Share News

Monkey pox: హై అలర్ట్.. పాక్, స్వీడన్‌లోకి మహమ్మారి ఎంట్రీ

ABN , Publish Date - Aug 16 , 2024 | 04:42 PM

ఆఫ్రికన్ దేశాల్లో మంకీ పాక్స్(Monkey pox) కలకలం రేపుతున్న వేళ.. తాజాగా ఈ వైరస్ మరో రెండు దేశాల్లోకి ప్రవేశించింది. దాయాది పాకిస్థాన్ సహా.. స్వీడన్‌ దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు.

Monkey pox: హై అలర్ట్.. పాక్, స్వీడన్‌లోకి మహమ్మారి ఎంట్రీ

ఇంటర్నెట్ డెస్క్: ఆఫ్రికన్ దేశాల్లో మంకీ పాక్స్(Monkey pox) కలకలం రేపుతున్న వేళ.. తాజాగా ఈ వైరస్ మరో రెండు దేశాల్లోకి ప్రవేశించింది. దాయాది పాకిస్థాన్ సహా.. స్వీడన్‌ దేశంలో మంకీ పాక్స్ కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు ధ్రువీకరించారు. పాకిస్థాన్‌(Pakistan)లో ముగ్గురికి మంకీ పాక్స్ సోకినట్లుగా పాక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వారంతా ఆగస్టు 3న సౌదీ అరేబియా నుంచి పాక్‌కి వచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు చేయడంతో మంకీ పాక్స్ ఉన్నట్లు, పెషావర్‌లోని ఖైబర్ వైద్య విశ్వవిద్యాలయం నిర్ధారించింది. మంకీ పాక్స్ అంటువ్యాధి కావడంతో బాధితులతో విమానంలో ప్రయాణించిన వారిని, సన్నిహితులను గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

2023లో 11 కేసులు..

పాకిస్థాన్‌లో మంకిపాక్స్ కేసులు నమోదు కావడం ఇది తొలిసారేం కాదు. 2023లో కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో 11 మంది ప్రయాణికులకు మంకీపాక్స్ సోకింది. వారందరికీ చికిత్స అందించారు. అంటువ్యాధి వ్యాప్తి చెందకుండా పటిష్ట క్వారంటైన్ విధించారు. పరిస్థితి విషమించడంతో వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.


స్వీడన్‌లో..

పాక్‌తోపాటు తాజాగా స్వీడన్ స్టాక్‌హోమ్‌లోని ఒక వ్యక్తికి మంకీ పాక్స్ నిర్ధారణ అయింది. ఇది స్వీడన్‌లో నమోదైన తొలికేసని వైద్యాధికారులు తెలిపారు. స్వీడన్ తర్వాత ఐరోపాలో త్వరలో మరిన్ని కేసులు నమోదయ్యే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది.

మంకీపాక్స్ లక్షణాలు

వ్యాధి సోకిన 5 రోజుల మధ్యకాలంలో జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, చేతులు, పాదాల్లో దురద, పొక్కులు సంభవిస్తాయి. జ్వరం వచ్చిన రెండు రోజుల్లో చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయి. దద్దుర్లు ముఖంపై ఎక్కువగా ఉంటాయి. కానీ అరచేతులు, పాదాల అరికాళ్ళపై కూడా కనిపిస్తాయి. ఇది నోటి శ్లేష్మ పొర, కంటి ఇన్ఫెక్షన్లు, కంటి కార్నియా, జననేంద్రియ ప్రాంతాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. వీటితోపాటు.. కళ్లు, నోరు, మల, మూత్రాల విసర్జన ప్రాంతాల్లో పొక్కులు వస్తాయి. నీటి బొడిపెలుగా ప్రారంభమై ఎరుపు, నలుపు రంగులోకి మారతాయి. జబ్బు ఉన్న మనిషికి దగ్గరగా ఉండటం, వాళ్ల వస్తువులను ముట్టుకోవడం వల్ల మంకీపాక్స్ వ్యాపిస్తుంది. ఈ వ్యాధితో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్న పిల్లలు, పెద్దలు ప్రభావితమవుతారు.

Updated Date - Aug 16 , 2024 | 04:45 PM