక్షించిన సీఎం
అక్రమ మార్గాల్లో ఇసుక తరలింపుపై తహసీల్దార్ బాలకృష్ణారెడ్డిని వివరణ కోరగా గణపతి గట్టు సమీపంలో ఇసుకను భారీఎత్తున నిల్వ చేసినట్టు సమాచారం వచ్చిందని, నలుగురు వీఆర్వోలను సంఘటనా స్థలానికి పంపి ఇసుకను సీజ్ చేసినట్టు చెప్పారు. ఎవరూ తరలించకుండా వీఆర్వోలను కాపలా పెట్టామని తహసీల్దార్ తెలిపారు.
వీఆర్వోతో టీడీపీ నేత వాగ్వాదం
గణపతిగట్టు వద్ద వీఆర్వో స్రవంతితో టీడీపీ గ్రామ అధ్యక్షుడు ఉమ్మా రమణారెడ్డి కొంతమంది ట్రాక్టర్ డ్రైవర్లను వెంటేసుకొచ్చి వాగ్వాదానికి దిగారు. ఇసుకను తన ఇంటి నిర్మాణం కోసం నిల్వ చేసుకున్నానని, సీజ్‌చేసే హక్కు మీకు ఎవరిచ్చారని ఆమెను ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగినట్టు సమాచారం. విషయం తెలుసుకున్న మైలవరం ఎస్సై సుధాకర్ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. వీఆర్వో స్రవంతి మైలవరం స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై సుధాకర్ తెలిపారు.
ఉచిత ఇసుక దుర్వినియోగం కావొద్దు
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here