అదానీ షేర్ల షార్ట్ సెల్లింగ్‌లో కోటక్ మహీంద్రా బ్యాంక్ హస్తం
ABN , Publish Date - Jul 03 , 2024 | 02:13 AM
అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో బాంబు పేల్చింది. ఈసారి ఏకంగా ఉదయ్ కోటక్ ప్రమోట్ చేసిన ప్రముఖ బ్యాంక్.. కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరును రోడ్డు కీడ్చింది...
ఎఫ్‌పీఐ ద్వారా క్లయింట్ షార్ట్ పొజిషన్.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వెల్లడి
న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మరో బాంబు పేల్చింది. ఈసారి ఏకంగా ఉదయ్ కోటక్ ప్రమోట్ చేసిన ప్రముఖ బ్యాంక్.. కోటక్ మహీంద్రా బ్యాంక్ పేరును రోడ్డు కీడ్చింది. అదానీ గ్రూప్ దందాపై తమ నివేదిక వివరాలను ముందే తెలుసుకున్న కింగ్‌డమ్ క్యాపిటల్ అనే తమ క్లయింట్.. అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (ఏఈఎల్) కంపెనీ షేర్లలో షార్ట్ పొజిషన్ తీసుకుని రూ.183.24 కోట్ల (2.23 కోట్ల డాలర్లు) మేర లాభం పొందినట్టు తెలిపింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ అనుబంఽధ సంస్థ.. కోటక్ మహీంద్రా ఇన్వె్‌స్టమెంట్స్ లిమిటెడ్ (కేఎంఐఎల్) విదేశీ పోర్టుఫోలియో ఇన్వె్‌స్టమెంట్ (ఎఫ్‌పీఐ) విభాగమైన కే-ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్ లిమిటెడ్ (కేఐఓఎ్‌ఫఎల్) ద్వారా కింగ్‌డమ్ క్యాపిటల్ ఈ షార్ట్ పొజిషన్ తీసుకున్నట్టు తెలిపింది.
అంతా అబద్దం
కోటక్ మహీంద్రా బ్యాంక్ అనుబంధ సంస్థ కేఎంఐఎల్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఎప్పు డూ తమ అనుబంధ సంస్థ కేఐఓఎ్‌ఫఎల్ క్లయింట్ కాదని తెలిపింది. తమ పెట్టుబడులన్నీ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ నిబంధనలకు అనుగుణంగానే ఉంటాయని స్పష్టం చేసింది. తమ క్లయింట్లు ఎవరూ ఇతరుల తరఫున పెట్టుబడులు పెట్టడాన్నీ తాము అనుమతించమని స్పష్టం చేసింది. కేవైసీ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే తాము ఏ సంస్థనైనా క్లయింట్‌గా చేర్చుకుంటామని తెలిపింది.
కోటక్ బ్యాంక్ షేరు డౌన్
ఈ వార్తలతో మంగళవారం కోటక్ మహీంద్రా బ్యాంక్ షేరు నష్టాలబాటపట్టింది. బీఎ్‌సఈలో ఈ షేరు 2.16 శాతం నష్టంతో రూ.1,769.60 వద్ద ముగిసింది. దీంతో బ్యాంక్ మార్కెట్ క్యాప్ రూ.7,777.33 కోట్లు తుడిచి పెట్టుకుపోయింది. ఇంట్రాడేలో కోటక్ బ్యాంక్ షేరు ఒక దశలో 3.98 శాతం నష్టంతో రూ.1,736.65 కనిష్ఠ స్థాయిని తాకింది.
హిండెన్‌బర్గ్‌కు సెబీ షోకాజ్ నోటీసులు
ఈ ఆరోపణల నేపథ్యంలో సెబీ.. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థకు 46 పేజీల షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపైనా హిండెన్‌బర్గ్ రీసెర్చ్ మండిపడింది. కనీసం కోటక్ మహీంద్రా పేరును కూడా ప్రస్తావించకుండా.. తమకు నోటీసులు జారీ చేయడం ఏమిటని ప్రశ్నించింది. ఉదయ్ కోటక్ ప్రముఖ వ్యక్తి కాబట్టే, సూచనప్రాయంగా కూడా సెబీ ఆయన పేరు ప్రస్తావించలేదని ఆరోపించింది. ఈ విషయంలోనూ సెబీ ప్రముఖ వ్యాపారవేత్తల కొమ్ముకాస్తోందని ఆరోపించింది. అదానీ గ్రూప్ షేర్ల దందాపైనా, తాము సమగ్ర వివరాలు ఇచ్చినా సెబీ తూతూమంత్రంగా దర్యాప్తు జరిపి అదానీ గ్రూప్‌ను ఒడ్డున పడేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది. దేశంలో శక్తివంతులైన వ్యక్తుల అవినీతి, మోసాలపై ఎవరూ నోరు మెదపకుండా భయపెట్టేలా సెబీ షోకాజ్ నోటీసు ఉందని దుయ్యబట్టింది.