Share News

Vijayawada: గాయత్రీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు..

ABN , Publish Date - Oct 04 , 2024 | 08:27 AM

ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇస్తోంది.

Vijayawada: గాయత్రీ దేవి అలంకారంలో కనకదుర్గ అమ్మవారు..

విజయవాడ: ఇంద్రకీలాద్రి (Indrakiladri) అమ్మవారి ఆలయంలో ఘనంగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు (Dussehra Sharannavaratri celebrations) వైభవంగా జరుగుతున్నాయి. రెండో రోజు దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం గాయత్రీ దేవి అలంకారం (Gayatri Devi Alankaram)లో భక్తులకు దుర్గమ్మ (Durgamma) దర్శనం ఇస్తోంది. తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు.

కాగా ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలలో తొలిరోజు గురువారం పెద్దసంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఉత్సవాల నిర్వహణలో వివిధ శాఖల సమన్వయం కారణంగా అమ్మ దర్శనాలు ప్రశాంతంగా సాగాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రొటోకాల్‌ ఉన్నవారికి మినహా అంతరాలయ దర్శనాలను చాలావరకు నియంత్రించారు. ఈసారి వీఐపీల దర్శనాలను ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయంలోనే అనుమతించటం వల్ల అంతరాలయ దర్శనాలు తగ్గాయి.


ఉత్తరాంధ్ర నుంచి భక్తుల రాక..

ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి ఈసారి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. గతంలో నడుచుకుంటూ ఉత్సవాల ఐదో రోజుకు చేరుకునేవారు. ఈసారి ఉత్సవాల తొలిరోజు నుంచే హడావిడి నెలకొంది. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి కాలినడకన దుర్గమ్మ చెంతకు భక్తులు వస్తున్నారు.

శరన్నవరాత్రుల్లో వీఐపీల వాహనాలను కొండ మీదకు అనుమతించం.. వీఐపీలంతా పున్నమిఘాట్‌ వద్దకు చేరుకుని దేవస్థానం అధికారులు ఏర్పాటు చేసిన వాహనాల్లో దర్శనాలకు వెళ్లాలి.. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ అధికారులు చేసిన ప్రకటన ఇది.. ఈ ఆదేశాలను మాజీ హోంమంత్రి, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పాటించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆయన తన వాహనంలో నేరుగా పున్నమిఘాట్‌కు వెళ్లారు. అక్కడి నుంచి దేవస్థానం ఏర్పాటు చేసి వాహనంలో ఇంద్రకీలాద్రిపైకి వెళ్లారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అదే వాహనంలో పున్నమిఘాట్‌కు వెళ్లారు. వీఐపీలంతా ఇలాచేస్తే సామాన్య భక్తులకు దర్శనాలు సాఫీగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.


క్యూలైన్‌లో మాజీ మంత్రి..

మాజీ మత్రి దేవినేని ఉమా ఉచిత క్యూలో అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ప్రతీఏడాది శరన్నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజున అమ్మవారిని దర్శించుకుంటారు. వినాయకుడి ఆలయం నుంచి క్యూలో నడుచుకుంటూ కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరికి కనకదుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు.

56 మందితో ఉత్సవ కమిటీ

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి మహోత్సవాలకు ఉత్సవ కమిటీ ఏర్పాటైంది. మొత్తం 56 మందితో ఉత్సవ కమిటీని ప్రభుత్వం గురువారం ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను దేవదాయ శాఖ విడుదల చేసింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు కమిటీలో స్థానం కల్పించారు.

తొలి రోజు ఆదాయం రూ.20.25లక్షలు

దుర్గగుడిలో దసరా ఉత్సవాలు సందర్భంగా మొదటిరోజు గురువారం సాయంత్రం 5 గంటల వరకు రూ.20,25,000లు దేవస్థానానికి ఆదాయం వచ్చినట్టు ఈవో కేఎస్‌ రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. రూ.500 టిక్కెట్ల ద్వారా 8,65000, రూ.300 టిక్కెట్ల ద్వారా 3,1500లు రూ.100 టిక్కెట్ల ద్వారా రూ.2,40,000, లడ్డూ ప్రసాదం ద్వారా రూ.5,25,000, పరోక్ష, ప్రత్యక్ష కుంకుమార్చన పూజల (టిక్కెట్‌ రూ.3,000) ద్వారా రూ.12,000, పరోక్ష, ప్రత్యక్ష కుంకుమార్చన పూజల (టిక్కెట్‌ రూ.5,000) ద్వారా రూ.15,000, శ్రీచక్ర నవావరణార్చన పూజ ద్వారా రూ.3,000, కేశఖండన టిక్కెట్‌ ద్వారా రూ.50,000లు మొత్తం రూ.20,25,000 లు వచ్చినట్టు ఈవో తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భద్రాచలంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

జెత్వానీ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి!

దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రా!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 04 , 2024 | 08:27 AM