Share News

PM Modi US Tour: ప్రధాని మోదీని కలుస్తా: డొనాల్డ్ ట్రంప్

ABN , Publish Date - Sep 18 , 2024 | 08:19 AM

మరికొద్ది రోజుల్లో యూఎస్ పర్యటనకు రానున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటి కానున్నట్లు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మిచిగాన్‌లోని ఫ్లింట్ నగరంలో భారత్-అమెరికా సంబంధాలపై ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

PM Modi US Tour: ప్రధాని మోదీని కలుస్తా: డొనాల్డ్ ట్రంప్

మిచిగాన్, సెప్టెంబర్ 18: మరికొద్ది రోజుల్లో యూఎస్ పర్యటనకు రానున్న భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటి కానున్నట్లు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మిచిగాన్‌లోని ఫ్లింట్ నగరంలో భారత్-అమెరికా సంబంధాలపై మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఒక అద్బుతమని ఆయన అభివర్ణించారు. వచ్చే వారం యూఎస్ వస్తున్న ఆయన తనను కలుస్తారని తెలిపారు. అయితే ప్రధాని మోదీతో తాను ఎక్కడ భేటీ అయ్యేది మాత్రం ట్రంప్ వివరించ లేదు.


గుర్తు చేసుకున్న ట్రంప్..

2017 నుంచి 2021 మధ్య తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నానని.. ఆ సమయంలో భారత్, అమెరికా సంబంధాలను డోనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను దేశాధ్యక్షుడిగా ఉన్న హయాంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలు మరింత పటిష్టమయ్యాయన్నారు. మరి ముఖ్యంగా రక్షణ, వ్యూహాత్మక సహకార రంగాల్లో చోటు చేసుకున్న పురోగతిని ట్రంప్ ఈ సందర్భంగా వివరించారు.


హ్యూస్టన్‌లో ‘హౌడీ మోడీ’.. గుజరాత్‌లో ‘నమస్తే ట్రంప్’

ఆ క్రమంలో చైనా ప్రభావాన్ని తగ్గించేందుకు తాము చేసిన ప్రయత్నాలను సైతం వివరించారు. వివిధ సందర్భాల్లో వాణిజ్య వివాదాలు నెలకొన్నప్పటకీ.. క్వాడ్ తరహా కార్యక్రమాల ద్వారా లోతైన భద్రతా సహకారాన్ని పెంపొందించడంలో ఇరు దేశాల మధ్య భాగస్వామ్యం పటిష్టంగా ఉందని ట్రంప్ వెల్లడించారు. అలాగే యూఎస్‌లోని హ్యూస్టన్‌లో భారత ప్రధాని ‘హౌడీ మోడీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తే.. గుజరాత్‌లో ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.


డెమోక్రటిక్ పార్టీ నేతలతో సైతం ప్రధాని..

మరోవైపు డెమోక్రటిక్ పార్టీ నాయకుడు, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు అదే పార్టీకి చెందిన బరాక్ ఒబామాతో సైతం ప్రధాని మోదీ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. గతేడాది అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీకి అమెరికా అధ్యక్ష భవనం ఘన స్వాగతం పలికిన సంగతి తెలిసిందే.


ప్రధాని మోదీ యూఎస్‌లో పర్యటన..

సెప్టంబర్ 21 నుంచి 23 వరకు భారత ప్రధాని అమెరికాలో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనలో భాగంగా డెలావేర్‌లో జరగనున్న క్వాడ్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఆ మరునాడు లాంగ్ ఐలాండ్‌లో నిర్వహించే మోదీ, యూఎస్ ప్రొగ్రస్ టు గెదర్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు భారీగా ప్రవాసీ భారతీయులు దరఖాస్తు చేసుకున్నారని నిర్వాహాకులు తెలిపారు. ఈ యూఎస్ పర్యటనలో భాగంగా పలు కంపెనీల సీఈవోలతో ప్రధాని భేటీ కానున్నారు. అలాగే ఐక్యరాజ్య సమితిలో సైతం ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.


ట్రంప్‌పై రెండు సార్లు హత్యాయత్నం..

ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల బరిలో నిలిచారు. అయితే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ట్రంప్‌పై ఇప్పటి వరకు రెండు సార్లు హత్యాయత్నం జరిగింది. వాటి నుంచి ఆయన తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే.

For More International News and Telugu News

Updated Date - Sep 18 , 2024 | 08:42 AM