వైసీపీ ప్యాలెస్‌పై చర్యలేవీ..?
ABN , Publish Date - Jun 23 , 2024 | 11:50 PM
గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత వరకు ఆ హడావుడి చేశారు.

అధికారం మాటున వైసీపీ నేతల బరితెగింపు
కేఎంసీ, కుడా అనుమతులు లేకుండానే భవన నిర్మాణం
గతేడాది ఆగస్టు 7న వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి
కళ్లకు గంతలు కట్టుకున్న అధికారులు
ప్రభుత్వం మారడంతో ఈ నెల 17న ప్లాన్ అనుమతి కోసం దరఖాస్తు
సరైన ధ్రువపత్రాలు లేవని వెనక్కి పంపిప కుడా
రాష్ట్రంలో అక్రమ భవనాలు ఉండడానికి వీల్లేదు. అలాంటి వాటిని మా ప్రభుత్వం ఉపేక్షించదు. ప్రజా వేదిక కూడా అలాంటి నిర్మాణమే కాబట్టి కూల్చేస్తున్నాం.
- వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలినాళ్లలో గొప్పగా చెప్పుకున్న మాటలు ఇవి
గత టీడీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం అప్పటి సీఎం చంద్రబాబు నిర్మించిన ప్రజావేదిక కూల్చివేత వరకు ఆ హడావుడి చేశారు. ఆ తరువాత ఏ ఒక్క అనధికార నిర్మాణాలను తొలగించలేదు. పైగా అధికారం ఉంది కదా అని వైసీపీ జిల్లా కార్యాలయాల నిర్మాణం కోసం రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను లీజు పేరిట కారుచౌకగా కొట్టేశారు. నగర పాలిక సంస్థ, కుడా అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపట్టారు. వైసీపీ నేతలు బరితెగించి చేపట్టిన ఆ పార్టీ అక్రమ నిర్మాణాన్ని 2023 ఆగస్టు 7న ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. అప్పట్లో ఏ ఒక్క అధికారి కూడా స్పందించలేదు. ఏడాది గడిచింది. భవన నిర్మాణం చివరి దశకు చేరింది. ప్రభుత్వం మారడంతో భయం పట్టుకున్న వైసీపీ అధిష్ఠానం హడావుడిగా ప్లాన్ అప్రూవల్ కోసం ఆన్‌లైన్‌లో కుడాకు దరఖాస్తు చేసింది. పలు ధ్రువపత్రాలు లేకపోవడంతో ఆ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. వైసీపీ కార్యాలయం అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి మరి.
కర్నూలు, జూన్ 23 (ఆంధ్రజ్యోతి):
కర్నూలు నగరం నడిబొడ్డున రైల్వే స్టేషన్ రోడ్ ఫైవ్ రోడ్స్ జంక్షన్ (ఐదు రోడ్ల కూడలి)లో రూ.100 కోట్లకు పైగానే విలువైన సర్వే నంబరు 95/2బీలో ఏపీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ ఆగ్రోస్ సంస్థ)కు చెందిన 1.60 ఎకరాలు భూమిని ఏడాదికి రూ.1,600 చెల్లించేలా 33 ఏళ్లు లీజు పేరిట కారుచౌకగా దక్కించుకున్నారు. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ), కర్నూలు అర్బన్ డెవలప్‌మెంట్ అఽథారిటీ (కుడా) నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ప్యాలెస్‌ను తలదన్నేలా వైసీపీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పుడు వైసీపీ అధికారంలో ఉండడంతో అఽధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారు. అధికారం మాటున భవన నిర్మాణం శరవేగంగా చేపట్టారు. అయితే ప్రస్తుతం అధికారం మారింది. సీఎం చంద్రబాబు సారథ్యంలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అక్రమ భవన నిర్మాణం ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోనని అధికారులు భయందోళన చెందుతున్నారు.
ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చినా..!
వైసీపీ జిల్లా కార్యాలయం అక్రమ భవన నిర్మాణంపై 2023 ఆగస్టు 7న ఆంధ్రజ్యోతి ‘అధికార పార్టీనా మజానా..! శీర్షికన వెలుగులోకి తెచ్చింది. డాక్యుమెంట్ ప్రకారం 6,375.24 చదరపు మీటర్లు విస్తర్ణం ఉంటే.. అందులో అప్పటికే గ్రౌండ్ ఫ్లోర్, తొలి అంతస్తు నిర్మాణం (బిల్డప్ ఏరియా) 1,679.15 చదరపు మీటర్లు విస్తీర్ణంలో ప్యాలెస్‌ను తలదన్నేలా భవన నిర్మాణం చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండానే పునాదులు తీసి.. పిల్లరు వేసేందుకు అవసరమైన ఇనుప కడ్డీలు ఏర్పాటు చేశారు. శరవేగంగా పనులు జరుగుతున్నా అటువైపు ఏ అధికారి కూడా వెళ్లడానికి సాహసం చేయలేదు. ఆ సమయంలో అక్రమ నిర్మాణంపై ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. ఎక్కడా తమ మెడకు చుట్టుకుందో..? అని నగర పాలక సంస్థలో కీలక హోదాలో ఉన్న ఓ అధికారి సూచనల మేరకు 2023 ఆగస్టు 31న రూ.10 వేలు చెల్లించి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)కి దరఖాస్తు చేసి యథావిధిగా పనులు కొనసాగించారు. ఆ తరువాత అదే ఏడాది డిసెంబరులో డెవలప్‌మెంట్ చార్జి, పర్మిట్, గ్రీన్, డీపీఎంఎస్ యూజర్ చార్జీలు చెల్లించి వదిలేశారు. అయితే పూర్తిస్థాయిలో అవసరమైన ఫీజులు, దృవపత్రాలు జమ చేయకపోవడంతో ఆ దరఖాస్తును కుడా పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ఆన్‌లైన్ కాకపోవడంతో ఆఫ్రూవల్ కూడా ఇవ్వలేదు.
ప్రభుత్వం మారడంతో ప్లాన్ అనుమతికి దరఖాస్తు
అధికారం మాది.. రాబోయే అధికారం కూడా మాదే.. మమ్ములను ప్రశ్నించేది ఎవరంటూ వైసీపీ నాయకులు యథేచ్చగా వైసీపీ ఆఫీసు భవనం అక్రమంగా నిర్మాణం చేపట్టారు. గ్రౌండ్ ఫ్టోర్, ఫస్ట్ ఫ్లోర్ నిర్మాణాలు దాదాపుగా పూర్తి అయ్యాయి. వైసీపీ నేతల కలలు చెదిపోయేలా ప్రజలు తీర్పు ఇవ్వడంతో ఈ నెల 12న టీడీపీ కూటమి ప్రభుత్వం కొలుదీరింది. ప్రభుత్వం మారడంతో ప్లాన్ అనుమతుల కోసం హడావుడిగా ఈ నెల 14న లేబర్ సెస్ కాంపోనెంట్-1, కాంపోనెంట్-2 ఫీజు రూ.2.85 లక్షలు, పెనాల్టీ రూ.10 వేలు చెల్లించి ఈ నెల 17న ఆన్‌లైన్‌లో కుడాకు దరఖాస్తు చేశారు. హడావుడిలో ఎన్‌ఓసీ, ఎఫ్‌ఎంబీ, తహసీల్దారు జారీ చేసిన పొజిషన్ సర్టిఫికెట్, ఈసీ వంటి ధ్రువపత్రాలు జత చేయకపోవడంతో ఆ దరఖాస్తును వెనక్కి పంపినట్లు కుడా వైస్ చైర్మన్ ప్రతాప్ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఈ నెల 18న ‘కర్నూలులో వైసీపీ ప్యాలెస్’ శీర్షికన వెలుగులోకి తెచ్చింది. మొత్తం మీద ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి.
దరఖాస్తును వెనక్కి పంపాం
వైసీపీ కార్యాలయం 1,679.15 చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపట్టారు. ఎలాంటి అనుమతులు లేవు. ఈ నెల 17న ప్లాన్ అప్రూవల్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. ఎన్‌ఓసీ, ఎఫ్‌ఎంబీ, తహసీల్దారు జారీ చేసిన పొజిషన్ సర్టిఫికెట్, ఈసీ వంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో వెనక్కి పంపించాం. అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టిన వైసీపీ ఆఫీసు నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కేఎంసీ కమిషనర్‌కు లేఖ రాశాను. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముందుకెళ్తాం.
- ప్రతాప్ సూర్యనారాయణరెడ్డి, కుడా వైస్ చైర్మన్, కర్నూలు