Share News

Supreme Court: ఉద్యోగం నుంచి మహిళ తొలగింపు.. కేంద్రానికి షాకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు

ABN , Publish Date - Feb 21 , 2024 | 07:09 PM

పెళ్లి తర్వాత ఒక మహిళను ఉద్యోగం నుంచి తొలగించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాహాన్ని సాకుగా చూపి మహిళను విధుల నుంచి తొలగించడం అనేది వివక్షాపూరితమైనదని, లింగ వివక్ష చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించదని పేర్కొంది.

Supreme Court: ఉద్యోగం నుంచి మహిళ తొలగింపు.. కేంద్రానికి షాకిస్తూ సుప్రీంకోర్టు తీర్పు

పెళ్లి తర్వాత ఒక మహిళను ఉద్యోగం నుంచి తొలగించడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాహాన్ని సాకుగా చూపి మహిళను విధుల నుంచి తొలగించడం అనేది వివక్షాపూరితమైనదని, లింగ వివక్ష చూపే ఏ చట్టాన్ని రాజ్యాంగం అనుమతించదని పేర్కొంది. సైన్యంలో నర్సుగా పని చేసే ఓ మహిళను పెళ్లి తర్వాత అర్ధాంతరంగా తొలగించిన కేసు విచారణలో భాగంగా.. సుప్రీంకోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు.. ఆ మహిళకు నష్టపరిహారం కింద రూ.60 లక్షలు ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెలీనా జాన్ (Seline John) అనే మహిళ సైన్యంలో నర్సుగా పని చేసేవారు. అయితే.. 1988లో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెను విధుల నుంచి తొలగించారు. ఆ సమయంలో ఆమె లెఫ్టినెంట్ హోదాలో ఉన్నారు. తనను ఇలా అర్థాంతరంగా తొలగించడంపై మండిపడ్డ ఆమె.. న్యాయం కోసం అలహాబాద్ హైకోర్టుని (Allahabad High Court) ఆశ్రయించారు. దీనిపై ట్రైబ్యునల్‌కు వెళ్లమని న్యాయస్థానం సూచించడంతో.. ఆమె 2012లో సాయుధ దళాల ట్రైబ్యునల్‌ని (Armed Forces Tribunal) ఆశ్రయించారు. సెలీనా అభ్యర్థనని విచారించిన ట్రైబ్యునల్.. ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. సెలీనాను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. అయితే.. ఈ తీర్పుపై కేంద్రం 2019లో సుప్రీంకోర్టులో సవాలు చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం దీనిని విచారించింది.

ఈ వ్యవహారంలో ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. ఇటీవల సెలీనాకు అనుకూలంగా తీర్పుని వెలువరించింది. 2012లో ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుని సమర్థించింది. అలాగే.. (1977లో ప్రవేశపెట్టిన) పెళ్లి కారణంతో మిలిటరీ నర్సింగ్ సర్వీస్ నుంచి తొలగించేందుకు అనుమతించే నిబంధనని 1995లో ఉపసంహరించుకున్న విషయాన్ని ప్రస్తావించింది. అయితే.. సెలీనాను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పుని మాత్రం సవరించింది. విధుల్లోకి తిరిగి తీసుకోవడానికి బదులుగా రూ.60 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు అందిన ఎనిమిది వారాల్లోగా కేంద్రం పరిహారం చెల్లించాలని కోర్టు పేర్కొంది.

Updated Date - Feb 21 , 2024 | 07:11 PM