Share News

ఢిల్లీలో..దీటుగా

ABN , Publish Date - Jun 23 , 2024 | 11:55 PM

ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎన్నికైన యువకుడు, విద్యా వంతుడు పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ నేడు లోక్‌సభలో పదవీ ప్రమాణం చేయనున్నారు. ఇక ఎంపీ హోదాలో పూర్తిస్థాయిలో ప్రజా సేవలో ఇమడబోతున్నారు.

ఢిల్లీలో..దీటుగా

నేడు ఎంపీ పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ పదవీ ప్రమాణం

ఇప్పటికే ఎన్నికల్లో భారీ హామీలు ఇచ్చిన ఎంపీ

పోలవరం, చింతలపూడి పూర్తికి అనుకూలత

క్షేత్రస్థాయిలో పీకల్లోతు సవాళ్ళు ఎన్నో..

అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు

(ఏలూరు, ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

జిల్లాలో కొలిక్కిరాని దీర్ఘకాలిక సమస్యలకు కేంద్రనిధులతో ప్రాణం పోయాలి. తాగు, సాగునీటి కల్పనలో ప్రత్యేక పాత్ర పోషిం చాలి. ఏడుగురు శాసనసభ్యులకు పెద్దన్నగా మారాలి. పార్టీ, ప్రభు త్వ కార్యక్రమాల్లోనూ ప్రజా సమస్యల పరిష్కారంలోనూ, అధికార యంత్రాం గాన్ని ముందుకు నడిపిం చడంలోనూ సమన్వయంగా... సంయమనంగా వ్యవహరించాలి. జిల్లాకు పెద్ద దిక్కుపాత్రలో లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంట్‌ సభ్యుడే బాధ్యత తీసుకోవాల్సింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అలవోకగా తీర్చాల్సిన బాధ్యత ఎంపీదే. ఈ నేపథ్యంలోనే ఏలూరు లోక్‌సభ స్థానం నుంచి తొలిసారి ఎన్నికైన యువకుడు, విద్యా వంతుడు పుట్టా మహేష్‌ కుమార్‌ యాదవ్‌ నేడు లోక్‌సభలో పదవీ ప్రమాణం చేయనున్నారు. ఇక ఎంపీ హోదాలో పూర్తిస్థాయిలో ప్రజా సేవలో ఇమడబోతున్నారు.

భారీ మెజార్టీతో గెలుపొందిన ఆయన ఇప్పటికే ప్రజలకు అనేక కీలక హామీలు ఇచ్చారు. ఏలూరు లోక్‌సభ స్థానం పరిధిలో ఇక్కడ ఉన్న రాజకీయ పరిణామాలను గమనించి తెలుగుదేశం ఈ మేరకు బీసీ అభ్యర్థిని ఎంపీగా గెలిపించి జిల్లా అభివృద్ధికి కొత్త బాటలు వేయాలని అప్పట్లోనే వ్యూహం రచించారు. ఇంతకు ముందు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి అందరూ అగ్రవర్ణాలకు చెందిన అభ్యర్థులే గెలుపొందుతూ వచ్చారు. సామాజిక వర్గాల వారీగా ఎలాంటి విభజన లేకుండా ఏ పార్టీ అయినా ఇదే కోణంలో ఆలోచించి ఎన్నికల బరిలో నిలిపేవారు. కాని ఈసారి కూటమిగా ఏర్పడిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆసాంతం ఎన్నికల వ్యూహాన్ని విజయ వంతంగా అమలుచేశాయి. సామాజిక వర్గాలను కూడకట్టుకునే క్రమంలో యాదవ సామాజిక వర్గం నుంచి ఎంపీ స్థానానికి ప్రాతినిధ్యం కల్పించాలని యోచించారు. ఇదే క్రమంలో వైసీపీ ఆ వైపే అడుగులు వేసి తమపక్షాన బీసీ అభ్యర్థిని రంగంలోకి దిం చింది. కూటమి కూడా బీసీ అభ్యర్థిగా మహేష్‌ను బరిలోకి దింపి గెలుపు సాధించే దిశగా సకల సన్నాహాల్లోనూ రాణించింది. దీనికి తోడు కొద్దిరోజుల వ్యవధిలోనే మహేష్‌ తనకంటూ ఒక ముద్రపడేలా శరవేగంగా ప్రజలతో కలిసి పోయారు. తన లక్ష్యం ఏమిటో ప్రజలకు వివరించారు. తనను ఎంపీగా గెలిపిస్తే తాను ఏం చేయదలచింది స్పష్టతతో కూడిన హామీలు ప్రజల ముందు ఉంచారు. ఇదే ఆయన విజయానికి భారీగా దోహదపడింది.

ఇప్పుడున్న లక్ష్యాలు ఆషామాషీ కాదు

తాను ఎంపీగా ఎన్నికైతే రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, మెట్ట ప్రాంతానికి గోదావరి జలాలు అందిస్తే చింతల పూడి ఎత్తిపోతల సమాంతరంగా మిగతా సాగునీటి పనులు అన్నింటిని ఈ ఐదేళ్లల్లో పూర్తిచేస్తానని పదేపదే ప్రజలకు భరోసా ఇస్తూ వచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే అనేక సవాళ్ళు కళ్ళఎదుటే కనిపిస్తున్నాయి. పోలవరం పూర్తికి పార్లమెంట్‌లో కూటమి పక్షాన కేంద్రాన్ని ఒప్పించే విధంగా ప్రధాన పాత్ర, భూమిక పోషించాలి. ఇంకో వైపు చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని లక్ష్యంగా ఎంచుకున్నందున ఈ ఎత్తిపోతల పూర్తికి నిధుల లోటే ఆటంకం. ఇప్పుడు ఆ దిశగానే పార్లమెంట్‌లో ప్రస్తావించడం, కేంద్రంలో పోలవరంకు అనుకూలంగా ఒప్పించే విధంగానే రాష్ట్రంలోను చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసేందుకు సీఎం చంద్రబాబును మెప్పించే విధంగా వ్యవహరిం చాల్సిన బాధ్యత ఎంపీతో పాటు ఇదే జిల్లాలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యే లది కూడా. ఇంకోవైపు ఎక్కడాలేని విధంగా తాను గెలిస్తే నిరుద్యోగ సమస్య తీర్చేందుకు అత్యధికులకు ఉద్యోగాలు లభించేలా చూస్తానని, దీనికి గాను పారిశ్రామికీకరణ చేసి చూపిస్తానని మహేష్‌ ప్రజలకు గట్టి హామీ ఇచ్చారు. ఇప్పుడు దీనిపై కూడా దృష్టిపెట్టాల్సి ఉంది. ఏలూరులో కాస్తోకూస్తో కొంతమందికి ఉపాధి కల్పించే జూట్‌మిల్లు లాకౌట్‌ అయింది. దీనికి సమాంతరంగా మరికొన్ని పరిశ్రమలు తెస్తేతప్ప ఏలూరు లో మధ్యతరగతి కుటుంబాలకు కాస్తంత ఆదరువు దక్కే పరిస్థితి లేదు.

పుట్టాకు కూటమి పక్షాన అభినందనలు

లోక్‌సభలో పదవీ ప్రమాణం చేయనున్న ఎంపీ పుట్టాకు కూటమి పక్షాన ఇప్పటికే పలువురు అభినందనలు తెలిపారు. ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని తెలుగువారిగా... గోదావరి జిల్లాల ప్రతినిధిగా సాగు,తాగునీటి సమస్యలపై లోక్‌సభలో ఏకరువు పెట్టాలని, ప్రధాన సమస్యలు అన్నింటి పైన తక్షణ పరిష్కారానికి ప్రయత్నించాలని ఆ లక్ష్యంగా మీరు వేసే ప్రతి అడుగు విజయవంతం కావాలని ఎంపీ మహేష్‌కుమార్‌ యాదవ్‌కు ఎమ్మెల్యేలంతా అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 23 , 2024 | 11:56 PM