Share News

పసిడి రికార్డు పరుగు

ABN , Publish Date - Sep 26 , 2024 | 12:47 AM

పసిడి ధర సరికొత్త జీవిత కాల రికార్డు స్థాయికి పెరిగింది. 10 గ్రాముల ధర రూ.78,000కు చేరువైంది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర బుధవారం మరో రూ.900 పెరిగి రూ.77,850కి చేరుకుంది. బంగారానికి ఇప్పటి వరకిదే...

పసిడి రికార్డు పరుగు

రూ.77,850కి 10 గ్రాముల ధర.. ఒక్కరోజే రూ.900 అప్‌

  • వెండి రూ.3,000 జంప్‌..

  • రూ.93,000కు చేరిన కేజీ

న్యూఢిల్లీ: పసిడి ధర సరికొత్త జీవిత కాల రికార్డు స్థాయికి పెరిగింది. 10 గ్రాముల ధర రూ.78,000కు చేరువైంది. ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర బుధవారం మరో రూ.900 పెరిగి రూ.77,850కి చేరుకుంది. బంగారానికి ఇప్పటి వరకిదే గరిష్ఠ స్థాయి. వెండి సైతం భారీగా ఎగబాకింది. కిలో రూ.3,000 పెరుగుదలతో రూ.93,000 ధర పలికింది. అంతర్జాతీయంగానూ వీటి ధరలు ఆల్‌టైం రికార్డు స్థాయికి పుంజుకోవడమే ఇందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు ఒక దశలో 2,694.89 డాలర్లకు ఎగబాకింది. సిల్వర్‌ 32.15 డాలర్లకు పుంజుకుంది.


త్వరలో 3,200 డాలర్లకు ఔన్స్‌ బంగారం?

అమెరికన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ గతవారం ప్రామాణిక వడ్డీ రేట్లను 0.50 శాతం తగ్గించినప్పటి నుంచి బంగారం ధరలు వేగంగా పెరుగుతున్నాయి. వచ్చే సమీక్షలో ఫెడ్‌ రేట్లు మరింత తగ్గవచ్చని మార్కెట్లో ఊహాగానాలు ఇప్పటికే ఊపందుకున్నాయి. ఇందుకు తోడు పశ్చిమాసియాలో యుద్ధవాతావరణం నెలకొనడం, తాజాగా చైనా సైతం వడ్డీ రేట్లను తగ్గించడం, ఆర్థిక వ్యవస్థకు దన్నుగా మరిన్ని ఉద్దీపనలు ప్రకటించడం పసిడి గిరాకీని మరింత పెంచవచ్చని బులియన్‌ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇదే ట్రెండ్‌ కొనసాగితే, సమీప భవిష్యత్‌లో ఔన్స్‌ గోల్డ్‌ 3,200 డాలర్ల స్థాయికి ఎగబాకినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఇండియా బులియన్‌ అండ్‌ జువెలర్స్‌ అసోసియేషన్‌ (ఐబీజేఏ) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అభిప్రాయపడ్డారు.

Updated Date - Sep 26 , 2024 | 06:44 AM