Arvind Kejriwal : కేజ్రీవాల్
ABN , Publish Date - Dec 21 , 2024 | 03:03 AM
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ గురించి కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమవుతున్నదనీ, ఎన్నికల షెడ్యూల్ నిర్ణయించుకోవడం కూడా వెనువెంటనే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఎలాగూ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ గురించి కేంద్ర ఎన్నికల సంఘం సమావేశమవుతున్నదనీ, ఎన్నికల షెడ్యూల్ నిర్ణయించుకోవడం కూడా వెనువెంటనే జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. ఎలాగూ ఫిబ్రవరిలోగా ఎన్నికలు జరుగుతాయి కనుక, పార్టీలన్నీ ఎంతో ముందుగానే యుద్ధం మొదలెట్టాయి. ఢిల్లీ పీఠాన్ని ఈ మారైనా వశం చేసుకోవాలని పట్టుదలతో ఉన్న భారతీయ జనతాపార్టీ 17మంది సీనియర్ నాయకులతో ఎన్నికల కమిటీని ప్రకటించింది. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడి నేతృత్వంలో, ఢిల్లీనుంచి ఎన్నికైన ఏడుగురు బీజేపీ ఎంపీలతోపాటు కొందరు పార్టీ పెద్దలు కూడా ఈ జాబితాలో ఉన్నారు. డెబ్బైస్థానాలున్న అసెంబ్లీకి పార్టీ తరఫునుంచి పోటీపడబోతున్న అభ్యర్థుల జాబితాలకు అధిష్ఠానం మెరుగులు దిద్దుతోందని, ఈ ఏడాది చివరివారంలో అవి వెలుగుచూస్తాయని అంటున్నారు. రెండు పర్యాయాలు ఢిల్లీని గెలుచుకొని, ముచ్చటగా మూడోమారు అధికారంలో కొనసాగడానికి ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీపార్టీ నాలుగురోజుల క్రితం నాలుగో జాబితాతో అభ్యర్థుల పేర్లన్నీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ ఎవరిని నిలబెట్టినా, ప్రజలు ఈ మారు తమనే అధికారంలో కూచోబెడతారని బీజేపీ నమ్మకం. ఆఖరు నిముషంలో అభ్యర్థుల పేర్లుమార్చే కుట్రకు కేజ్రీవాల్ పాల్పడవచ్చునన్న అనుమానం కూడా ఉన్నందున అభ్యర్థుల ఖరారు విషయంలో బీజేపీ కాస్తంత జాగ్రత్త పడుతోంది.
అభ్యర్థుల జాబితాల విడుదలలో ఆప్ మాంచి దూకుడుగా వ్యవహరించింది. అయితే, ఈ నాలుగువిడతల జాబితాల్లో పదహారుమంది సిట్టింగులకు సీట్లు పోయాయి. పదకొండుమందితో కూడిన తొలిజాబితాలోనే ముగ్గురు బీజేపీ నుంచి, మరో ముగ్గురు కాంగ్రెస్ నుంచి వచ్చినవారున్నారు. రెండోజాబితాలో చాలా కొత్తమొఖాలు చేరాయి. ఒకపక్క, బీజేపీ, కాంగ్రెస్‌ల నుంచి నాలుగురోజుల క్రితం వచ్చినవారిని కూడా జాబితాల్లో చేర్చేస్తూ మరోపక్క తమది ఉన్నతమైన, భిన్నమైన పార్టీ అని కేజ్రీవాల్ ఎలా చెప్పుకోగలరని విమర్శకుల ప్రశ్న. డెబ్బయ్‌మందిలో ఓ పదిమంది బయటనుంచి వచ్చినవారు ఉన్నంతమాత్రాన విలువలు కోల్పోయినట్టేనా అని ఆప్‌నాయకులు ప్రశ్నిస్తున్నారు. అన్నా హజారే ఉద్యమంనుంచి పుట్టినందువల్ల కాబోలు, కేజ్రీవాల్ పార్టీకి అప్పట్లో ఏవో విలువలుండేవనీ, ఇప్పుడవి తరిగిపోతున్నాయని కొందరికి బాధ. ఆప్ ఈ మారు తీవ్ర గందరగోళంలో ఉన్నదన్న విమర్శలు అటుంచితే, ఈ మారు అధికారం అంత సులభం కాదన్న అనుమానం దానికి బాగా ఉన్నట్టు కనిపిస్తోంది.
ఆర్నెల్ల క్రితం ఒక్కటిగా కనిపించిన ఇండియాబ్లాక్ ఇప్పుడంత సంఘటితంగా లేదన్న విషయం తెలిసిందే. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ వేరుపడటమే కాక, పరస్పరం కలయబడుతున్నాయి. కేజ్రీవాల్ పోటీచేస్తున్న న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంనుంచి షీలాదీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్‌ను కాంగ్రెస్ పార్టీ నిలబెడుతోంది. కాంగ్రెస్‌తో పొత్తులేదని కేజ్రీవాల్ తేల్చేయడంతో ఆ పార్టీ మీద ఆప్ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. గత పదేళ్ళు ఎవరి సాయం అక్కరలేకుండా, సొంతబలంతో చక్కగా రెండువిడతలు పాలించుకున్నాక, ఈ మారు మాత్రం పొత్తులెందుకని కేజ్రీవాల్ అనుకొని ఉంటారు. పైగా, ఆర్నెల్లనాటి సార్వత్రక ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకున్నందువల్ల ఆప్‌కు దక్కిన ప్రయోజనమేమీ లేకపోయింది. దేశరాజధానిలో ఉన్న ఏడు లోక్‌సభ స్థానాలనూ యాభైఐదుశాతం ఓట్లతో బీజేపీ ఎగరేసుకుపోయింది. ఈ నేపథ్యంలో ఈ మారు కాంగ్రెస్‌తో చెలిమి తనకు అపకారమే తప్ప ఉపకారం కాదని ఆప్ అనుకొని ఉంటుంది. పైగా, బీజేపీ మతరాజకీయాలపట్ల మెతకగా ఉంటున్న ఆప్‌కు కాంగ్రెస్‌తో ప్రత్యక్షపొత్తు కొన్ని స్థానాల్లో నష్టం చేయవచ్చు. హిందూ ఓటర్ల మనసు గెలుచుకొనే రీతిలో ఆప్ అతిజాగ్రత్తగా వ్యవహరిస్తూ కష్టపడి కూడబెట్టుకున్న ఓటు బ్యాంకును కాంగ్రెస్‌తో పొత్తు కారణంగా బీజేపీకి కోల్పోయే ప్రమాదం ఉన్నది. పైగా, ఆప్–కాంగ్రెస్ మధ్య ఎప్పుడూ దూరమే తప్ప సయోధ్య అరుదు. ఢిల్లీలో తనకు ఇంకాబలం ఉన్నదని నమ్ముతున్న కాంగ్రెస్ కూడా పొత్తులేకపోవడమే మంచిదని అనుకుంటోంది. సార్వత్రక ఎన్నికల్లో అద్భుతాలు చేసి, అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలబడుతున్న చరిత్రగల బీజేపీ మాత్రం ఈ మారు లిక్కర్ కేసు, కేజ్రీవాల్ అరెస్టు ఇత్యాది పరిణామాలతో ఆప్ పూర్తిగా ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందనీ, ఢిల్లీని వశం చేసుకోవడం ఖాయమని నమ్ముతోంది.