Pawan Kalyan : ఆస్తుల రక్షణ కోసం కూటమికే ఓటేయండి
ABN , Publish Date - May 11 , 2024 | 05:15 AM
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పీఠం కూటమిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ ఆస్తులు రక్షించుకోవాలంటే ప్రజలంతా కూటమికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
లేదంటే జగన్ వచ్చి ప్రజల ఆస్తులు అమ్మేస్తాడు
వైసీపీ నేతలకు తెలుగుజాతి తలవంచదు..
వారిని మట్టిలో పాతేస్తాం
ఎన్నికలకు ముందే జగన్ భయపడుతున్నాడు
ఏపీ దిశ, దశ మార్చే ఎన్నికలు పిఠాపురం నుంచే
పిఠాపురం సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్
రోడ్ షోకు దారిపొడవునా ప్రజల బ్రహ్మరథం
కాకినాడ, మే 10 (ఆంధ్రజ్యోతి): ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పీఠం కూటమిదేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమ ఆస్తులు రక్షించుకోవాలంటే ప్రజలంతా కూటమికే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. లేదంటే జగన్ మళ్లీ వచ్చి మీ ఆస్తులు లాగేసుకుంటారని హెచ్చరించారు. ఎన్నికలకు ముందే జగన్ ఓటమితో భయపడిపోతున్నారని, అందుకే వైసీపీ ఓటుకు రూ.5వేల వరకూ పంచుతోందని అన్నారు. ఆ డబ్బులు తీసుకుని.. ఓటు మాత్రం కూటమి అభ్యర్థులకే వేయాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కల్యాణ్ శుక్రవారం పిఠాపురం నియోకవర్గవ్యాప్తంగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం పిఠాపురం పట్టణంలోని ఉప్పాడ సెంటర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. పవన్ ఇంకా ఏమన్నారంటే..
జాగ్రత్తగా ఆలోచించి ఓటేయండి
ఎన్నికలకు ఇంకా రెండు రోజులే ఉంది. ఓటేసే ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఆలోచించండి. జగన్ ప్రభుత్వం తెచ్చిన భూహక్కు చట్టం భూ కబ్జా చట్టంగా మారింది. జగన్ మళ్లీ వస్తే ప్రజల ఆస్తులు గాల్లో దీపాలే. విశాఖలో ప్రభుత్వ భూములు తాకట్టుపెట్టి రూ.25వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్ భవిష్యత్తులో ప్రజల ఆస్తులు లాగేసుకుంటాడు. పాస్‌బుక్‌పైనా, సర్వే రాళ్లపైనా అతడి బొమ్మ వేయించుకున్న జగన్ మీ ఆస్తులు కాపాడతాడనే నమ్మకం ఏంటి? జగన్‌లా నేను అబద్ధాలు చెప్పను. మేనిఫెస్టోలో ఏం చెప్పామో.. అది అమలయ్యేలా చూసే బాధ్యత నాది. 20 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారని జగన్ అడుగుతున్నారు. దొంగ మద్యంతో ఆయన వేలకోట్ల దోపిడీ చేసి డబ్బులు సంపాదించినప్పుడు ప్రజల కోసం మేం కొత్త ఆలోచనలతో ఖజానా నింపలేమా..? యువతకు ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తాం. రాష్ట్రం దశ, దిశను మార్చే ఎన్నిక పిఠాపురం నుంచే జరగబోతోంది. ఇది మామూలు ఎన్నిక కాదు. దేశంలో ఏపీ బలమైన రాష్ట్రంగా తయారవడానికి పిఠాపురం నుంచే బీజం పడబోతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ భారీగా డబ్బులు పంచుతోంది. ఇదంతా ప్రజల సొమ్మే. ఓటుకు లక్ష ఇచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం కూటమికే వేయండి.
నా భార్య భయపడింది..
మా నాన్న నాకు ఆస్తిపాస్తులివ్వలేదు. ధర్మంగా బతకాలని మాత్రమే చెప్పారు. కష్టం చేయకపోతే బాదేస్తానన్నారు. అందుకే నేను ధర్మం కోసం పనిచేస్తున్నా. ఈ క్రమంలో వైసీపీ వాళ్లు నా భార్యను తిట్టారు. ఆమె ఈ దేశానికి చెందినది కాదు. ఈ రాజకీయాలు తెలియవు. తనను ఎందుకు తిడుతున్నారని నన్ను అడిగింది. భయపడింది. అప్పుడు నా భార్యను క్షమించమని అడిగాను. ఎన్నికల రోజు పిఠాపురం వస్తే రాజకీయాల్లో ఎందుకు నిలబడ్డానో నీకే తెలుస్తుందని చెప్పాను. నా కోసం ప్రచారం కోసం వచ్చిన సాయిధరమ్ తేజ్‌పై గాజుసీసాతో దాడి చేశారు. పవన్ ప్రతిఒక్కరినీ గుండెల్లో పెట్టుకుంటాడు. నన్ను తిట్టినా భరిస్తా.. నా ప్రాణాన్ని బలిదానంగానైనా ఇస్తా. వైసీపీ గూండాలకు ఒకటే హెచ్చరిస్తున్నా. పవన్ సంగతి మీకు తెలియదు.
పవన్ రోడ్ షోకు పోటెత్తిన జనం
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ శుక్రవారం ఇక్కడ రోడ్ షో నిర్వహించారు. 216వ జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. దారిపొడవునా మహిళలు పూలవర్షం కురిపించారు. హారతులిచ్చారు. పవన్ బైపాస్ రోడ్ మీదుగా గొల్లప్రోలు చేరుకున్నారు. అక్కడినుంచి 216వ జాతీయ రహదారి, చేబ్రోలు శివాలయం, మల్లవరం సెంటర్ మీదుగా ఏకేమల్లవరం, ఏపీ మల్లవరం గ్రామాల్లో రోడ్‌షో కొనసాగించారు. తర్వాత కొత్తపల్లి మండలంలో రోడ్‌షో సాగింది.