Share News

కేరళలో నిఫా వైరస్‌ సోకిన బాలుడి మృతి

ABN , Publish Date - Jul 22 , 2024 | 04:24 AM

కేరళలోని మలప్పురం జిల్లా పందిక్కడ్‌లో ప్రమాదకర నిఫా వైరస్‌ సోకిన 14 ఏళ్ల బాలుడు కోజికోడ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈమేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు. ఆ బాలుడికి

కేరళలో నిఫా వైరస్‌ సోకిన బాలుడి మృతి

ప్రత్యేక బృందాన్ని పంపనున్న కేంద్రం

కోళికోడ్‌లో పలువురి ఐసోలేషన్‌

పుణె నుంచి మొబైల్‌ ల్యాబ్‌

బాలుడికి దగ్గరగా ఉన్న 63 మందికి వైద్య పరీక్షలు

గుజరాత్‌ను వణికిస్తున్న చాందీపుర వైరస్‌

50 కేసులు నమోదు.. 16 మంది మృతి!

అప్రమత్తమైన ఆరోగ్యశాఖ.. నివారణకు చర్యలు

కోజికోడ్‌, జూలై 21 : కేరళలోని మలప్పురం జిల్లా పందిక్కడ్‌లో ప్రమాదకర నిఫా వైరస్‌ సోకిన 14 ఏళ్ల బాలుడు కోజికోడ్‌లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. ఈమేరకు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌ ప్రకటించారు. ఆ బాలుడికి ఆదివారం ఉదయం 10.50 గంటలకు తీవ్ర గుండెపోటు వచ్చిందని, చికిత్స చేసి రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయన్నారు. అంతర్జాతీయ నిబంధనలప్రకారం అతడికి అంత్యక్రియలు జరుగుతాయన్నారు. ఆ బాలుడు చికిత్స పొందిన కోజికోడ్‌ వైద్య కళాశాలలో ముగ్గురు వ్యక్తులను ఐసొలేషన్‌లో ఉంచినట్లు మంత్రి చెప్పారు. అలాగే మంజేరి వైద్య కళాశాలలో నలుగురు హై రిస్క్‌ కేటగిరీలో ఉన్న వ్యక్తులు చేరారని, వారిలో ఒకరు ఐసీయూలో ఉన్నారని తెలిపారు. మృతి చెందిన బాలుడికి దగ్గరగా మసలిన 246 మందిలో 63 మందిని హై రిస్క్‌ కేటగిరీగా గుర్తించామన్నారు. వారందరికీ వైద్య పరీక్షలు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో వారికి వైద్య పరీక్షలు చేసేందుకు తగిన ల్యాబ్‌లు ఉన్నాయని, అలాగే పుణె జాతీయ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఒక మొబైల్‌ ల్యాబ్‌ రానున్నట్లు మంత్రి చెప్పారు. నిఫా వైరస్‌ బయటపడిన పందిక్కడ్‌తోపాటు రెండు పంచాయతీల్లోని 33,000 ఇళ్లలో జ్వరాలపై పరిశీలన చేయనున్నట్లు చెప్పారు.

పందిక్కడ్‌కు మూడు కిలోమీటర్ల వరకు ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి తెప్పించి పుణె వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌లో భద్రపరచిన మోనోక్లోనల్‌ యాంటీబాడీలు కూడా రాష్ట్రానికి చేరినట్లు మంత్రి వీణా జార్జ్‌ వెల్లడించారు. కాగా కేరళ రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని పంపనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. నిఫా వైరస్‌ ప్రబలిన ప్రాంతంలో అందుకు కారణాలను గుర్తించేందుకు ఈ బృందం సహకరిస్తుంది. కోజికోడ్‌లో చనిపోయిన బాలుడి నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపగా నిఫా వైర్‌సగా నిర్ధారించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. చనిపోయిన బాలుడికి దగ్గరగా మసలిన వారిని గుర్తించి కచ్చితంగా క్వారంటైన్‌ చేయాల్సిందిగా కేరళ ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపింది. గబ్బిలాల్లో(ఫ్రూట్‌ బ్యాట్‌) నిఫా వైరస్‌ ఉంటుంది. అవి తగిలిన చెట్ల పండ్లను తిన్నవారికి ఈ వైరస్‌ సోకుతోంది. కేరళలో కోజికోడ్‌ జిల్లాలో 2018, 2021, 2023లో, ఎర్నాకుళం జిల్లాలో 2019లో నిఫా వైరస్‌ ప్రబలింది. కోజికోడ్‌, వయనాడ్‌, ఇడుక్కి, మలప్పురం, ఎర్నాకుళం జిల్లాల్లోని గబ్బిలాల్లో నిఫా వైరస్‌ యాంటీ బాడీలను గుర్తించారు.

Updated Date - Jul 22 , 2024 | 04:24 AM