పార్కుపై వైసీపీ నేతల కన్ను
ABN , Publish Date - Feb 08 , 2024 | 11:44 PM
నగరంలోని దాసన్నపేట రామకృష్ణనగర్‌లో ఉన్న పార్కుపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. పార్కు ప్రహరీ చుట్టూ ఆక్రమణలకు ఇన్నాళ్లూ ప్రోత్సహించిన నేతలు ఇక పార్కు ప్రహరీని తొలగించి రోడ్డు వేయాలని వ్యూహం పన్నారు.

పార్కుపై వైసీపీ నేతల కన్ను
ఇప్పటికే ప్రహరీ చుట్టూ కొంత ఆక్రమణ
ఇప్పుడు రోడ్డు వేసేందుకు సన్నాహాలు
ఆ తరువాత ఆక్రమించాలని పన్నాగం
(విజయనగరం రూరల్)
నగరంలోని దాసన్నపేట రామకృష్ణనగర్‌లో ఉన్న పార్కుపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. పార్కు ప్రహరీ చుట్టూ ఆక్రమణలకు ఇన్నాళ్లూ ప్రోత్సహించిన నేతలు ఇక పార్కు ప్రహరీని తొలగించి రోడ్డు వేయాలని వ్యూహం పన్నారు. ఆ తరువాత పార్కు స్థలాన్ని కూడా కబ్జా చేసేయోచ్చునని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్కు మధ్యలోంచి ఖాళీకామాత ఆలయం వరకూ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి వాటి ఆమోదానికి నగరపాలక సంస్థ అధికారులపై ఒత్తిడి తెచ్చి.. రెండు రోజుల క్రితం రోడ్డుకు శంకుస్థాపన కూడా ఎంచక్కా నిర్వహించేశారు. ఆ నోట.. ఈ నోట విషయం తెలుసుకున్న రామకృష్ణనగర్ వాసులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు.
వాస్తవానికి రామకృష్ణనగర్‌లో ఉంటున్న కుటుంబాల ఆట విడుపు కోసం ఈ పార్కుని ఏర్పాటు చేశారు. తర్వాత రోజుల్లో పార్కును అభివృద్ధి చేయకుండా వదిలేయడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయింది. పరిసరాలు అధ్వానంగా తయారయ్యాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో పార్కు చుట్టూ ప్రహరీ ఏర్పాటు చేశారు. గేటు వేసి తాళం ఏర్పాటు చేశారు. దీంతో అసాంఘిక కార్యకలాపాలు తగ్గాయి. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు స్థానిక నాయకులు ప్రభుత్వ స్థలమే కదా కబ్జా చేసేద్దామనుకున్నారు. వారికి పెద్ద నేతలు సహకరించారు. ముందు రోడ్డు వేసి ఆ తరువాత రోడ్డుకు ఆనుకుని అక్రమణలకు దిగేందుకు తాజాగా నిర్ణయించారు. విషయం తెలుసుకున్న స్థానికులు దీనిని వ్యతిరేకిస్తున్నారు. నగరపాలక సంస్థ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడుకు ఇప్పటికే వినతిపత్రం అందించారు. పార్కు మధ్యలో రోడ్డు వేస్తే ఆ ప్రాంతం మునుపటిలాగే అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలకు చిరునామాగా మారుతుందని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. రామకృష్ణనగర్ వాసులు మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ప్రసాదుల కనకమహాలక్ష్మీ, టీడీపీ నగర అధ్యక్షుడు ప్రసాదుల ప్రసాద్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు. వీరు గురువారం మధ్యాహ్నం స్థానికులతో కలిసి ఆ స్థలాన్ని పరిశీలించారు. పార్కుని అభివృద్ధి చేయాల్సింది పోయి.. రోడ్డు వేసి అక్రమణలకు ప్రోత్సాహిస్తారా? అంటూ మండిపడ్డారు. ఈ విషయంలో నగరపాలక సంస్థ అధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతాం
ప్రసాదుల రజని, రామకృష్ణ నగర్
పార్కుని అభివృద్ధి చేయాల్సింది పోయి పార్కు మధ్యలోంచి రోడ్డు వేయడం ఏమిటి? ఇప్పటికే ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లాం. ప్రహారీ చుట్టూ ఇప్పటికే ఎవరికి వారు ఆక్రమించుకున్నారు. ఇప్పుడు పార్కు మధ్యలో నుంచి రోడ్డు వేసి పార్కుని భవిష్యత్ తరాలకు మిగలనీయకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై కలెక్టర్ నాగలక్ష్మిని కూడా కలవనున్నాం. అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి.
చోరీలకు అడ్డా అయిపోతుంది
సబ్బి నాగమణి, రామకృష్ణానగర్
గతంలో ఈ పార్కు స్థలంలో నుంచి మా ఇళ్లల్లోకి దొంగలు ప్రవేశించారు. మద్యం సేవించడం, ఆకతాయిల చిందులకూ అడ్డాగా ఉండేది. గత ప్రభుత్వ హయాంలో ప్రహరీతో పాటు పార్కు స్థలానికి గేటు కూడా వేశారు. దీంతో అసాంఘిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఇప్పుడు రోడ్డు వేస్తే గతంలో జరిగిన పరిణామాలు పునరావృతమవుతాయి.