తారకరామ తీర్థసాగర్ కీలకం
ABN , Publish Date - Mar 27 , 2025 | 12:23 AM
Tarakarama Tirtha Sagar should compliet తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాకు అనేక ఉపయోగాలు ఉన్నాయని, వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరు, విజయనగరం కార్పొరేషన్ ప్రజలకు తాగునీరు, భోగాపురం ఎయిర్‌పోర్టుకు నీరు సరఫరా చేయవచ్చునని కలెక్టర్ అంబేడ్కర్ అమరావతి సదస్సులో బుధవారం సీఎం చంద్రబాబుకు వివరించారు.

తారకరామ తీర్థసాగర్ కీలకం
ప్రాజెక్టును పూర్తి చేస్తే తాగు, సాగునీటితో పాటు ఎయిర్‌పోర్టుకూ నీరు సరఫరా
జిల్లాలో పర్యాటకుల కోసం హోటళ్ల నిర్మాణం
అమరావతి సదస్సులో సీఎంకు వివరించిన కలెక్టర్ అంబేడ్కర్
కలెక్టర్ల సదస్సుల్లో ఇతర ముఖ్యమైన సమస్యలూ ప్రస్తావన
విజయనగరం/ కలెక్టరేట్, మార్చి 26(ఆంధ్రజ్యోతి):
తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టును పూర్తి చేస్తే జిల్లాకు అనేక ఉపయోగాలు ఉన్నాయని, వేలాది ఎకరాల ఆయకట్టుకు నీరు, విజయనగరం కార్పొరేషన్ ప్రజలకు తాగునీరు, భోగాపురం ఎయిర్‌పోర్టుకు నీరు సరఫరా చేయవచ్చునని కలెక్టర్ అంబేడ్కర్ అమరావతి సదస్సులో బుధవారం సీఎం చంద్రబాబుకు వివరించారు. కలెక్టర్ల రెండోరోజు సదస్సులో ఆయన ప్రసంగిస్తూ జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను, జిల్లా ప్రజల అవసరాలను ప్రస్తావించారు. జిల్లా అభివృద్ధిలో భోగాపురం ఎయిర్‌పోర్టు కీలకం కానుందని, నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, నిర్దేశించిన సమయంలోగా పనులు పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. అదే ప్రాంతంలో ఫైవ్‌స్టార్ హోటల్ నిర్మాణ పనులూ చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఎయిర్‌పోర్టు అవసరాలకు తాగునీరు, వాడుక నీరు ప్రధానమని, ఇందుకోసం తారకరామతీర్థసాగర్ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాల్సి ఉందని అభిప్రాయ పడ్డారు. తారకరామ పూర్తయితే ఎయిర్‌పోర్టుకు నీటితో పాటు ఆ ప్రాంతంలో వచ్చే ఇతర కంపెనీలకు కూడా నీటి సమస్య లేకుండా ఉంటుందన్నారు. విజయనగరం కార్పొరేషన్ ప్రజలకు తాగునీటి సరఫరాను మెరుగుపరచవచ్చని, జిల్లావ్యాప్తంగా 16 వేల ఎకరాల అదనపు ఆయట్టుకు సాగునీరు అందించడం సాధ్యం అవుతుందన్నారు. తోటపల్లి కుడి కాలువ పూర్తి చేయడం ద్వారా మరో 23,119 ఎకరాల ఆయకట్టుకు అదనంగా సాగునీరు అందించవచ్చని చెప్పారు. ఈ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.105.63 కోట్లు అవసరం పడుతుందని కలెక్టరు వివరించారు.
- జిల్లా ఇన్‌చార్జి మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల ప్రజలకు తాగు, సాగునీరు అందుతుందన్నారు.
జిల్లా కేంద్రాసుపత్రిలో డయాలసిస్ కేంద్రం
విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో గతంలో కంటే మెరుగైన వైద్య సౌకర్యాలు అందుతున్నాయని, జిల్లా ప్రజలు ఎప్పటినుంచో కోరుతున్న విధంగా డయాలసిస్ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ ప్రస్తావించారు. జిల్లాలో కేంద్రాసుపత్రికి సంబంధించి ఇతర మౌలిక వసతులు కల్పించే దిశగా ప్రయత్నాలు విస్తృతం చేశామన్నారు. ఓపీ గణనీయంగా పెరిగిందని చెప్పారు. విజయనగరాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక రంగాల్లో మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెప్పారు.
ఆలయాల అభివృద్ధికి చర్యలు
విజయనగరానికి సంబంధించి పైడిమాంబ ఆలయం, నెల్లిమర్ల నియోజకవర్గ పరిధిలోని రామతీర్థంను ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా కూడా అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పారు. రెండింటినీ పర్యాటకంగా అభివృద్ధి చేస్తే జిల్లాకు గణనీయంగా ఆదాయం పెరగడంతో పాటు ఉద్యోగ... ఉపాధి అవకాశాలు పెరగనున్నాయన్నారు.
16.63 శాతం వృద్ధి రేటు సాధిస్తాం
వ్యవసాయ అనుబంధ రంగాల్లో 16.63 శాతం వృద్ధి రేటు సాధించాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. పరిశ్రమల్లో 17.17 శాతం, సేవల రంగంలో 15.81 శాతం గ్రోత్ రేట్‌ను సాధించడానికి ప్రణాళికలను రూపొందించినట్లు వివరించారు. జిల్లాలో 10 వేల హెక్టార్లలో వ్యవసాయం విస్తరణకు, ప్రకృతి వ్యవసాయాన్ని 24,281 హెక్టార్లలో సాగు చేయడంపై దృష్టిపెట్టామన్నారు. రెండు వేల హెక్టార్లలో అదనంగా వేసవి పంటలు, నూనె గింజలను సాగు లోకి తేవడానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. మామిడి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.