వైసీపీకి వరుస షాకులు
ABN , Publish Date - Apr 04 , 2024 | 11:26 PM
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీని వీడి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయన అనుచరులు టీడీపీలోకి క్యూకట్టారు. ఇంకోవైపు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కీలకమైన నాయకులు టీడీపీలోకి చేరిపోతున్నారు. ఇదే సమయంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధంకాగా, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో మద్దిశెట్టి టీడీపీవైపు దృష్టిసారించగా, ఆమంచి కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావటం, ఆయా నియోజకవర్గాల్లో బలమైన అనుచరగణం కలిగి ఉండటంతో వైసీపీకి పెద్ద దెబ్బ తగలనుంది.

టీడీపీ వైపు మద్దిశెట్టి
ఇప్పటికే పార్టీ మారిన అనుచరులు
రాఘవరెడ్డితో శ్రీధర్ భేటీ
త్వరలో కీలక నిర్ణయం
కాంగ్రెస్ వైపు ఆమంచి చూపు
పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అధికార వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఇప్పటికే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆ పార్టీని వీడి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయన అనుచరులు టీడీపీలోకి క్యూకట్టారు. ఇంకోవైపు దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కీలకమైన నాయకులు టీడీపీలోకి చేరిపోతున్నారు. ఇదే సమయంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధంకాగా, చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీకి రాజీనామా చేశారు. వీరిలో మద్దిశెట్టి టీడీపీవైపు దృష్టిసారించగా, ఆమంచి కాంగ్రెస్‌లో చేరే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ కాపు సామాజికవర్గానికి చెందిన వారు కావటం, ఆయా నియోజకవర్గాల్లో బలమైన అనుచరగణం కలిగి ఉండటంతో వైసీపీకి పెద్ద దెబ్బ తగలనుంది.
(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)
అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నాయకులు, ఎమ్మెల్యేలు దూరమవుతున్నారు. ఇప్పటికే ఎంపీ మాగుంట పార్టీ మారి లోక్‌సభ బరిలో నిలవగా, తాజాగా మరో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే కూడా బైబై చెప్పబోతున్నారు. ఎన్నికల సమరం ఆరంభమై బస్సుయాత్రతో సీఎం జగన్ రానున్న నేపఽథ్యంలో అసంతృప్తి నాయకులు ఎవరి దారి వారు చూసుకోవటం ప్రారంభించటం విశేషం. ఇప్పటికే కిందిస్థాయిలో నాయకులు టీడీపీ కూటమిలో చేరిపోతుండగా పైస్థాయిలో మాగుంట కుటుంబం ఇప్పటికే టీడీపీలోకి చేరిపోయింది. తాజాగా మద్దిశెట్టి, ఆమంచిలు కూడా వైసీపీకి దూరం అవుతుండటం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఇప్పటికీ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆ పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. నియోజకవర్గంలో ఆయన సోదరుడు శ్రీధర్ తెలుగుదేశం పార్టీ నేతలతో మంతనాలు ప్రారంభించారు. కిందిస్థాయిలో ఆయన వర్గం వారు కొందరు ఇప్పటికే టీడీపీ బాట పట్టగా మరికొందరు టీడీపీ, జనసేనల వైపు దృష్టిసారించారు. అందిన సమాచారం మేరకు మద్దిశెట్టి కూడా నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి సహకరించకూడదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. వైసీపీ అభ్యర్థిగా బూచేపల్లిని ప్రకటించే సమయంలో కనీసం మద్దిశెట్టితో చర్చలు జరపకపోవటం, ఆ తర్వాత ఆయన ఆ పార్టీలోనే ఒంగోలు ఎంపీ టికెట్ ఆశించారు. అక్కడ అవకాశం ఇవ్వకపోగా ఇతరత్రా అవకాశాలు కూడా ఇచ్చే ఆలోచనను వైసీపీ అధిష్ఠానం చేయలేదు. అభ్యర్థి అయిన బూచేపల్లి నుంచి కనీసం ఆయన్ను కలవటం కానీ కలిసే ప్రయత్నం కానీ చేయలేదు. ఎమ్మెల్యే మద్దిశెట్టిని పక్కనపెట్టి నియోజకవర్గంలోని అయన అనుచరుల్లో కొందరితో మంతనాలు ప్రారంభించారు. దర్శి నగరపంచాయితీలో అలాగే ముండ్లమూరు మండలంలో ఒకరిద్దరు మద్దిశెట్టి అనుచరులను తనవైపు తిప్పుకోగలిగారు. దీంతో మద్దిశెట్టితో పాటు ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. మద్దిశెట్టికి కుటుంబీకులు, నియోజకవర్గంలోని అనుచరుల నుంచి ఒత్తిడి పెరిగింది. వైసీపీకి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ దశలో మద్దిశెట్టికి టీడీపీ, జనసేన నాయకులు కూడా కొందరు టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది.
టీడీపీలోకి మద్దిశెట్టి వర్గం
టీడీపీ అభ్యర్థిగా గొట్టిపాటి లక్ష్మీని ప్రకటించిన తర్వాత మద్దిశెట్టి ఎలాంటి వైఖరి తీసుకుంటారా? అనే అంశంపై సందిగ్ధం నెలకొంది. ఈ దశలో మద్దిశెట్టి సోదరుడు శ్రీధర్ మూడు రోజుల క్రితం నియోజకవర్గంలోని అనుచరులతో చర్చలు జరిపారు. వైసీపీ అభ్యర్థికి సహకరించకూడదని అందరూ డిమాండ్ చేశారు. ఆయన కూడా అనుచరుల డిమాండ్‌కు అంగీకరించినట్లు తెలిసింది. ఆ తర్వాత శ్రీధర్‌తో మాగుంట రాఘవరెడ్డి చర్చలు జరిపారు. అదేసమయంలో దొనకొండ మండలంలో వైసీపీలో బలమైన నాయకులుగా ఉన్న కందుల నారపురెడి,్డ వడ్లమూడి వెంకటేశ్వర్లు మాగుంట సమక్షంలో టీడీపీలో చేరారు. దర్శిలో కౌన్సిలర్ భర్త మాజీ ఏఎంసీ చైర్మన్ సుబ్బయ్య, అలాగే మద్దిశెట్టి అనుచరుల్లోని కొందరు ముఖ్య నాయకులు ప్రధానంగా కాపు సామాజికవర్గంకు చెందిన వారు టీడీపీ అభ్యర్థి లక్ష్మీ, ఆమె కుటుంబసభ్యులకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. బూచేపల్లికి మద్దతు తెలిపిన ఒక నాయకుడితో కూడా లక్ష్మీ భర్త సమాలోచన జరిపినట్లు సమాచారం. మరో మండలంలో ఎంపీపీగా ఉన్న బీసీ నాయకుడు కూడా టీడీపీ వైపు దృష్టిసారించారు. ముండ్లమూరు మండల పార్టీ కన్వీనర్ సుబ్బారెడ్డి టీడీపీ నేతలకు టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కురిచేడు మండలంలో బూచేపల్లి వైపు వెళ్లిన ఒకరిద్దరు మద్దిశెట్టి అనుచరులు తిరిగి వెనక్కు వచ్చేశారు. తాళ్లూరు మండలంలో కొందరు పరోక్ష మద్దతుకు, కొందరు టీడీపీలో చేరేందుకు సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థికి సహకరించలేమనే నిర్ణయంతో ఉన్న ఎమ్మెల్యే మద్దిశెట్టి కూడా పార్టీ మారే అలోచనలో ఉన్నారనే ప్రచారం ఉంది. ఆయన ఇచ్చిన సంకేతాలతోనే ఎమ్మెల్యే వర్గీయులు ఇటు మాగుంట అటు లక్ష్మీలకు టచ్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. నేడో రేపో చాలామంది టీడీపీ కూటమి గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది.
కాంగ్రెస్ గూటికి ఆమంచి!
ఇంకోవైపు చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గురువారం సాయంత్రం వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఆమంచికి పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బాఽధ్యతలు ఇచ్చారు. అక్కడ నుంచి తప్పించిన తర్వాత ఆయన చీరాల టికెట్ కోసం పట్టుబట్టారు. తనకు కాకపోయినా ప్రస్తుత అభ్యర్థి కరణ వెంకటే్‌షకు ఇవ్వొద్దని బీసీకి అవకాశం ఇవ్వాలని కోరారు. అందుకు వైసీపీ అధిష్ఠానం అంగీకరించకపోగా క్రమేపి ఆమంచిని దూరం పెట్టడం ప్రారంభించారు. దీంతో చీరాలలో తన రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పోటీలోకి రావాలని ఆమంచి భావించారు. ఇండిపెండెంట్‌గా రంగంలోకి రావచ్చనే ప్రచారం జరిగింది. తాజాగా కాంగ్రెస్ నుంచి ఆయనకు సంకేతం వచ్చినట్లు తెలిసింది. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలతో మాట్లాడినట్లు కూడా సమాచారం. ఆ మేరకు శుక్రవారం ఆమెను కలవబోతున్నట్లు కూడా ఆయా వర్గాల్లో సమాచారం ఉంది. అయితే అనుచరులతో మాట్లాడి ఉగాది రోజుకు తుది నిర్ణయం తీసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చీరాలతోపాటు పర్చూరు నియోజకవర్గాల్లోని అనుచరులతో కూడా ఆయన మంతనాలు జరిపి వైసీపీకి వ్యతిరేకంగా పనిచేయాలని పిలుపునిచ్చినట్లు తెలిసింది.