Share News

Mystery Unfolds : మరిదే సూత్రధారి!

ABN , Publish Date - Dec 22 , 2024 | 06:04 AM

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ‘పార్శిల్‌లో మృతదేహం డెలివరీ’ మిస్టరీ వీడుతోంది. ప్రధాన సూత్రధారి తులసి మరిది సిద్ధార్థ వర్మే అని భావిస్తున్నారు.

Mystery Unfolds : మరిదే సూత్రధారి!

  • ‘పార్శిల్‌లో మృతదేహం డెలివరీ’ కేసులో వీడుతున్న మిస్టరీ

  • సిద్ధార్థవర్మ కోసం పోలీసుల వేట

ఉండి, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం యండగండిలో ‘పార్శిల్‌లో మృతదేహం డెలివరీ’ మిస్టరీ వీడుతోంది. ప్రధాన సూత్రధారి తులసి మరిది సిద్ధార్థ వర్మే అని భావిస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ కేసు విషయంలో గుంభనంగా వ్యవహరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలిసేందుకు మరో రెండు రోజులు పడుతుందని జిల్లా ఎస్పీ నయీం అస్మి ప్రకటించారు. వివరాలివీ.. యండగండికి చెందిన ముదునూరి రంగరాజు, హైమావతి దంపతులకు నాగతులసి, రేవతి కుమార్తెలు. రంగరాజుకు మూడెకరాల పొలం ఉంది. పదేళ్ల క్రితమే నాగతులసిని భర్త వదిలి వెళ్లిపోయాడు. ఆమె కుమార్తెతో కలిసి యండగండిలోని తండ్రి రంగరాజు వద్దే ఉండేది. రెండేళ్ల క్రితం తల్లి, సోదరి రేవతితో విభేదాలు రావటంతో తులసి పాలకోడేరు మండలం గరగపర్రులో ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. మరోవైపు అప్పటికే వివాహమైన సిద్ధార్థవర్మ.. తులసి సోదరి రేవతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెతో బంటుమిల్లి సమీప గ్రామంలో ఉండేవాడు. రెండేళ్ల క్రితమే రేవతిని యండగండిలోని తండ్రి ఇంటిలో ఉంచాడు. అప్పటి నుంచి రంగరాజు, భార్య హైమావతితో రేవతి ఉంటోంది. ఈ క్రమంలో మూడు ఎకరాల విషయంలో గొడవలు రావడంతో బంధువులంతా తులసికి మద్దతుగా నిలిచారు. దీంతో సిద్ధార్థవర్మ.. వదిన తులసిని టార్గెట్‌ చేశాడని స్థానికులు చెబుతున్నారు. కాగా, తులసి యండగండిలో ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇల్లు నిర్మించుకుంటోంది. రాజమండ్రి క్షత్రియ సేవా సమితి పేరుతో సిద్ధార్థవర్మ రెండుసార్లు టైల్స్‌, రంగు డబ్బాలు పంపారు. మూడోసారి గురువారం సాయంత్రం ఆటోలో మృతదేహంతో ఉన్న చెక్క పెట్టి పార్శిల్‌ను పంపింది సిదార్ధవర్మగానే పోలీసులు గుర్తించారు. అందులో రూ.కోటీ 30లక్షలు చెల్లించకపోతే ఇబ్బందులొస్తాయని అని రాసి ఉన్న లెటర్‌ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే!.


  • ఇంతకీ మృతుడు ఎవరు?

ఉండి మండలం సాగిపాడు వద్ద ఓ మహిళ ఆటోలో పార్శిల్‌ ఎక్కించి, రంగరాజు ఇంటికి చేరే విధంగా ముసుగు వేసుకుని వెళ్లింద ని స్థానికులు చెబుతున్నారు. పార్శిల్‌ వచ్చిన విషయాన్ని తెలుసుకున్న తులసి.. తండ్రి రంగరాజు ఇంటికి వెళ్లింది. పార్శిల్‌ తెరిచిన వెంటనే మృతదేహం ఉండటంతో తులసి కంగారుపడి కేకలు వేయడంతో బంధువులు ఆమెను పక్కకు తీసుకువచ్చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, కీలక నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్న సిద్ధార్థవర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడిని హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరిగింది. కానీ పోలీసులకు దొరకకుండా ఫోన్‌ సిమ్‌లను మారుస్తున్నాడు. ఆటోలో పార్శిల్‌ ఎక్కించిన మహిళ ఎవరనే దానిపైనా ఆరా తీస్తున్నారు. తులసి తల్లి కూడా పరారీలో ఉంది. పార్శిల్‌లో వచ్చిన మృతదేహానికి సంబంధించి ఎటువంటి సమాచారం అందటం లేదు. చుట్టుపక్కల పోలీస్‌ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసులు నమోదు కాలేదు. దీంతో ఈ మృతదేహాన్ని ఎక్కడి నుంచి తెచ్చారనేది మిస్టరీగా మారింది. సిద్ధార్థ వర్మ దొరికితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.

Updated Date - Dec 22 , 2024 | 06:05 AM