Share News

శ్వేతసౌధంలో ఖలీస్థానీ మద్దతుదారులు

ABN , Publish Date - Sep 22 , 2024 | 04:00 AM

మోదీ అమెరికాలో అడుగుపెట్టే కొన్ని గంటల ముందే కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ఖలీస్థానీ మద్దతుదారులు, సిక్కు వేర్పాటువాద నాయకులతో కీలక సమావేశం జరిపింది.

శ్వేతసౌధంలో ఖలీస్థానీ మద్దతుదారులు

  • అమెరికా జాతీయ భద్రతామండలి ఆధ్వర్యంలో భేటీ

వాషింగ్టన్‌, సెప్టెంబరు 21: మోదీ అమెరికాలో అడుగుపెట్టే కొన్ని గంటల ముందే కీలక పరిణామం జరిగింది. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ ఖలీస్థానీ మద్దతుదారులు, సిక్కు వేర్పాటువాద నాయకులతో కీలక సమావేశం జరిపింది. అమెరికా జాతీయ భద్రతామండలి ఆధ్వర్యంలో తొలిసారి జరిగిన ఈ సమావేశానికి అమెరికన్‌ సిఖ్‌ కాకస్‌ కమిటీ వ్యవస్థాపకుడు ప్రీత్‌పాల్‌ సింగ్‌తో పాటు సిఖ్‌ అమెరికన్‌ లీగల్‌ డిఫెన్స్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ఫండ్‌ సభ్యులు, పలు సిక్కు సంఘాల నేతలు హాజరయ్యారు. అమెరికా పౌరుల రక్షణకు భరోసానిచ్చింది. అదే సమయంలో అమెరికా గడ్డపై ఇతర దేశాలు తమ పౌరులను లక్ష్యంగా చేసుకోనీయబోమని శ్వేత సౌధం స్పష్టం చేసింది.

సమావేశం తర్వాత ప్రీత్‌పాల్‌ సింగ్‌ మాట్లాడుతూ అమెరికా ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. అమెరికా సిక్కులకు మరింత రక్షణ కల్పించాలని కోరామన్నారు. ఖలీస్థానీ వేర్పాటువాదులకు అమెరికా, కెనడా ఆశ్రయం కల్పిస్తున్నాయని ఆందోళనలు వ్యక్తమవుతున్న తరుణంలో స్వయంగా అధ్యక్ష భవనం సాక్షిగా జరిగిన పరిణామాలు కలకలం రేపుతున్నాయి. కాగా, ఖలీస్థానీ ఉగ్రవాది పన్నూ హత్యాయత్నం కేసులో అమెరికా జిల్లా కోర్ట్‌ భారత ప్రభుత్వానికి, దోభాల్‌కు సమన్లు జారీ చేసిన రోజుల వ్యవధిలోనే వైట్‌హౌస్‌లో ఈ సమావేశం నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - Sep 22 , 2024 | 04:00 AM