Share News

Arrow System: ఇజ్రాయెల్‌ బ్రహ్మాస్త్రం.. ‘యారో’..

ABN , Publish Date - Apr 15 , 2024 | 09:26 AM

Israel Arrow System: పాత పౌరాణిక సినిమాల్లో యుద్ధాలు(War) గుర్తున్నాయా? కర్ణుడు ఆగ్నేయాస్త్రం వేస్తే.. అర్జునుడు సింపుల్‌గా వారుణాస్త్రం వేస్తాడు! రెండు బాణాలూ(Arrow) అర్ధ చంద్రాకారంలో పైకెళ్లి ఒకదాన్నొకటి ఢీకొంటాయి!! కాసేపటికి.. వారుణాస్త్రంలోని నీళ్లు ఆగ్నేయాస్త్రంలోని అగ్గిని ఆర్పేస్తాయి! ఇప్పుడు ఆ సీన్‌లో బాణాలకు బదులు రెండు క్షిపణులను(Missiles) ఊహించుకోండి.

Arrow System: ఇజ్రాయెల్‌ బ్రహ్మాస్త్రం.. ‘యారో’..
Israel Arrow System

Israel Arrow System: పాత పౌరాణిక సినిమాల్లో యుద్ధాలు(War) గుర్తున్నాయా? కర్ణుడు ఆగ్నేయాస్త్రం వేస్తే.. అర్జునుడు సింపుల్‌గా వారుణాస్త్రం వేస్తాడు! రెండు బాణాలూ(Arrow) అర్ధ చంద్రాకారంలో పైకెళ్లి ఒకదాన్నొకటి ఢీకొంటాయి!! కాసేపటికి.. వారుణాస్త్రంలోని నీళ్లు ఆగ్నేయాస్త్రంలోని అగ్గిని ఆర్పేస్తాయి! ఇప్పుడు ఆ సీన్‌లో బాణాలకు బదులు రెండు క్షిపణులను(Missiles) ఊహించుకోండి. డ్రోన్లు, క్రూయిజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడ్డ ఇరాన్‌కు.. ఇజ్రాయెల్‌ ఇదే రీతిలో బదులిచ్చింది. ఇరాన్‌ తనపైకి ప్రయోగించిన క్షిపణులను.. అత్యంత సమర్థవంతమైన తన ‘యారో రక్షణ వ్యవస్థ’ను ఉపయోగించి మధ్యలోనే కూల్చేయగలిగింది. ఏమిటా యారో వ్యవస్థ అనే ప్రశ్నకు సమాధానం తెలియాలంటే.. ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. పుట్టుకతోనే చుట్టూ పుట్టెడు శత్రువులను సంపాదించుకున్న దేశం ఇజ్రాయెల్‌. లెబనాన్‌లోని హెజ్బొల్లా, సిరియా, ఇరాక్‌లోని ఇరాన్‌ అనుకూల ఉగ్రవాద గ్రూపులు, యెమెన్‌లోని హౌతీలు, గాజా స్ట్రిప్‌లోని హమాస్‌ నుంచి ఆ దేశం తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. వేలాది రాకెట్లు, క్షిపణులను కలిగి ఉన్న ఆయా గ్రూపులకుఆర్థిక అండ ఇరాన్‌. ఇలా చుట్టూ వేర్వేరు దూరాల్లో పొంచి ఉన్న ఈ గ్రూపులు, వాటికి మద్దతుగా ఉన్న ఇరాన్‌ చేసే గగనతల దాడుల నుంచి రక్షించుకోవడం కోసం ఇజ్రాయెల్‌ మూడంచెల గగనతల రక్షణ వ్యవస్థను రూపొందించుకున్నది. ఆ దశలు వరుసగా.. ఐరన్‌ డోమ్‌, డేవిడ్స్‌ స్లింగ్‌, యారో–3.


ఐరన్‌ డోమ్‌: ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థల గురించి చెప్పగానే చాలా మందికి గుర్తొచ్చేది ఈ ఐరన్‌ డోమే. 4–70 కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే స్వల్పశ్రేణి రాకెట్లు, ఆర్టిలరీ షెల్స్‌ను దారిలోనే అడ్డుకుని తునాతునకలు చేసేందుకు ఇజ్రాయెల్‌ రూపొందించుకున్న వ్యవస్థ ఇది. ఒక్కమాటలో చెప్పాలంటే.. హమాస్‌ దాడులను నిరోధించడానికి అభివృద్ధి చేసుకున్న వ్యవస్థ. దీంట్లో డిటెక్షన్‌ అండ్‌ రాడార్‌ ట్రాకింగ్‌ వ్యవస్థ, బ్యాటిల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వెపన్‌ కంట్రోల్‌ వ్యవస్థ, మిసైల్‌ ఫైరింగ్‌ యూనిట్‌ ఉంటాయి. ఇవి 24 గంటలూ, అన్ని రకాల వాతావరణాల్లోనూ అప్రమత్తంగా ఉంటాయి. ఈ వ్యవస్థ సక్సెస్‌ రేటు 90 శాతం. తొలుత దీనికి ‘గోల్డెన్‌ డోమ్‌’ అనే పేరు పెడదామనుకున్నారు.


డేవిడ్స్‌ స్లింగ్‌: బైబిల్‌ కథల్లో డేవిడ్‌ అండ్‌ గోలియత్‌ కథలో.. మహాకాయుడైన గోలియత్‌ను సాధారణ గొర్రెల కాపరి అయిన డేవిడ్‌ వడిశెల రాయితో పడగొడతాడు! ఆ కథలో డేవిడ్‌ వాడిన వడిశెల రాయి స్ఫూర్తిగా పెట్టిన పేరు ఇది. 40–300 కిలోమీటర్ల పరిధి నుంచి దూసుకొచ్చే డ్రోన్లు, టాక్టికల్‌ బాలిస్టిక్‌ మిసైళ్లు, మీడియం–టు–లాంగ్‌ రేంజ్‌ రాకెట్లు, క్రూయిజ్‌ మిసైళ్లను స్టన్నర్‌ అనే ఇంటర్‌సెప్టర్‌తో మార్గమధ్యంలోనే అడ్డుకునే వ్యవస్థ ఈ డేవిడ్స్‌ స్లింగ్‌. ఇజ్రాయెల్‌ దీన్ని లెబనాన్‌, సిరియా సరిహద్దుకు సమీపంలో మోహరించింది.


యారో–3: ఇరాన్‌, యెమెన్‌ నుంచి దూసుకొచ్చే లాంగ్‌ రేంజ్‌ క్షిపణులను సమర్థంగా నాశనం చేయడానికి అమెరికాతో కలిసి ఇజ్రాయెల్‌ అభివృద్ధి చేసుకున్న గగనతల రక్షణ వ్యవస్థ ఇది. ప్రపంచంలోనే తొలి యాంటీ–టాక్టికల్‌ బాలిస్టిక్‌ మిసైల్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌గా దీనికి పేరుంది. వెయ్యికి పైగా కిలోమీటర్ల దూరం నుంచి దూసుకొచ్చే బాలిస్టిక్‌ క్షిపణులను భూవాతావరణానికి పైనే ఢీకొట్టే వ్యవస్థ ఇది. తాజాగా ఇరాన్‌ చేసిన దాడిని ఇజ్రాయెల్‌ దీని సాయంతోనే తిప్పికొట్టింది. ఇరాన్‌ ప్రయోగించిన 131 బాలిస్టిక్‌ క్షిపణుల్లో 124 క్షిపణులను, 170 డ్రోన్లను, 30 క్రూయిజ్‌ క్షిపణులను యారో వ్యవస్థ కూల్చేసిందని ఇజ్రాయెల్‌ ఆర్మీ వర్గాలు ప్రకటించాయి. 2023 నవంబరులో.. యెమెన్‌ నుంచి హౌతీలు ప్రయోగించిన బాలిస్టిక్‌ క్షిపణిని ఇజ్రాయెల్‌ ఈ యారో–3 వ్యవస్థ ద్వారానే సమర్థంగా అడ్డుకుంది. కాగా.. దీనికన్నా సమర్థంగా పనిచేసే యారో–4 రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఇజ్రాయెల్‌, అమెరికా కలిసి పనిచేస్తున్నాయి. ఇవికాక, పేట్రియాట్‌ పేరుతో అమెరికా రూపొందించిన రక్షణ వ్యవస్థను కూడా ఇజ్రాయెల్‌ చాలాకాలంగా ఉపయోగిస్తోంది. 1991లో గల్ఫ్‌ యుద్ధం సమయంలో ఇరాక్‌ ప్రయోగించిన స్కడ్‌ మిసైళ్లను అమెరికా ఈ వ్యవస్థ సాయంతోనే కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ పేట్రియాట్‌ వ్యవస్థను ఇప్పుడు ఇజ్రాయెల్‌.. విమానాలను, డ్రోన్లను కూల్చేయడానికి ఉపయోగిస్తోంది. అలాగే, లేజర్‌ టెక్నాలజీ సంబంధిత ముప్పులను ఎదుర్కొనడానికి ఆ దేశం ‘ఐరన్‌ బీమ్‌’ అనే వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 15 , 2024 | 09:26 AM