వజ్రానికి పసిడి పోటు!
ABN , Publish Date - Apr 21 , 2024 | 04:25 AM
ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగిన పసడి ధర వజ్రాభరణాల డిమాండ్కూ గండికొట్టిందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. కొనుగోలుదారులపై భారం పెరగకుండా ఉండటంతో పాటు విక్రయాల పునరుద్ధరణ కోసం నగల వర్తకులు వజ్రాభరణాల తయారీకి ఉపయోగించే బంగారం స్వచ్ఛతను తగ్గిస్తున్నట్లు తెలిసింది. 22, 18
వజ్రాభరణాలపైనా బంగారం ధరల పెరుగుదల ప్రభావం
15 శాతం వరకు తగ్గిన డైమండ్ జువెలరీ విక్రయాలు
అమ్మకాలు పెంచుకునేందుకు వర్తకుల కొత్త ప్రయత్నాలు
18 క్యారెట్లకు బదులు 14 క్యారెట్ల ఉత్పత్తులపై దృష్టి
ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరిగిన పసడి ధర వజ్రాభరణాల డిమాండ్కూ గండికొట్టిందని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. కొనుగోలుదారులపై భారం పెరగకుండా ఉండటంతో పాటు విక్రయాల పునరుద్ధరణ కోసం నగల వర్తకులు వజ్రాభరణాల తయారీకి ఉపయోగించే బంగారం స్వచ్ఛతను తగ్గిస్తున్నట్లు తెలిసింది. 22, 18 క్యారెట్లకు బదులు 14 క్యారెట్ల బంగారంతో చేసిన డైమండ్ జువెలరీని అందుబాటులోకి తేవడంపై ఆభరణ వర్తకులు దృష్టిసారించారు. అంతేకాదు, బంగారం నగల కొనుగోలుకు వచ్చిన వారిలోనూ చాలా మంది ఇప్పుడు 22 క్యారెట్లకు బదులు 18 క్యారెట్ల మోడళ్ల కోసం వాకబు చేస్తున్నారు. వేగంగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు డైమండ్ నగల గిరాకీపైనా ప్రభావం చూపాయని జెమ్ అండ్ జువెలరీ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ (జీజేఈపీసీ) వైస్ చైర్మన్ కిరీట్ బన్సాలీ అన్నారు ఈ ఫిబ్రవరి వరకు వృద్ధి పథంలో పయనించిన వజ్రాభరణాల డిమాండ్.. గోల్డ్ రేట్ల పెరుగుదలతో గడిచిన ఒకటిన్నర నెలలో 15 శాతం వరకు తగ్గిందన్నారు.
దాంతో కల్యాణ్ జువెలర్స్, మలబార్ వంటి ప్రముఖ రిటైల్ ఆభరణ విక్రయ కంపెనీలు 14 క్యారెట్ల బంగారంతో కూడిన డైమండ్ జువెలరీతో పాటు 18 క్యారెట్ల స్వర్ణాభరణాల ఉత్పత్తులను అధికంగా అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిసింది. ‘‘బంగారం ధరల అనూహ్య పెరుగుదలతో కొనుగోలుదారుల వైఖరిలోనూ గణనీయ మార్పులొచ్చాయి. వారిప్పుడు పసిడిని పెట్టుబడి సాధనంగా.. అధిక ధరల కాలంలో తమ ఆదా సొమ్ము విలువను పెంచే మార్గంగా చూస్తున్నార’’ని మలబార్ గ్రూప్ చైర్మన్ ఎంపీ అహమ్మద్ అన్నారు. 14 క్యారెట్ల బంగారంతో కూడిన వజ్రాభరణానికి డిమాండ్ పెరగడానికి గోల్డ్ రేట్ల పెరుగుదలతో పాటు ఈ స్వచ్ఛత ఆభరణానికి మన్నిక ఎక్కువ కావడం కూడా మరో కారణమని అహమ్మద్ పేర్కొన్నారు. కాబట్టి రోజువారీగా ధరించేందుకూ పనికొస్తుందని అన్నారు.
18 క్యారెట్ల ఆభరణంలో 75 శాతం బంగారం ఉంటుంది. 14 క్యారెట్ల ఆభరణంలో ఈ వాటా 58 శాతం. అంటే, ఈ రెండింటి మధ్య స్వచ్ఛత వ్యత్యాసం 17 శాతం. కాబట్టి, బంగారం రేట్లు భారీగా పెరిగిన నేపథ్యంలోనూ 14 క్యారెట్ బంగారంతో తయారు చేసిన వజ్రాభరణాలను కస్టమర్లకు అందుబాటు ధరల్లో విక్రయించేందుకు వీలుంటుందని డబ్ల్యూహెచ్పీ జువెలర్స్ భాగస్వామి ఆదిత్య పేఠే అన్నారు. మన దేశంలో 22, 18తో పాటు 14 క్యారెట్ల బంగారం ఆభరణాలనూ హాల్మార్కింగ్ చేసుకునే వీలుంటుంది కాబట్టి వీటిని కొనుగోలు చేయడం వల్ల నష్టం ఉండదని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (ఐబీజేఏ) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా తెలిపారు.