అనగనగా ఒక ‘మంచి పుస్తకం’
ABN , Publish Date - Apr 22 , 2024 | 03:49 AM
పిల్లలు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. పిల్లలు సృజనాత్మకంగా ఎదిగితే భవిష్యత్తు కళాత్మక శోభతో అలరారుతుంది. ఉత్కృష్టమైన ఈ పనికి తల్లిదండ్రుల కన్నా, తరగతి గదుల కన్నా పుస్తకాలే ఎక్కువ దోహదపడగలుగు తాయి...
పిల్లలు బాగుంటే ప్రపంచం బాగుంటుంది. పిల్లలు సృజనాత్మకంగా ఎదిగితే భవిష్యత్తు కళాత్మక శోభతో అలరారుతుంది. ఉత్కృష్టమైన ఈ పనికి తల్లిదండ్రుల కన్నా, తరగతి గదుల కన్నా పుస్తకాలే ఎక్కువ దోహదపడగలుగు తాయి. పాఠ్య పుస్తకాల కంటే పఠన గ్రంథాలే ఈ వికాసానికి దారి చూపగలుగుతాయి. ఈ ఎరుకతోనే సరిగ్గా ఇరవయ్యేళ్ల క్రితం ఇదే నెలలో ఏర్పాటైంది ‘మంచి పుస్తకం’. బాల సాహిత్యం కోసమే అంకితమయ్యి ఈ రెండు దశాబ్దాల్లో అయిదు వందల వరకు పుస్తకాలు ప్రచురించింది. లాభాపేక్షకి అతీతంగా పిల్లల బాగే తమ ఆకాంక్షగా నిర్వాహకులు కొసరాజు సురేష్, పి. భాగ్యలక్ష్మి పనిచేస్తున్నారు. ‘మంచి పుస్తకం’ అనేది ఇప్పుడు వారి ఇంటిపేరయ్యింది. వారందించే ప్రచురణలు పిల్లల పాలిట మంచి పుస్తకాల పంటయ్యింది. గురుతరమైన ఈ పనిలో ముఖ్య భూమికగా ఉన్న సురేష్, భాగ్యలక్ష్మిలతో మాటామంతి!
‘మంచి పుస్తకం’ తొలి అడుగుల గురించి చెప్పండి?
సురేష్: ‘బాల సాహితి’ పునాదిగా ‘మంచి పుస్తకం’ ఏర్పడింది. పిల్లల్లో తెలుగు బాగా చదివే సామర్థ్యాన్ని పెంచటం, పుస్తకాలు అంటే ప్రేమ కలిగేలా చెయ్యటం ఈ రెండు సంస్థల ఉద్దేశాలు. 1990లో ‘బాల సాహితి’ ట్రస్ట్‌గా ఏర్పడినప్పుడు, 2002లో ‘మంచి పుస్తకం’ పని మొదలుపెట్టి 2004లో దీనినొక ట్రస్ట్‌గా రిజిస్టర్ చేసినప్పుడు తెలుగులో పిల్లల పుస్తకాలలో కొంత కొరత ఉందనే చెప్పాలి. ఉన్నవాటితో మొదలుపెట్టి, ప్రచురణలు పెంచుకుంటూ, ఎంపిక చేసిన పుస్తకాలు పంపిణీ చేస్తూ పుస్తకాల జాబితాను విస్తరించుకుంటూ ముందుకెళ్లాం. కంటెంట్, నాణ్యత, ధరల రీత్యా మంచి పుస్తకం ప్రత్యేక గుర్తింపు పొందింది.
‘మంచి పుస్తకం’ అనగానే పిల్లల పుస్తకాలకి అడ్డా అన్న గుర్తింపు తెచ్చుకోగలిగారు. ఈ నేపథ్యంలో మీ ఇరవై ఏళ్ల కృషి ఎలా సాగిందో చెప్పండి?
భాగ్యలక్ష్మి: పుస్తకాల ప్రచురణ చేస్తున్నప్పుడు అవి పెద్ద ఫాంటుతో, బొమ్మలతో చైల్డ్ ఫ్రెండ్లీగా ఉండటానికి మంచి పుస్తకం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో బై-లింగ్వల్ పుస్తకాల ప్రచురణ మొదలయ్యింది. సోవియట్ బాల సాహిత్యాన్ని మొదట్లో ఎక్కువగా తిరిగి ప్రచురించింది. అప్పటికే ఉన్న సోవియట్ పిల్లల పుస్తకాల తెలుగు అనువాదాలలో భాషను సరళీకరించి, ఫాంట్ సైజ్ పెంచి ప్రచురించింది. వీటిల్లో కొత్తగా కొన్ని అనువాదాలను మంచి పుస్తకం చేయించింది కూడా.
పిల్లలు చదవటానికి దోహదం చేసేలా చేసిన ప్రయోగాలలో ‘కథాకదంబం’ పేరుతో మంచి పుస్తకం 50 కార్డులను ప్రచురించింది. ఒక్కొక్క కార్డు 4 పేజీలు. చిన్న కథల నుండి మొదలై క్రమేపి కథలు పెద్దవి అవుతాయి. వీటి ఆధారంగా పిల్లలు తెలుగు చదవటం నేర్చుకున్నారని చాలా మంది టీచర్లు, తల్లిదండ్రులు, వాలంటీర్ల ద్వారా ఫీడ్‌బ్యాక్ లభించింది.
పిల్లల పుస్తకాలు అంటే క్రౌన్ సైజులో చిన్నగా ఉంటాయని కొంచెం పెద్ద తరగతి పిల్లల్లో ఓ అభిప్రాయం బలపడిన సంగతి మా గమనికలోకి వచ్చింది. ఆ పుస్తకాలు సైజు పెంచి ఉన్నా ఆకర్షణ కొరవడి వాటిని చదవటానికి సిద్ధంగా లేరని పరిశీలనలో తెలిసింది. ఈ మానసిక అవరోధాన్ని అధిగమించటానికి 1/8 డెమ్మీ సైజులో 16 పేజీల పుస్తకాలను ఇంపైన రీతిలో ‘పుస్తకాలతో స్నేహం’ అన్న సిరీస్‌ని మంచి పుస్తకం ప్రచురించింది. పది పుస్తకాలు ఒక సెట్‌గా మొత్తం 160 పేజీల రీడింగ్ మెటీరియల్ ఇది. ఒక పుస్తకం చదవగానే పిల్లల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ‘0’ లెవల్ నుంచి 5వ లెవల్ వరకు ఇప్పటివరకు 10 సెట్లలో 85 పుస్తకాలను ఈ సీరీస్‌లో మంచి పుస్తకం ప్రచురించింది. చదవటంలో పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారో వీటి ద్వారా తెలుసుకుని అక్కడినుంచి ముందుకి వెళ్లడానికి ఇవి ఎంతో ఉపయోగపడుతున్నాయి.
పిల్లల మానసిక వికాసానికి సాహిత్యం ఎలా దోహదపడుతుంది?
సురేష్: పుస్తకాలు చదవటం ద్వారా ఆలోచనా శక్తి, సృజనాత్మకత, భావ ప్రకటన వంటి ప్రయోజనాలు ఉంటాయని అనేకమంది చెపుతుంటారు. ఇందులో అనుమానం కూడా లేదు. కానీ, పిల్లలకు పుస్తకాలు అందుబాటులో ఉంచాలన్న ఆలోచన తప్పించి ఇతర ఏ ఉద్దేశాలు పెద్దవాళ్లకు ఉండకూడదు. పుస్తకాల నుంచి ఏం ఎంచుకుంటారో, ఏం నేర్చుకుంటారో పిల్లలకే వదిలెయ్యాలి. అది వాళ్ల వ్యక్తిగత పురోగతి.
ఏది బాల సాహిత్యం అని చెప్పడానికి నిర్దిష్ట ప్రమాణం ఏంటి?
భాగ్యలక్ష్మి: బాలలు అంటే 0-16 సంవత్సరాల వరకు ఉంటారు. వీళ్లు వివిధ ఆర్థిక, సామాజిక వర్గాలకు చెందిన వాళ్లు. వయస్సును బట్టి బొమ్మల సంఖ్య, ఫాంట్ సైజ్‌లలో తేడాలు ఉంటాయి. ఇక కంటెంట్ విషయానికి వస్తే వైవిధ్యానికి అంతు ఉండదు. తల్లిదండ్రుల మధ్య ఘర్షణ ఉండే కుటుంబ నేపథ్యం, ఆడపిల్లల వేధింపులతో మొదలుకుని మురికివాడల పిల్లల బొమ్మల కథల వరకు అన్నీ పిల్లల పుస్తకాలే. ఏ పుస్తకం ఎవరికి, ఎందుకు నచ్చుతుందో, ఎలా ప్రభావితం చేస్తుందో మనకి తెలియదని మంచి పుస్తకం బలంగా నమ్ముతుంది. సాధ్యమైనన్ని పుస్తకాలు పిల్లలకు అందుబాటులో ఉంచటమే మన పని.
ఈ ఇరవయ్యేళ్ల ప్రచురణల పర్వంలో మీకు ఎదురైన పెద్ద సవాళ్లు ఏమైనా ఉన్నాయా?
సురేష్: తెలుగులో చక్కటి మూల కథలు, నవలలు లేని కారణంగా అనువాదాలపై మొదట్లో ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. తానా సంస్థతో కలిసి రచనలను ఆహ్వానించి, ఎంపిక చేసిన వాటిని ప్రచురించటం ద్వారా దీనిని అధిగమించగలిగాం. మంచి పుస్తకం ప్రచురించిన 114 మూల రచనలలో 49 తానాతో చేసినవి!
మరొక పెద్ద సమస్య బొమ్మలు వేయించటం. మాకు బాగా చనువు ఉన్న శ్రీకాంత్ నాల్గింట మూడు వంతుల బొమ్మలు వేశాడంటే అతిశయోక్తి కాదు. అలాగే పావని, రాహక్ మాకు సన్నిహితమైన ఆర్టిస్టులు. చైతన్య పైరపు (కోవిడ్ కాలంలో చాలా చిన్న వయస్సులోనే చనిపోయాడు), తుంబలి శివాజిలు పరిచయం అయిన తరవాత బొమ్మలు వేయించటంలో వెసులుబాటు అయ్యింది. తాన సంస్థతో కలిసి ప్రచురించిన బొమ్మల కథల పుస్తకాలు, నవలలకి కొంతమంది కొత్త ఆర్టిస్టులతో బొమ్మలు వేయించాం.
తెలుగులో బాల సాహిత్యానికి ఆదరణ ఎలా ఉంది?
భాగ్యలక్ష్మి: కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు తెలుగు పుస్తకాలు చదవాలని అనుకుంటున్నారు. మరి కొందరేమో తెలుగు వద్దని అనుకుంటున్నారు. అంతే కాకుండా ప్రయివేటు స్కూళ్లల్లో తెలుగులో మాట్లాడకూడదన్న నిబంధనలు, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం మొదలుపెట్టడం... ఇన్ని గందరగోళాల మధ్య కొట్టుమిట్టాడుతోంది తెలుగు బాల సాహిత్యం. ఇంతటి క్లిష్ట పరిస్థితులలోనూ మునుపటి కంటే ఇప్పుడు పిల్లల పుస్తకాల ఆదరణ బాగానే ఉందని చెప్పాలి.
ఇక తెలుగునాట వెలువడుతున్న బాల సాహిత్యం విషయానికి వస్తే సమకాలీన అంశాలతో కథలు చాలా తక్కువగా వస్తున్నాయి. కౌమార వయస్సు బాలల (యంగ్ అడల్ట్స్) కోసం పుస్తకాల అవసరం కూడా ఉంది. ‘బాల్యం కథలు’ చాలా మంది రాశారు. అలాగే పిల్లల కోసం కూడా రాస్తే బాగుంటుంది. పెద్దవాళ్ల కోసం రాసే వాళ్లు పిల్లల కోసం రాస్తే బాగుంటుంది. వాస్తవ జీవితాలు, అనుభవాల ఆధారంగా కథలు రాసే ఒరవడి ఏర్పడాలి.
నేటి తరం పిల్లల సైకాలజీ ఎలా ఉంటోంది? బాల సాహిత్యంతో వారికి స్నేహం కుదురుతోందా అసలు?
భాగ్యలక్ష్మి: ఇంగ్లీషులో తోటివాళ్లు చదువుతున్న దాన్ని బట్టి పెద్ద పెద్ద పుస్తకాలు, పుస్తకాల సీరీస్‌లు పిల్లలు చదువుతున్నారు. తెలుగులో చదువుతున్న పిల్లలకు చుట్టుపక్కల అంతగా పుస్తకాల వాతావరణం, చదివే సంప్రదాయం కనపడటం లేదు. కాబట్టి బాల సాహిత్యంతో అంతగా స్నేహం కుదరటం లేదనే చెప్పాలి.
పాఠ్య ప్రణాళికల్లో సాహిత్యాంశానికి ఎంత శాతం ప్రాధాన్యం ఉండాలి? ఆ మేరకు మన దగ్గర చోటు కల్పిస్తున్నారా లేదా?
సురేష్: పాఠ్య ప్రణాళికలలో ఏది చేరినా దానిని పరీక్షలు, మార్కుల దృష్టి నుంచే ఎక్కువగా చూస్తారు. తప్పనిసరిగా చదవాల్సిన దానికీ, ఇష్టంతో చదివే దానికీ మధ్య చాలా తేడా ఉంటుంది. పాఠ్యపుస్తకాలలోని కవితలు, కథలతో ప్రభావితం కావాలంటే వాటిని ఎంతో ఇష్టంగా చెప్పే టీచర్లు ఉండాలి. అలాంటి టీచర్లు తక్కువ, దీనివల్ల సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడే పిల్లలు ఇంకా తక్కువ.
డిజిటల్ యుగంలో.. అందునా కరోనా తర్వాత ఆన్‌లైన్ క్లాసుల కల్చర్ పెరిగింది. చిన్నారులు కూడా ఎలక్ర్టానిక్ గాడ్జెట్స్ వాడకానికి అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి సాహిత్య ప్రయోగాలు అవసరమని భావిస్తున్నారు?
భాగ్యలక్ష్మి: అన్నం తినటం లేదనో, విసిగిస్తున్నారనో యూట్యూబ్ చూపించే వాళ్లు ఉన్నారు. పెద్దవాళ్లు కూడా చాలా ఎక్కువగా సెల్ ఫోన్, యూట్యూబ్, టీవీ, కంప్యూటర్, సోషల్ మీడియాలలో గడుపుతున్నారు. వెరసి పెద్దవాళ్ల స్ర్కీన్ టైమ్ చాలా పెరిగింది. అదే పిల్లలకి కూడా అలవాటైతే నేరం మొత్తం వాళ్ల మీద మోపుతున్నాం.
చిన్న పిల్లలకి యూట్యూబ్ ఆడియో రైమ్స్, యానిమేటెడ్ కథలు, ఆడియో బుక్స్‌ని మంచి పుస్తకం ప్రోత్సహించటం లేదు. చేతిలో పుస్తకం పట్టుకోవటం కనీసం ఒక వయస్సు వరకైనా తప్పనిసరి అని మంచి పుస్తకం గాఢంగా నమ్ముతోంది. పిల్లలు చదవగలగటానికి పుస్తకాలే సరైన మాధ్యమం. డిజిటల్ మీడియా వేగంగా చొచ్చుకుని పోతున్న సమయంలో పుస్తకాన్ని, చదవటాన్ని బలంగా ముందుకు తీసుకుని వెళ్లాలంటే ప్రచురణకర్తల తోపాటు పుస్తకాలను పిల్లలకు దగ్గర చెయ్యటానికి తల్లిదండ్రుల, ఉపాధ్యాయులు, పెద్దవాళ్లు భాగస్వాములు కావాలి.
ఏఏ వయసు పిల్లలకి ఎలాంటి పుస్తకాలు ఇస్తే వారిలో పఠనాసక్తి పెరుగుతుంది?
సురేష్: చిన్న పిల్లలకు బొమ్మల కథల పుస్తకాలు, గొలుసు కట్టు కథలు (ఉదా: పేరు మరిచిన ఈగ, చిలక ముక్కు ఊడిపోయింది) బాగుంటాయి. పెద్దవాళ్ల కోసం రాసేటప్పుడు ఎటువంటి కథా లక్షణాలు ఉండాలో పిల్లల కథలలో కూడా అవే ఉండాలి. ముందు ముందు ఏం జరుగుతుందో అన్న ఉత్సుకతను కథ కలిగించాలి, ఒక సమస్య ఉండి దానికి పరిష్కారం ఉండాలి, క్లైమాక్స్ లేదా ముగింపు ఆశ్చర్యం కలిగించేలా ఉండాలి. మొత్తంమీద పెద్ద సంఖ్యలో మంచి పుస్తకాలు, సమాజంలో చదివే వాతావరణం ఉంటే పిల్లల్లో కూడా పఠనాసక్తి పెరిగే అవకాశం ఉంది.
ఈ ప్రయాణంలో పరిపరి తలుచుకునే ఇష్టం సందర్భాల గురించి చెప్పండి?
భాగ్యలక్ష్మి: విభవసు అని ఒక అబ్బాయి చిన్నప్పటి నుంటి హెచ్‌బిఎఫ్‌లో మా స్టాలులో కూర్చుని సైన్స్ పుస్తకాలు చదువుకునేవాడు. తెలుగులో చదవటం వల్ల కాన్సెప్ట్స్ చాలా వరకు అర్థం అయ్యాయని, తోటి విద్యార్థులకు అనుమానాలు ఉంటే వివరించగలిగేవాడినని, తద్వారా ఎంతో నేర్చుకున్నానని విభవసు చెప్పాడు. ఆ కారణంగానే యాస్ర్టో ఫిజిక్స్‌లో ఆసక్తి ఏర్పడిందనీ చెప్పాడు. ఎంతో సంతోషం కదా!
హైదరాబాదు పుస్తక ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఆఫీసు మూసివేస్తాం. ఆ సమయంలో నల్లగండ్లలోని తల్లిదండ్రుల దగ్గరకు అమెరికా నుండి వచ్చిన ఒక తల్లి తన కొడుకుతో ఆఫీసుకు వచ్చింది. ఆఫీసు మూసి ఉండటంతో అంతటి ఎండలో బుక్ ఫెయిర్‌కి వాళ్లు వచ్చారు. అక్కడికి రాగానే తనకి పరిచయం ఉన్న ‘కోటయ్య కట్టిన ఇల్లు’ కనపడటంతో దానిని తీసుకుని ఆ బాబు కింద కూర్చుని దాంట్లో మునిగిపోయారు. పెద్దవాళ్లు కూడా పిల్లలతో సమానంగా పుస్తకాలు చూసి ఆనందపడుతుంటే అవే మాకు ఆనంద క్షణాలు.
బాల సాహిత్య వృద్ధికి వచ్చే రోజుల్లో మీరెలాంటి కృషి చేయాలని భావిస్తున్నారు?
భాగ్యలక్ష్మి: నేల విడిచి సాము చెయ్యకుండా ఇప్పుడు చేస్తున్న పనిని ఇంకా బాగా చెయ్యాలి. మూల రచనలను ప్రోత్సహిస్తూనే అనువాదం కోసం మంచి పుస్తకాలను ఎంపిక చేసి తెలుగులోకి తీసుకుని రావాలి. ఆలోచనలు పుట్టి, కొంత పని జరిగి ప్రచురణ వరకు రాని పుస్తకాలు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి. మళ్లీ కొత్త శక్తినీ, స్ఫూర్తినీ తెచ్చుకుని వాటిని వెలుగులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం.
ఇంటర్వ్యూ : ఒమ్మి రమేష్ బాబు