Share News

America's Central Investigation Agency : 2వారాలు.. 2వేల పోలీసులు

ABN , Publish Date - Sep 10 , 2024 | 03:54 AM

తనను తాను దైవ కుమారుడిగా, ఈ విశ్వానికి యజమానిగా ప్రకటించుకుని.. లక్షలాది మందిని ఆధ్యాత్మిక మత్తులో ముంచేసి.. చిన్నపిల్లల సెక్స్‌ రాకెటింగ్‌ సహా రకరకాల అరాచకాలకు పాల్పడిన ఫిలిప్సీన్స్‌ పాస్టర్‌ అపోలో క్విబొలోయ్‌ని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసింది!

America's Central Investigation Agency : 2వారాలు.. 2వేల పోలీసులు

  • ఎట్టకేలకు చిక్కిన స్వయంప్రకటిత దైవ కుమారుడు క్విబొలోయ్‌

  • చిన్నపిల్లల సెక్స్‌ట్రాఫికింగ్‌, స్మగ్లింగ్‌ సహా ఫిలిప్పీన్స్‌ పాస్టర్‌పై ఎన్నో కేసులు

మనీలా, సెప్టెంబరు 9: తనను తాను దైవ కుమారుడిగా, ఈ విశ్వానికి యజమానిగా ప్రకటించుకుని.. లక్షలాది మందిని ఆధ్యాత్మిక మత్తులో ముంచేసి.. చిన్నపిల్లల సెక్స్‌ రాకెటింగ్‌ సహా రకరకాల అరాచకాలకు పాల్పడిన ఫిలిప్సీన్స్‌ పాస్టర్‌ అపోలో క్విబొలోయ్‌ని అమెరికా కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్ట్‌ చేసింది!

ఫిలిప్పీన్స్‌తోపాటు అమెరికా దేశాల ‘వాంటెడ్‌’ జాబితాలో ఉన్న ఈ 74 ఏళ్ల పాస్టర్‌ను పట్టుకునేందుకు దాదాపు 2000 మంది పోలీసులు.. కింగ్‌డమ్‌ ఆఫ్‌ జీసస్‌ క్రైస్ట్‌ (కేవోజేసీ) పేరిట అతడు ఏర్పాటుచేసుకున్న 75 ఎకరాల సామ్రాజ్యంలో రెండువారాలపాటు అణువణువూ గాలించారు! 2017లో మన దేశంలో డేరా సచ్చా సౌదా చీఫ్‌ గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌సింగ్‌ను అరెస్ట్‌ చేసినప్పుడు అతడి అనుచరులు చేసిన రచ్చ గుర్తుందా?

అచ్చం అలాగే.. క్విబొలోయ్‌ అనుచరులు కూడా పోలీసుల తనిఖీలను తీవ్రంగా ప్రతిఘటించారు. వేలాదిగా తరలివచ్చి పోలీసులతో ఘర్షణకు దిగారు. అయినా పోలీసులు వెనక్కి తగ్గలేదు. ప్రత్యేక నిఘా పరికరాలను తెప్పించి.. వాటిలో నమోదైన హృదయస్పందల ఆధారంగా అతడు అక్కడే అండర్‌గ్రౌండ్‌లో ఒక బంకర్‌లో దాక్కుని ఉన్నట్టు గుర్తించి అరెస్ట్‌ చేశారు. అతడితోపాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకుని రాజధాని మనీలాకు తరలించారు. క్విబొలోయ్‌ లాయర్లు మాత్రం అతడే తనంత తానుగా లొంగిపోయాడని చెబుతున్నారు. తన అరెస్టు వెనుక సైతాను హస్తం ఉందని క్విబొలోయ్‌ ప్రకటించాడు.


  • ఇవీ అభియోగాలు..

ఫిలిప్పీన్స్‌లో పేదరికంలో మగ్గిపోతున్న చిన్నారులకు దాతృత్వం పేరుతో అమెరికాలోనూ ఆధ్యాత్మిక దుకాణం తెరిచిన క్విబొలోయ్‌పై 2021లో అమెరికా పోలీసులు చిన్నపిల్లల సెక్స్‌ట్రాఫికింగ్‌, మోసం, భారీగా నగదు అక్రమ రవాణా వంటి కేసులు పెట్టారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. దైవకార్యం పేరిట క్విబొలోయ్‌ ఫిలిప్పీన్స్‌ నుంచి బాలికలను, యువతులను అమెరికాకు తీసుకెళ్లేవాడు. వారంతా.. పగటిపూట విరాళాలు సేకరించాల్సి ఉంటుంది.

రాత్రిపూట.. ‘నైట్‌ డ్యూటీ’ పేరిట వేసే ప్రత్యేక డ్యూటీలో భాగంగా అతడికి లైంగిక సేవలు అందించాలి. అందుకు ఒప్పుకొన్నవారికి డిస్నీలాండ్‌ సందర్శన, ప్రైవేటు జెట్‌ విమానంలో టూర్ల వంటి ప్రోత్సాహకాలు ఇచ్చేవారు. కాదన్నవారికి ‘శాశ్వత నరకం’ తప్పదని బెదిరించేవారు. ‘సైతాను బిడ్డ’ అని రాసి ఉన్న దుస్తులువారికి వేసి గదుల్లో బంధించేవారు. ఈ విషయాలన్నీ 2021లోనే బయటపడినా.. అతడు అప్పటి ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే బాల్యస్నేహితుడు, ఆధ్యాత్మిక సలహాదారు కావడంతో అతడి అరెస్టుకు ఎవరూ సాహసించలేదు.

2022 జూన్‌లో డ్యుటెర్టే పదవీకాలం ముగిశాక క్విబొలోయ్‌కి కష్టాలు మొదలయ్యాయి. ఫిలిప్పీన్స్‌ ప్రభుత్వం కూడా అతడిపై అరెస్ట్‌ వారంట్‌ జారీ చేసింది. ఆ ఆశ్రమంలోని ఒక కొండమీద అతడికో కోట ఉంది దానిపేరు.. ‘గార్డెన్‌ ఆఫ్‌ ఈడెన్‌ రిస్టోర్డ్‌’ అని పేరు పెట్టుకున్నాడు. సొంత టీవీ, రేడియో, సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ కూడా ఉన్నాయి. తనకు ఫిలిప్పీన్స్‌లోనే 40 లక్షల మంది అనుచరులు.. ప్రపంచవ్యాప్తంగా మరో 30 లక్షల మంది దాకా భక్తులున్నారని గతంలో ఒకసారి ప్రకటించాడు.

Updated Date - Sep 10 , 2024 | 03:55 AM