Share News

NPS Vatsalya: ఎన్‌పీఎస్ వాత్సల్య పథకానికి అనూహ్య స్పందన.. మీరూ ఖాతా తెరవాలనుకుంటున్నారా

ABN , Publish Date - Sep 21 , 2024 | 05:31 PM

కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. తొలిరోజే దాదాపు 9,705 మంది మైనర్‌లు ఎన్‌పీఎస్ వాత్సల్య కింద నమోదు చేసుకున్నారు.

NPS Vatsalya: ఎన్‌పీఎస్ వాత్సల్య పథకానికి అనూహ్య స్పందన.. మీరూ ఖాతా తెరవాలనుకుంటున్నారా

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించిన ఎన్‌పీఎస్ వాత్సల్య పథకానికి అనూహ్య స్పందన లభిస్తోంది. తొలిరోజే దాదాపు 9,705 మంది మైనర్‌లు ఎన్‌పీఎస్ వాత్సల్య కింద నమోదు చేసుకున్నారు. భారత యువత ఆర్థిక భవిష్యత్తును కాపాడే లక్ష్యంతో..నిర్మలా సీతారామన్ సెప్టెంబర్ 18న NPS వాత్సల్య పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు. కేంద్ర బడ్జెట్ 2024-25లో కూడా ఈ పథకం గురించి ప్రస్థావించారు. ఎన్‌పీఎస్‌ను ప్రారంభించిన తొలి రోజు అద్భుతమైన స్పందన లభించిందని.. 9,705 మంది మైనర్ సబ్‌స్క్రైబర్లు ఈ పథకం కింద నమోదు చేసుకున్నారని పీఎఫ్‌ఆర్‌డీఎ ఒక ప్రకటనలో తెలిపింది. కేవలం ఈ-ఎన్‌పీఎస్‌ పోర్టల్‌ ద్వారానే 2,197 ఖాతాలు నమోదైనట్లు వెల్లడించింది.


ఎన్‌పీఎస్ అంటే..

భారత పౌరులతో పాటు ఎన్‌ఆర్‌ఐలు, ఓవర్సీస్‌ సిటిజెన్స్‌‌లూ తమ పిల్లల పేరున వాత్సల్య ఖాతాలు ప్రారంభించవచ్చు. ఏడాదికి కనీసం 1,000 జమ చేసుకునే సౌలభ్యం కూడా ఉంది. గరిష్ఠ పరిమితి లేదు. ఈ పొదుపు ద్వారా తల్లిదండ్రులు పన్ను మినహాయింపు పొందవచ్చు. ప్రస్తుతం 80సీ కింద లభిస్తున్న రూ.1.50లక్షల మినహాయింపునకు ఇది అదనం. సెక్షన్‌ 80(సీసీడీ)(1బీ) కింద రూ.50వేల వరకూ అదనంగా పన్ను మినహాయింపు లభిస్తుంది. 18 ఏళ్లలోపు వయసున్న పిల్లలు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవవచ్చు. 18 ఏళ్లు నిండాక ఆ ఖాతా రెగ్యులర్‌ ఎన్పీఎస్ ఖాతాగా మారిపోతుంది. 60 ఏళ్ల వయసు వచ్చిన తర్వాతి నుంచి ఖాతా నుంచి పెన్షన్‌ అందుతుంది. 60 ఏళ్లు నిండిన తర్వాత అప్పటివరకూ పొదుపు చేసిన సొమ్ములో 60శాతాన్ని ఏకమొత్తంగా వెనక్కి తీసుకోవచ్చు.


మిగిలిన మొత్తాన్ని సాధారణ పెన్షన్ చెల్లింపుల రూపంలో ఇస్తారు. పిల్లల్లో పొదుపు, ఆర్థిక బాధ్యతలపై అవగాహన కల్పించడం ఈ పథకం ఆశయాలు అని చెప్పవచ్చు. దేశ ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం 2004లో జాతీయ పింఛన్ పథకాన్ని తీసుకొచ్చింది. ప్రజలకు దీర్ఘకాలిక పెట్టుబడి ప్రయోజనాలు, పన్ను ప్రయోజనాలు సైతం కల్పిస్తుండడంతో దీనికి ఆదరణ లభించింది. అందులో భాగంగానే ప్రస్తుతం ఎన్‌పీఎస్ వాత్సల్య పథకాన్ని తీసుకొస్తోంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్ ), సుకన్య సమృద్ధి యోజన, తదితర పథకాల తరహాలోనే దీన్ని తీసుకువచ్చారు.

Prasadam Row: ప్రసాదంలోనూ.. గీ..కుడేనా!?
Ghee: స్వచ్చమైన నెయ్యిని ఎలా గుర్తించాలి? తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వెనుక బయటపడిన నిజాలేంటి?

Updated Date - Sep 21 , 2024 | 05:31 PM