PSUs : పీఎస్‌యూలకు కాయకల్ప చికిత్స
ABN , Publish Date - Jul 13 , 2024 | 05:23 AM
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై మోదీ సర్కారు వెనక్కి తగ్గుతోంది. నష్టాల్లో ఉన్న పీఎ్‌సయూలను అమ్మేయడం లేదా మూసేయడం, లాభాల్లో ఉన్న పీఎ్‌సయూల్లో పెట్టుబడుల ఉపసంహరణ దూకుడుగా చేస్తామని 2021లో మోదీ సర్కార్ గొప్పగా ప్రకటించింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో అది కాస్తా బెడిసి కొట్టింది.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకూ ఫుల్ స్టాప్.. మారిన మోదీ వైఖరి
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై మోదీ సర్కారు వెనక్కి తగ్గుతోంది. నష్టాల్లో ఉన్న పీఎ్‌సయూలను అమ్మేయడం లేదా మూసేయడం, లాభాల్లో ఉన్న పీఎ్‌సయూల్లో పెట్టుబడుల ఉపసంహరణ దూకుడుగా చేస్తామని 2021లో మోదీ సర్కార్ గొప్పగా ప్రకటించింది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో అది కాస్తా బెడిసి కొట్టింది. కీలక సంకీర్ణ భాగస్వామ్య పార్టీలైన టీడీపీ, జేడీయూ ఎడాపెడా పీఎ్‌సయూల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి. దీంతో ఈ సంస్థల ప్రైవేటీకరణకు బదులు వాటి మిగులు భూములు, కీలకేతర ఆస్తులు అమ్మి వాటిని ఆర్థికంగా మరింత పటిష్ఠం చేయాలని మోదీ సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 23న ప్రకటించే కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి సీతారామన్ దీనిపై స్పష్టమైన ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
అది నుంచీ నత్త నడకే
బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ 2014లో అధికారం చేపట్టినప్పటి నుంచీ పీఎ్‌సయూలకు ప్రైవేటీకరణ భయం పట్టుకుంది. గతంలో యూపీఏ సర్కారు హయాంలోనూ కొన్ని సంస్థల ప్రైవేటీకరణ జరిగింది. అయితే అప్పటి సంకీర్ణ పక్షాలు ముఖ్యంగా వామ పక్షాల ఒత్తిడితో మన్మోహన్ సర్కారు ఈ విషయంలో పెద్దగా దూకుడు ప్రదర్శించలేదు. 2014లో బీజేపీకి సంపూర్ణ మెజారిటీ రావడంతో ఇక దేశంలో పీఎ్‌సయూలు ఉండవనే ఆందోళన జోరందుకుంది. కొందరు కేంద్ర మంత్రుల ప్రకటనలు ఈ భయాల్ని మరింత పెంచాయి. అయినా గత పదేళ్లలో 2017-18, 2018-19 ఆర్థిక సంవత్సరాల్లో తప్ప ఏనాడూ పీఎ్‌సయూల పెట్టుబడుల లక్ష్యం ఆశించిన స్థాయిని చేరుకోలేదు. గత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.51,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా నిర్ణయిస్తే రూ.14,564 కోట్ల కు మించి సాధ్యం కాలేదు. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి. గత రెండేళ్లలో ఎయిర్ ఇండియా తప్ప, మరే ప్రధాన పీఎ్‌సయూ ప్రైవేటీకరణ సాధ్యం కాలేదు. ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ కూడా సెంటిమెంట్‌తో టాటా గ్రూపు కొనడం వల్లే సాధ్యపడింది.
రెట్టింపైన మార్కెట్ క్యాప్
గత ఏడాది కాలంలో బీఎ్‌సఈ సెన్సెక్స్ 22 శాతం పెరిగింది. ఇదే సమయంలో బీఎ్‌సఈ పీఎ్‌సయూ సూచీ 100 శాతం పెరిగింది. దీంతో మూడో సారీ బంపర్ మెజారిటీతో గెలిస్తే పెద్ద ఎత్తున పీఎ్‌సయూలను ప్రైవేటీకరించి, ద్రవ్య లోటు మరింత పూడ్చుకోవచ్చని మోదీ సర్కారు భావించింది. అయితే ఓటర్లు అందుకు బ్రేక్ వేయడంతో ఆ ప్రయత్నాలు బెడి సి కొట్టాయి. ఇపుడు పీఎ్‌సయూల ప్రైవేటీకరణకు బదులు, వాటిని మరిత బలోపేతం చేసి, వాటి నుంచి పెద్ద మొత్తంలో డివిడెండ్ ఆదాయం రాబట్టాలనేది మోదీ సర్కారు వ్యూహంగా కనిపిస్తోంది. దీంతో బీపీసీఎల్, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఒక బీమా కంపెనీ ప్రైవేటీకరణ కథ కూడా కంచికి చేరనుంది. పెద్దగా వ్యతిరేకత రాని ఎన్‌ఎండీసీ స్టీల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) ప్రైవేటీకరణ తప్ప, మిగతా పీఎ్‌సయూల ప్రైవేటీకరణ ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
ప్రభుత్వ రంగంలోనే వీఎ్‌సపీ
తాజా రాజకీయ పరిణామాల పుణ్యమాని విశాఖ స్టీలు ప్లాంటు (వీఎ్‌సపీ) ప్రైవేటీకరణ కూడా అటకెక్కినట్టే. ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మనో భావాలతో ముడిపడి ఉన్న ఈ ప్లాంటును ప్రైవేటు పరం చేసే ప్రకస్తే లేదని కేంద్ర ఉక్కు, గనుల శాఖ మంత్రి కుమార స్వామి ఇప్పటికే స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షమైన టీడీపీ ఒత్తిడి ఇందుకు కారణమని వేరే చెప్పనవసరం లేదు. వీఎ్‌సపీని నష్టాల నుంచి బయట పడేసేందుకు వీలైన అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించడం మరో కొసమెరుపు.