Share News

Ganta Srinivasa Rao : మాజీ వీసీ ప్రసాదరెడ్డిని వదిలేదే లేదు

ABN , Publish Date - Jun 30 , 2024 | 03:59 AM

‘ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించిన పీవీజీడీ ప్రసాదరెడ్డి పదవికి రాజీనామా చేసినా విడిచిపెట్టేది లేదు. ఐదేళ్లలో చేసిన అక్రమాలపై విచారణ జరిపించి శిక్ష పడేలా చేస్తాం’

 Ganta Srinivasa Rao : మాజీ వీసీ ప్రసాదరెడ్డిని వదిలేదే లేదు

  • ఏయూని భ్రష్టు పట్టించారు: ఎమ్మెల్యే గంటా

విశాఖపట్నం, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని భ్రష్టు పట్టించిన పీవీజీడీ ప్రసాదరెడ్డి పదవికి రాజీనామా చేసినా విడిచిపెట్టేది లేదు. ఐదేళ్లలో చేసిన అక్రమాలపై విచారణ జరిపించి శిక్ష పడేలా చేస్తాం’ అని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఆయనతో పాటు ఎంపీ సీఎం రమేశ్‌, ఎమ్మెల్యే లు వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ తదితరులు ఏయూను సందర్శించారు.

వీసీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంటా మాట్లాడారు. ‘గడిచిన ఐదేళ్లలో వర్సిటీని ప్రసాదరెడ్డి వైసీపీ కార్యాలయంగా మార్చేశారు. ఇక్కడి నుంచే డబ్బు పంపిణీ, సర్వేల నిర్వహణ నిర్వహించారు. వీసీ ఎలా ఉండకూడదో ప్రసాదరెడ్డి ఉదాహరణగా నిలిచారు. వర్సిటీని సెంట్రల్‌ జైలు మాదిరిగా మార్చేశారు. రీ రీవాల్యూయేషన్‌ పేరుతో అడ్డగోలుగా దోచుకున్నాడు.

వీటిన్నింటిపైనా సమగ్ర విచారణ చేయిస్తాం’ అన్నారు ఎంపీ సీఎం రమేశ్‌ మాట్లాడుతూ... ‘దేశంలో ఎక్కడా జరగని అడ్డగోలు వ్యవహారాలు ఏయూలో ప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో జరిగాయి. వీటిన్నింటిపైనా న్యాయ విచారణ జరిపిస్తాం. ఇంటర్‌ అర్హత కలిగిన మాజీ ఎంపీ ఎంవీవీకి.. పీహెచ్‌డీ పట్టాను ఇచ్చారు. చంద్రబాబును అరెస్టు చేశాడన్న కారణంతోనే ఐపీఎస్‌ అధికారి సునీల్‌కు పీహెచ్‌డీ ఇచ్చారు. రాబోయే ఐదేళ్లు ప్రసాదరెడ్డి శిక్ష అనుభవించక తప్పదు’ అని అన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - Jun 30 , 2024 | 03:59 AM