Share News

Lok Sabha Elections: తెలుగు మహిళకు భారీ షాక్.. చివరి క్షణంలో అభ్యర్థి మార్పు.. కారణం అదేనా..?

ABN , Publish Date - May 07 , 2024 | 09:47 AM

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు కావడంతో భారతీయ పౌరసత్వం ఉన్న వ్యక్తి దేశంలో ఏ లోక్‌సభ స్థానంలో అయినా పోటీ చేయవచ్చు. మరోవైపు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి స్థిరపడిన వ్యక్తులు అక్కడి రాజకీయాల్లో రాణిస్తున్నవారెందరో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఇతర రాష్ట్రాల్లో రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే ఎక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ పార్లమెంట్ నియోజకవర్గం అందరిదృష్టిని ఆకర్షించింది.

Lok Sabha Elections: తెలుగు మహిళకు భారీ షాక్.. చివరి క్షణంలో అభ్యర్థి మార్పు.. కారణం అదేనా..?

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలు కావడంతో భారతీయ పౌరసత్వం ఉన్న వ్యక్తి దేశంలో ఏ లోక్‌సభ స్థానంలో అయినా పోటీ చేయవచ్చు. మరోవైపు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి స్థిరపడిన వ్యక్తులు అక్కడి రాజకీయాల్లో రాణిస్తున్నవారెందరో ఉన్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఇతర రాష్ట్రాల్లో రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోనే ఎక్కువ లోక్‌సభ స్థానాలు కలిగిన ఉత్తరప్రదేశ్‌లోని జాన్‌పూర్‌ పార్లమెంట్ నియోజకవర్గం అందరిదృష్టిని ఆకర్షించింది. దానికి కారణం ఓ తెలుగు మహిళ ఇక్కడి నుంచి ఓ ప్రధాన పార్టీ అభ్యర్థిగా పోటీలో ఉండటమే. అయితే చివరి క్షణంలో తెలుగు మహిళ శ్రీకళా రెడ్డికి షాక్ తగిలింది.


లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్ నుంచి బరిలో ఉందనుకున్న ఏకైక తెలుగు మహిళ శ్రీకళా రెడ్డి నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీకి ముందు రోజు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి షాక్ ఇచ్చారు. ఈ నియోజకవర్గం నుంచి అభ్యర్థిని మారుస్తున్నట్లు ప్రకటించారు. నాలుగు రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేసిన శ్రీకళా రెడ్డికి బీ-ఫాం ఇవ్వకుండా శ్యామ్ సింగ్ యాదవ్‌కు బీఎస్పీ బీ-ఫాం అందజేసింది. శ్యాం సింగ్ యాదవ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో బీజేపీ గాలిని ఎదుర్కొని గెలుపొందారు. ఈక్రమంలో సిట్టింగ్ ఎంపీని కాదని, జౌన్‌పూర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా ఉన్న శ్రీకళా రెడ్డిని మాయావతి అభ్యర్థిగా ప్రకటించారు. ఆమె 4 రోజుల క్రితమే నామినేషన్ దాఖలు చేశారు. ఈలోపు ఏమైందో కానీ అభ్యర్థిని మారుస్తూ బీఎస్పీ అధినేత్రి నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎంపీకే సీటు ఇవ్వాలని డిసైడ్ కావడంతో శ్రీకళా రెడ్డికి షాక్ తగిలింది. ఈ నిర్ణయం ప్రస్తుతం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. జాన్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా సీనియర్ నేత కృపాశంకర్ సింగ్ పోటీచేస్తుండగా.. ఇండియా కూటమి తరపున సమాజ్‌వాదీ అభ్యర్థి బాబు సింగ్ కుష్వాహ పోటీ చేస్తున్నారు. శ్రీకళారెడ్డిని ఎందుకు తప్పించారనేదానికి బీఎస్పీ ఎలాంటి కారణాలు వెల్లడించలేదు.

PM Narendra Modi: దోచుకున్న డబ్బుల్ని మోదీ రికవరీ చేస్తున్నారు


శ్రీకళా రెడ్డి ఎవరు..

తెలంగాణకు చెందిన శ్రీకళా రెడ్డి రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆమె తండ్రి జితేంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే. శ్రీకళ తల్లి లలిత గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. ఈ కుటుంబం నిప్పో గ్రూపు పేరుతో బ్యాటరీలు సహా వివిధ అనుబంధ వస్తువులు తయారు చేసే వ్యాపారం చేస్తున్నారు. వారి కుమార్తె శ్రీకళా రెడ్డి ఐదేళ్ల క్రితం తెలంగాణలోనే బీజేపీలో చేరారు. ఆ తర్వాత యూపీలో గ్యాంగ్‌స్టర్-రాజకీయవేత్త ధనుంజయ్ సింగ్‌ను పెళ్లాడిన శ్రీకళా రెడ్డి, అత్తింటికి మకాం మార్చారు. ధనుంజయ్ సింగ్ మొదటి భార్య మీనూ సింగ్ 2006లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. 2009లో జాగృతి సింగ్‌ను చేసుకున్నారు. ఆమెతో 2017లో విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది ప్యారిస్‌లో శ్రీకళా రెడ్డిని వివాహం చేసుకున్నారు. ధనుంజయ్ సింగ్ యూపీ రాజకీయాల్లో ప్రభావవంతమైన నేతగా ఉన్నారు. అందుకే తన సతీమణి శ్రీకళ రెడ్డిని స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించి గెలుపించుకున్నాక, జౌన్‌పూల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌ చేశారు.


చివరి క్షణంలో చేజారిన టికెట్

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ తరపున ఎంపీ టికెట్ వచ్చినప్పటికీ బీఎస్పీ అధినేత్రి మాయవతి తీసుకున్న నిర్ణయంతో పోటీచేయలేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని ధనుంజయ్ సింగ్ మద్దతుదారులు ఒత్తిడి చేశారు. అయినప్పటికీ శ్రీకళారెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలో ఉండటానికి ఇష్టపడలేదు. తాను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గానే కొనసాగుతానని తెలిపారు. ఎవరి ఒత్తిడితో తనను మార్చారో తెలియదని అంటూనే బీజేపీ ఒత్తిడితోనే తనను తప్పించి ఉండవచ్చని శ్రీకళారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.


Jharkhand: పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 10:18 AM