Share News

Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

ABN , Publish Date - Oct 08 , 2024 | 04:48 AM

నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

 Amit Shah : నక్సలైట్లతో అంతిమ యుద్ధం

  • 2026 మార్చి నాటికి నక్సలిజం నిర్మూలన.. త్వరలో మావోయిస్ట్‌ రహిత రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్‌

  • నక్సలైట్ల ఏరివేతలో తెలంగాణ, ఏపీ సంపూర్ణ సహకారం

  • సీఎంల సమావేశంలో అమిత్‌ షా

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 7(ఆంధ్రజ్యోతి): నక్సలైట్లతో యుద్ధం అంతిమ దశలో ఉందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి సమాజంలోని చివరి వ్యక్తికీ చేరాలంటే నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడం అవసరమని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల సహకారంతో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించగమని విశ్వాసం వ్యక్తం చేశారు. గత కొద్ది సంవత్సరాల్లో 24 మంది నక్సల్‌ అగ్రనేతలతో పాటు ఎన్నో దళాలను మట్టుబెట్టామన్నారు. రెండు రోజుల క్రితం 31మంది మావోయిస్టుల ఏరివేతను ఆయన ప్రస్తావిస్తూ త్వరలోనే ఛత్తీసగఢ్‌ మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఆవిర్భవించబోతోందని చెప్పారు.

ఈ ఏడాది 230 మంది నక్సలైట్లను మట్టుబెట్టామని, 812 మందిని అరెస్టు చేశామని, 723 మంది లొంగిపోయారని ఆయన చెప్పారు. నక్సలైట్ల ఏరివేతలో ఏపీ, తెలంగాణ, ఒడిషా, మహారాష్ట్ర, ప్రభుత్వాలు సంపూర్ణ సహకారం అందించాయన్నారు. నక్సలైట్లు అభివృద్దికి అడ్డంకిగా మారారని, మానవ హక్కులను తీవ్రంగా అణచివేస్తున్నారని షా విమర్శించారు. నక్సలైట్ల మూలంగా మందుపాతరలు పేలి వేలాది మంది ఆదివాసీలు మరణించారని తెలిపారు. నక్సలైట్ల ఏరివేత ప్రాంతాల్లో 12 హెలికాఫ్టర్లు వినియోగిస్తున్నామని, ఈ కారణంగా పోలీస్‌ బలగాల మరణాల సంఖ్య తగ్గిందన్నారు. నక్సలైట్లు ఇప్పటికైనా ఆయుధాలను అప్పగించి లొంగిపోవాలని, జన జీవన స్రవంతిలో చేరాలని షా పిలుపునిచ్చారు.


వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో టెలీ కమ్యూనికేషన్లు, ఆరోగ్య సౌకర్యాలు, విద్య, తాగు నీరు వంటి కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్న ఆయన పదేళ్లలో 544 దుర్భేద్యమైన పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. 14,400 కిలోమీటర్ల రహదారులు నిర్మించామని, 6 వేల మొబైల్‌ టవర్లు, 165 ఏకలవ్య స్కూళ్లను ఏర్పాటు చేశామని షా చెప్పారు. ఆపరేషన్‌ కగార్‌ పేరిట నక్సల్స్‌ ఏరివేత కార్యక్రమాలు కొనసాగుతున్న తీరును ఈ సమావేశంలో సమీక్షించారు.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్దిని, మావోయిస్టుల నిర్మూలనపై ముఖ్యమంత్రులు నెలకోసారి అయినా సమీక్షించాలని, డీజీపీలు 15 రోజులకోసారి సమీక్షించాలని షా కోరారు. డీజీపీలు పారామిలటరీ దళాల శిబిరాలకు వె ళ్లి ఒక రాత్రి అక్కడే బస చేయాలని సూచించారు. ఈ సమావేశానికి మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రులు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శులు, డీజీపీలు, కేంద్ర మంత్రులు, పలు కీలక శాఖల కార్యదర్శులు, వివిధ భద్రతా విభాగాల అధినేతలు, ఇంటలిజెన్స్‌ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, ఏపీ హోంమంత్రి అనిత ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 04:48 AM