Share News

ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు తేజం

ABN , Publish Date - Jun 30 , 2024 | 01:05 AM

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టి పేరు దాదాపుగా ఖరారైంది.

ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు తేజం

చల్లా శ్రీనివాసులు శెట్టి ఎంపిక సిఫారసు చేసిన ఎఫ్‌ఎస్‌ఐబీ ప్రభుత్వ ఆమోదమే తరువాయి

మహబూబ్‌నగర్‌(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా తెలుగు తేజం చల్లా శ్రీనివాసులు శెట్టి పేరు దాదాపుగా ఖరారైంది. ప్రస్తుతం ఎస్‌బీఐ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న శెట్టి బ్యాంకు తదుపరి చైర్మన్‌ కానున్నారు. కేంద్ర కేబినెట్‌ ఆమోదిస్తే ఎస్‌బీఐ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి అవుతారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల సారథులను, డైరెక్టర్లను ఎంపిక చేసే ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ) శనివారం ఇంటర్వ్యూ చేసిన అనంతరం శ్రీనివాసులు శెట్టి పేరును సిఫారసు చేసింది. శెట్టి సహా మరో ఇద్దరు ఎస్‌బీఐ ఎండీలు అశ్విని కుమార్‌ తివారీ, వినయ్‌ ఎం టాన్సేలను కూడా ఎఫ్‌ఎ్‌సఐబీ ఇందుకోసం ఇంటర్వ్యూ చేసింది. అయితే ఎస్‌బీఐలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న శెట్టి పేరును సిఫారసు చేసింది. ఎఫ్‌ఎ్‌సఐబీ ఎంపిక చేసిన పేరును ప్రధాని అధ్యక్షతన జరిగే నియామకాల కేంద్ర కేబినెట్‌ కమిటీ భేటీలో ఆమోదించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆమోదిస్తే ప్రస్తుత చైర్మన్‌ దినేష్‌ ఖారా స్థానంలో శెట్టి ఆగస్టు 28న ఎస్‌బీఐ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.

తెలంగాణ వాడే..

తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా, మానవపాడు మండలంలోని పెద్ద పోతులపాడు శ్రీనివాసులు శెట్టి స్వగ్రామం. ఏడో తరగతి వరకు స్వగ్రామంలోనే ఆయన విద్యాభ్యాసం జరిగింది. ఎనిమిది నుంచి పదో తరగతి, ఇంటర్‌ గద్వాలలో పూర్తి చేశారు. రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేశారు. చిన్న వయసులోనే తండ్రి కిరాణా షాపులో గ్రామస్థులు తీసుకున్న అప్పులు వసూలు చేసేవారు. ఈ అప్పుల వసూళ్ల అనుభవం ఎస్‌బీఐలో మొండి బకాయిల వసూళ్లలోనూ ఉపయోగపడిందని ఆయన చెబుతారు. 1988లో ఎస్‌బీఐలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా చేరిన శెట్టి.. గత మూడున్నర దశాబ్దాల్లో వివిధ హోదాల్లో పని చేశారు. కార్పొరేట్‌ క్రెడిట్‌, రిటైల్‌, డిజిటల్‌ బ్యాంకింగ్‌, రుణాల వసూళ్లు, ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌ రంగాల్లో ఆయనకు అపార అనుభవం ఉంది. శెట్టి ప్రస్తుతం ఎస్‌బీఐ ఎండీగా ఇంటర్నేషనల్‌ బ్యాంకింగ్‌, గ్లోబల్‌ మార్కెట్స్‌, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఎస్‌బీఐ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎస్‌బీఐ ఫౌండేషన్‌ ద్వారా స్వగ్రామం పెద్ద పోతులపాడు, దాని చుట్టుపక్కల గ్రామాల్లో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలోని పాఠశాల, అంగన్‌వాడీకి రూ.40 లక్షల విలువ చేసే సామాగ్రిని అందజేయగా.. అంతక్రితం ఊరూరా తిరిగి రోగులకు ఔషధాలు అందించే ఎస్‌బీఐ సంజీవని వాహనాన్ని డొనేట్‌ చేశారు. శ్రీనివాసులు శెట్టికి ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు కెనడాలో, మరొకరు ముంబైలో స్థిరపడ్డారు.

Updated Date - Jun 30 , 2024 | 01:05 AM