Air Pollution: వాయు కాలుష్యం ప్రభావం.. ఈ నగరాల్లో 33 వేల మంది మృతి
ABN , Publish Date - Jul 04 , 2024 | 08:32 AM
దేశంలోని 10 నగరాల్లో ఏటా వాయుకాలుష్యంతో దాదాపు 33వేల మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్(Lancet Planetary Health) నివేదిక వెల్లడించింది. స్వచ్ఛమైన వాయు ప్రమాణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచించిన ప్రతీ క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
ఢిల్లీ: దేశంలోని 10 నగరాల్లో ఏటా వాయుకాలుష్యంతో దాదాపు 33వేల మరణాలు సంభవిస్తున్నాయని లాన్సెట్ ప్లానెటరీ హెల్త్(Lancet Planetary Health) నివేదిక వెల్లడించింది. స్వచ్ఛమైన వాయు ప్రమాణాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాలు సూచించిన ప్రతీ క్యూబిక్ మీటర్ గాలిలో 15 మైక్రోగ్రాముల కన్నా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. కాలుష్యం బారి నుంచి దేశ పౌరులను రక్షించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు పాటించాలని ఆ నివేదిక సూచించింది.
10 నగరాల్లో PM 2.5 ఎక్స్‌పోజర్, 2008-2019 మధ్య రోజూ వారీ మరణాల గణాంకాలతో డేటా రూపొందించారు. ప్రస్తుతం తక్కువ స్థాయి వాయు నాణ్యత దేశంలో రోజువారీ మరణాల రేటును పెంచుతోందని అధ్యయనం కనుగొంది. 10 నగరాలైన.. అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి, పుణె, సిమ్లా, వారణాసిలో సంవత్సరానికి 33 వేల మరణాలు చోటు చేసుకుంటున్నాయని నివేదిక పేర్కొంది.
డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న వాయుకాలుష్య స్థాయిలే ఇందుకు కారణమని తేల్చేసింది. ఆర్థిక రాజధాని ముంబయి, బెంగళూరు, కోల్‌కతా, చెన్నైల్లో వాయు కాలుష్యం అధికంగా లేదని చెప్పుతున్నప్పటికీ మరణాలు నమోదవుతున్నట్లు పేర్కొంది. ప్రభుత్వాలు జాతీయ వాయు నాణ్యత ప్రమాణాలను కఠినతరం చేయాలని సూచించింది. 2008-2019 మధ్య10 నగరాల్లో మొత్తం మరణాలలో 7.2 శాతం కాలుష్యం కారణంగా నమోదైన మరణాలుగా పేర్కొంది.
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రత అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. అధిక మరణాలు ఇక్కడే సంభవిస్తున్నాయని నివేదించింది. ఇక్కడ ఏటా కాలుష్యం ప్రభావంతో 12 వేలకుపైగా మరణాలు సంభవిస్తున్నాయని వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో వారణాసి, ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూర్ వంటి నగరాలు ఉన్నాయి.
సిమ్లాలో అత్యల్ప వాయు కాలుష్యం నమోదవుతున్నాయి. సస్టైనబుల్ ఫ్యూచర్స్ కోలాబరేటివ్, అశోకా యూనివర్సిటీ, సెంటర్ ఫర్ క్రానిక్ డిసీజ్ కంట్రోల్, స్వీడన్‌లోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్, హార్వర్డ్, బోస్టన్ విశ్వవిద్యాలయాలు, ఇతర పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు.