Share News

Amit Shah: ల్యాండ్ జీహాద్, లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్న సోరెన్‌.. అమిత్‌‌షా నిప్పులు

ABN , Publish Date - Jul 20 , 2024 | 06:38 PM

గిరిజన ముఖ్యమంత్రిగా గిరిజనుల స్థితిగతులను పట్టించుకోవడానికి బదులు 'ల్యాండ్ జీహాద్', 'లవ్ జీహాద్'లను జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. దీంతో భూములు, జనాభా మధ్య సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు.

Amit Shah: ల్యాండ్ జీహాద్, లవ్ జీహాద్‌ను ప్రోత్సహిస్తున్న సోరెన్‌.. అమిత్‌‌షా నిప్పులు

రాంచీ: గిరిజన ముఖ్యమంత్రిగా గిరిజనుల స్థితిగతులను పట్టించుకోవడానికి బదులు 'ల్యాండ్ జీహాద్', 'లవ్ జీహాద్'లను జార్ఖాండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) ప్రోత్సహిస్తున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) అన్నారు. దీంతో భూములు, జనాభా మధ్య సమతుల్యం దెబ్బతింటోందని చెప్పారు. వేలాది మంది చొరబాటుదారులు గిరిజన అమ్మాయిలను వివాహం చేసుకుని, సర్టిఫెకెట్లు పొందుతున్నారని, భూములు కొనుగోలు చేస్తు్న్నారని అన్నారు. ఇప్పటికే గిరిజనుల జనాభా తగ్గిపోగా, రాబోయే రోజుల్లో గిరిజనుల జనాభా మరింత తగ్గిపోనుందని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తే శ్వేతపత్రం విడుదల చేయడం ద్వారా గిరిజనుల భూములు, భౌగోళిక ముఖచిత్రం, రిజర్వేషన్లకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు.


రాంచీలో శనివారంనాడు జరిగిన జార్ఖాండ్ బీజేపీ వర్కింగ్ కమిటీ సమావేశంలో అమిత్‌షా మాట్లాడుతూ, జేఎంఎం-కాంగ్రెస్ కూటమి అవినీతికి పాల్పడుతూ, గిరిజనులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని అన్నారు. బీజేపీ కార్యకర్తలు ఓటర్ల వద్దకు వెళ్లి హేమంత్ సోరెన్ ప్రభుత్వ వైఫల్యాలను వారి దృష్టికి తీసుకురావాలని సూచించారు.


జార్ఖాండ్‌ను తెచ్చింది మేమే..

జార్ఖాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది, అభివృద్ధి చేసింది బీజేపీయేనని అమిత్‌షా గుర్తుచేశారు. గత పదేళ్లలో జార్ఖాండ్‌ అభివృద్ధికి కాంగ్రెస్ రూ.84 వేల కోట్లు ఇస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.3 లక్షల 84 వేల కోట్లు రాష్ట్రానికి ఇచ్చారని చెప్పారు. నక్సలిజంతో రాష్ట్రం ఎప్పుడూ అల్లాడుతుండేదని, మోదీ ప్రభుత్వం బీహార్, జార్ఖాండ్‌లలో నక్సలిజాన్ని నిర్మూలించిందని అన్నారు.

Punjab: విద్యుత్, విద్య ఉచితం.. ఎన్నికల ప్రచారానికి సునీత కేజ్రీవాల్ శ్రీకారం


ఆ డబ్బెవరిది?

కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రూ.300 కోట్లు, మినిస్టర్ పీఏ ఇంట్లో రూ.30 కోట్లు పట్టుబడ్డాయని, ఆ సొమ్ము ఎవరితో, ఎక్కడి నుంచి వచ్చిందో కాంగ్రెస్ చెప్పగలదా అని అమిత్‌షా ప్రశ్నించారు. అలాంటి అవినీతి పరులతో నడుస్తున్న కాంగ్రెస్‌, జేఎంఎం ఒకరితో ఒకరు అంటకాగుతున్నాయని విమర్శించారు. జార్ఖాండ్ సమస్యలను హేమంత సోరెన్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని, తన సొంత కుటుంబం అభివృద్ధి చెందితే అదే గిరిజనుల అభివృద్ధిగా ఆయన భావిస్తుంటారని విమర్శించారు. గిరిజన మహిళను భారత రాష్ట్రపతిగా చేసిన క్రెడిట్ బీజేపీదేనని చెప్పారు. ఓబీసీల సంక్షేమానికి మోదీ కట్టుబడి ఉన్నారని, వారి కోసం కమిషన్ వేసి అన్ని కేంద్ర పరీక్షల్లోనూ 27 శాతం రిజర్వేషన్ కల్పించారని, వారి హక్కులను కాపాడారని అన్నారు. మోదీ మంత్రివర్గంలో కూడా ఎక్కువ మంది వెనుకబడిన తరగతుల వారేనని, సోరెన్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి మోదీ ప్రభుత్వానికి జార్ఖాండ్ ప్రజలు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.

For More National News and Telugu News..

Updated Date - Jul 20 , 2024 | 06:38 PM