Pagers: పేజర్లతో పేలుడు విధ్వంసం.. పేజర్ అంటే ఏంటి, వీటి వాడకం ఎక్కడ
ABN , Publish Date - Sep 18 , 2024 | 07:22 AM
మొబైల్ ఫోన్‌లు వాడుతున్న ప్రస్తుత యుగంలో కూడా ఓ చోట అనేక మంది పేజర్‌లను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో అనేక ప్రాంతాల్లో పేజర్లు అకస్మాత్తుగా పేలిపోయాయి. దీంతో 9 మంది మరణించగా, 2800 మందికిపైగా గాయపడ్డారు. అయితే అసలు వీటిని ఎక్కడ, ఎందుకు వినియోగిస్తారనేది తెలుసుకుందాం.
లెబనాన్(lebanon), సిరియాలో(syria) మంగళవారం జరిగిన పేజర్ల(pagers) పేలుళ్లు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ పేలుళ్లతో ఇప్పటివరకు 9 మంది మృతి చెందగా, 2800 మందికిపైగా గాయపడ్డారు. అయితే మొబైల్ ఫోన్‌లు వాడుతున్న ప్రస్తుత యుగంలో పేజర్‌లను ఎందుకు ఉపయోగిస్తున్నారు. వీటిని ఎవరు వాడతారు, ఎందుకు వినియోగిస్తారనే విషయాలను ఇక్కడ చుద్దాం. మధ్యాహ్నం 3:30 గంటలకు తమ సంస్థ పేజర్లు అకస్మాత్తుగా పేలడం ప్రారంభించాయని హిజ్బుల్లా తెలిపింది. ఇజ్రాయెల్(israel) నిఘాను నివారించడానికి, ట్యాపింగ్ నుంచి తప్పించుకునేందుకు హిజ్బుల్లా ప్రతినిధులు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అసలు పేజర్ అంటే ఏంటి
నిజానికి పేజర్ అనేది చిన్న పోర్టబుల్ ఎలక్ట్రానిక్ పరికరం. దీనిని సంక్షిప్త సందేశాలు లేదా హెచ్చరికలను పంపడం, స్వీకరించడం కోసం ఉపయోగిస్తారు. ఈ పరికరం రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించి సందేశాలను అందుకుంటుంది. వీటిలో కూడా అనేక రకాల పేజర్లు ఉన్నాయి. ఉదాహరణకు సంఖ్య పేజర్లు కేవలం సంఖ్యలను మాత్రమే చూపిస్తాయి.
సందేశాలు
ఆల్ఫాన్యూమరిక్ పేజర్‌లు టెక్స్ట్, నంబర్‌లు రెండింటినీ ప్రదర్శిస్తాయి. తద్వారా సందేశాలు మరింత వివరంగా పంపిస్తారు. ప్రస్తుత రోజుల్లో చాలా తక్కువ మంది మాత్రమే ఈ పేజర్లను ఉపయోగిస్తున్నారు. పేజర్లను లిథియం బ్యాటరీలతో రూపొందిస్తారు. లిథియం బ్యాటరీలు వేడెక్కగల సామర్థ్యాన్ని కల్గి ఉంటాయి. ఇవి వేడి కావడం వల్ల లిథియం బ్యాటరీ కరిగి పేలిపోయి మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది.
వాడకం ఎక్కడ
పేజర్లను ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, అత్యవసర సేవల కోసం కొన్ని చోట్ల ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు పేజర్లను గూఢచార సందేశాలను పంపడానికి కూడా వినియోగిస్తారు. లెబనాన్‌లో పేజర్ పేలుళ్ల ఘటనకు సంబంధించి ఈ పేలుళ్లు భద్రతా చర్య ఫలితంగా ఉండవచ్చని హిజ్బుల్లా అధికారి చెప్పారు. దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని కూడా ఆరోపించారు. అదే సమయంలో ఇజ్రాయెల్ ఈ పేలుడుకు సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు. హిజ్బుల్లా ఆరోపణలను ఖండించలేదు. దీంతో ఈ పేలుడు ఎవరు చేశారు. దీని వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందా, ఇజ్రాయెల్ దీన్ని చేసి ఉంటే హిజ్బుల్లాలో భయాన్ని సృష్టించడానికే ఇదంతా చేసిందా అనేది తేలాల్సి ఉంది.
సైబర్ ఎటాక్
లెబనాన్‌లో జరిగిన పేలుడుకు సంబంధించి హిజ్బుల్లా ఇటీవలే ఆల్ఫాన్యూమరిక్ పేజర్‌లను కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. ఈ పేజర్‌లను తైవాన్‌కు చెందిన గోల్డ్ అపోలో కంపెనీ లిమిటెడ్ తయారు చేసింది. ఆ తర్వాత ఈ కొత్త పేజర్లలో పేలుడు జరిగింది. ఈ ఘటన తర్వాత పేజర్లను ఉపయోగించడం మానేయాలని హిజ్బుల్లా అక్కడి ప్రతినిధులకు తెలిపింది. ఈ పేలుడు వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని కూడా అంటున్నారు. ఇజ్రాయెల్ సైబర్ దాడి చేసి ఈ పేలుళ్లకు కుట్ర పన్నిందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Money Saving Plan: రిటైర్ మెంట్ వరకు రూ. 8 కోట్లు కావాలంటే.. నెలకు ఎంత సేవ్ చేయాలి..
Insurance: ఇకపై సైబర్ స్కాంలకు కూడా ఇన్సూరెన్స్ .. రోజుకు ఎంతంటే..
Read MoreInternational News and Latest Telugu News