Stock Market : మార్కెట్లో కొనసాగిన జోరు
ABN , Publish Date - Mar 22 , 2025 | 12:46 AM
స్టాక్ మార్కెట్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఈ వారంలో వరుసగా ఐదు ట్రేడింగ్ రోజులూ కీలక సూచీలు లాభాల్లోనే ముగిశాయి.

సెన్సెక్స్ 557 పాయింట్లు అప్
5 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.22 లక్షల కోట్లు అప్
ముంబై: స్టాక్ మార్కెట్లో ఉత్సాహం ఉప్పొంగుతోంది. ఈ వారంలో వరుసగా ఐదు ట్రేడింగ్ రోజులూ కీలక సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ప్రధానంగా ఈ ఏడాది మరో రెండు విడతలు వడ్డీ రేట్ల కోత ఉంటుం దన్న అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలు ఇన్వెస్టర్ సెంటిమెంట్ పెరిగేందుకు దోహదపడ్డాయి. దీనికి తోడు డాలర్ ఇండెక్స్ బలహీనపడడంతో విదేశీ ఇన్వెస్టర్లు మరోసారి వర్థమాన మార్కెట్లలో పెట్టుబడులను పెంచారు. దీంతో శుక్రవారం సెన్సెక్స్ 557.45 పాయింట్లు లాభపడి 76,905.51 వద్ద ముగియగా నిఫ్టీ 159.75 పాయింట్ల లాభంతో 23,350.40 వద్ద ముగిసింది. సర్వత్రా సానుకూల వాతావరణంలో వారం మొత్తం మీద సెన్సెక్స్ 3076 పాయింట్లు, నిఫ్టీ 953 పాయింట్లు లాభపడ్డాయి. స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద ఉన్న సమాచారం ప్రకారం విదేశీ ఇన్వెస్టర్లు గురువారం రూ.3,239.19 కోట్ల విలువ గల ఈక్విటీలు కొనుగోలు చేశారు. చమురు ధరలు అదుపులో ఉండడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను పెంచింది.
శుక్రవారం బ్యారెల్ క్రూడాయిల్ 0.21 శాతం తగ్గి 71.85 డాలర్ల వద్ద ట్రేడయింది. కాగా ఐదు రోజుల ర్యాలీ ప్రభావంతో ఇన్వెస్టర్ల సంపద రూ.22,12,191.12 కోట్లు పెరిగి రూ.4,13,30,624.05 కోట్లకు (4.79 లక్షల కోట్ల డాలర్లు) చేరింది. అన్ని వర్గాల ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించటం కలిసివచ్చిందని విశ్లేషకులంటున్నారు.