Share News

దుర్గా కోఆపరేటివ్‌ బ్యాంకు లైసెన్సు రద్దు

ABN , Publish Date - Nov 13 , 2024 | 05:36 AM

పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడం, డిపాజిట్లు లేకపోవడంతో విజయవాడ వన్‌టౌన్‌లోని దుర్గా కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దుర్గా కోఆపరేటివ్‌ బ్యాంకు లైసెన్సు రద్దు

బ్యాంకింగ్‌ కార్యకలాపాలు నిలిపివేసిన ఆర్బీఐ

రూ.5 లక్షల లోపువారికి పూర్తి చెల్లింపులు

ఆపై ఎంత వేసినా ఇచ్చేది రూ.5 లక్షలే!

లిక్విడేటర్‌ను నియమించిన తర్వాతే చెల్లింపులు

విజయవాడ వన్‌టౌన్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోవడం, డిపాజిట్లు లేకపోవడంతో విజయవాడ వన్‌టౌన్‌లోని దుర్గా కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకు లైసెన్సును రద్దు చేస్తూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకింగ్‌ కార్యకలాపాలను తక్షణం నిలిపివేసి, ఏపీ సహకార సంఘాల రిజిస్ట్రార్‌ను లిక్విడేటర్‌ను నియమించాలని ఆదేశించింది. విజయవాడ వన్‌టౌన్‌లో ఉన్న దుర్గా కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకులో మంగళవారం ఆర్బీఐ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయినట్లు గుర్తించారు. మరోవైపు బ్యాంకు వద్ద తగిన స్థాయిలో డిపాజిట్లు లేవని తేల్చారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఖాతాదారులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని భావించి, బ్యాంకు లైసెన్సు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. లిక్విడేటర్‌ను నియమించిన తర్వాత డిపాజిటర్లకు సొమ్ములు చెల్లిస్తామని అధికారులు తెలిపారు. పెద్ద మొత్తంలో డిపాజిట్‌ చేసినవారికి గరిష్ఠంగా రూ.5 లక్షలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు అధికారులు ఆర్బీఐకు ఇచ్చిన సమాచారం ప్రకారం 95.8 శాతం డిపాజిటర్లు రూ.5 లక్షలలోపు వారేనని, వారికి పూర్తిమొత్తం చెల్లిస్తామని ఆర్బీఐ అధికారులు తెలిపారు.

ఎన్నో అవినీతి ఆరోపణలు... కేసులు

దుర్గా కోఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంకుపై గత పదేళ్లుగా అవినీతి ఆరోపణలు, పలు కేసులు నమోదవుతూ వస్తున్నాయి. వీటిపై విచారణ జరిపిన ఆర్బీఐ ఉన్నతాధికారులు బ్యాంకుపై పలు ఆంక్షలు విధించారు. డిపాజిట్‌దారులు తాము దాచుకున్న మొత్తంలో రూ.లక్షన్నర వరకే విత్‌ డ్రా చేసుకోవాలని చెప్పారు. దీనిపై డిపాజిట్‌దారులు ఆందోళనలు చేశారు. బ్యాంకు అధికారులు వివిధ రుణాల రూపేణా సుమారు రూ.60 కోట్ల వరకు ఇచ్చారు. ఈ రుణాలను తిరిగి వసూలు చేయలేకపోవటంతో పదేళ్ల నుంచి వడ్డీతో రూ. 190 కోట్లకు చేరింది. ఈ క్రమంలో బెంగళూరు నుంచి వచ్చిన ఇద్దరు ఆర్బీ ఐ అధికారులు అర్బన్‌ బ్యాంకులో తనిఖీలు చేసి.. లైసెన్సు రద్దు చేశారు.

Updated Date - Nov 13 , 2024 | 05:38 AM